Share News

వదలని క్వారీ గండం

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:24 AM

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బొప్పారంలో గ్రానైట్‌ క్వారీ కోసం తవ్విన గుంతలో పడి ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇందులో జూలై 17న నలుగురు మృత్యువాత పడిన ఘటన మరువకముందే శనివారం ఇందులో మరొకరు నీటమునిగి చనిపోయారు.

వదలని క్వారీ గండం
తవ్వకాలు చేసి వదిలేసిన క్వారీ గుంత

క్వారీలో పడి కొనసాగుతున్న విషాదాలు

గ్రానైట్‌ తీసి గుంతలను పూడ్చకుండా వదిలేసిన కాంట్రాక్టర్‌

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బొప్పారంలో గ్రానైట్‌ క్వారీ కోసం తవ్విన గుంతలో పడి ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇందులో జూలై 17న నలుగురు మృత్యువాత పడిన ఘటన మరువకముందే శనివారం ఇందులో మరొకరు నీటమునిగి చనిపోయారు. గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో మూగజీవాలతో పాటు మనుషులు మృత్యువాత పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు.

బొప్పారం గ్రామంలో రాజకీయ నాయకుల ప్రోద్భలంతో గ్రానైట్‌ క్వారీకి అనుమతులు తెచ్చుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విలువైన రాయిని తరలించి క్వారీ గుంతలను వదిలేసి వెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంభద్రాద్రి జిల్లా కేంద్రానికి చెందిన వీరునాయక్‌ పదేళ్ల కిందట బొప్పారం గ్రామంలోని 112 సర్వే నెంబర్‌లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకున్నాడు. ఐదు ఎకరాలకు క్వారీ తవ్వకాలకు అనుమతి రాకపోవడంతో పక్కనే ఉన్న కొంతమంది రైతుల భూమిని వారికి తెలియకుండా కలిపి అధికారులకు పెద్దమొత్తంలో మామూళ్లు ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల తర్వాత అదే గ్రామంలో 138, 139, 141 సర్వే నెంబర్లలోని భూమిని కొనుగోలు చేసి మరో అనుమతి తీసుకొని దాదాపు ఆరేళ్లుగా గ్రానైట్స్‌ తవ్వకాలు చేపట్టాడు. ఇక్కడ కూడా తప్పుడు రికార్డులతో అనుమతులు తెచ్చుకున్నట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఎలాంటిచర్యలు తీసుకోలేదు. సుమారు ఆరేళ్ల పాటు భారీగా తవ్వకాలు చేపట్టిన వీరు నాయక్‌ తన అన్నదమ్ముల వివాదంలో చిక్కుకుని క్వారీని వదిలేశారు. క్వారీ గుంతను పూడ్చకుండా కాంట్రాక్టర్‌ వదిలేసి వెళ్లాడని ఇదే విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా అటువైపు రాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఘటనలు చోటుచేసుకుంటున్నా...

ఆ క్వారీ గుంతలు స్థానికులకు ప్రాణగండంగా మారాయి. జూలై 17వతేదీన ఖమ్మం పట్టణానికి చెందిన రెడ్డి శ్రీపాల్‌రెడ్డి అతడి మిత్రుడు చామలరాజు, కుటుంబంతో అత్తగారిల్లు అయిన బొప్పారం వచ్చి క్వారీ గుంటలో ప్రమాదశాత్తు పడి శ్రీపాల్‌రెడ్డి, అతడి మిత్రుడు రాజు, రాజు కుమార్తె ఉషాంకలు మృతి చెందారు.

ఈ నెల 7వ తేదీన ఇదే క్వారీ గుంతలో విద్యుత మోటార్‌ను తీసేందుకు వెళ్లి మోతె మండలం కోడెలతండాకు చెందిన బానోతు హీరా మృతి చెందాడు. రెండు రోజుల నుంచి మృతదేహం దొరకడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, నీటిలో పరిశోధన చేసే కెమెరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మృతదేహం లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మైనింగ్‌ అధికారుల నిర్లక్ష్యానికి మరిన్ని ప్రాణాలు ఈ గుంటలో బలికావాల్సి వస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం

బొప్పారంలో మైనింగ్‌ క్వారీ గుంతల కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వెంటనే రక్షణ కంచె వేసుకొవాలని కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. కాంట్రాక్టర్‌ వీరునాయక్‌ అన్నదమ్ముల వివాదాల కారణంగా అందుబాటులోకి రావడంలేదు. లీజు రద్దు కోసం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. పైఅధికారులు నుంచి సమాచారం లేదు. మరోసారి లీజు రద్దు కోసం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం.

- రఘునందనరెడ్డి, మైనింగ్‌ ఏడీ


ఫిర్యాదులు చేసినా

క్వారీ గుంతలతో ప్రమాదాలు సంభవిస్తాయని వెంటనే పూడ్చివేయాలని గ్రామస్తులు మైనింగ్‌ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. లీజు సమయం పూర్తికానందున చర్యలు తీసుకోలేదని అధికారు లు పేర్కొంటున్నారు. సాధారణ బావి గుంతల ను తలపించేలా ఉన్న క్వారీ గుంతలు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి. జూలై 17 నాటి ఘటనతో పోలీసులు మైనింగ్‌ అధికారులకు నోటీసులు పంపినప్పటికీ మైనింగ్‌ అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు సమాచారం ఇవ్వకుండా గుంటను పూడ్చకుండా వదిలేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే శనివారం అదే గుంతలో పడి మరొకరు బలి అయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కనీసం మైనింగ్‌ అనుమతులు ఉన్న ప్రాంతంలో ఫినిషింగ్‌ చేసి గేట్లు పెట్టాల్సి ఉండగా ఎలాంటి రక్షణ లేకపోవడం తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా అదికారులు క్వారీ గుంతలను పూడ్చివేయడం కానీ, రక్షణ కంచె ఏర్పాటు చేయడం కానీ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:24 AM