ఉరుములు, మెరుపుల వాన
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:49 AM
భువనగిరిలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ముసురు అర్ధరాత్రి వరకూ కురిసింది. రోజంతా ఎండ, ఉక్కపోతతో సతమతమైన ప్రజలు వర్షపు జల్లులతో ఉపశమనం పొందారు.
ఈదురు గాలుల బీభత్సం
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు
భువనగిరి టౌన్, జూన్ 2: భువనగిరిలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ముసురు అర్ధరాత్రి వరకూ కురిసింది. రోజంతా ఎండ, ఉక్కపోతతో సతమతమైన ప్రజలు వర్షపు జల్లులతో ఉపశమనం పొందారు. వేసవి తీవ్రత అధికంగా ఉండే రోహిణి కార్తెలో అకాల వర్షం, చల్లటి గాలులతో ప్రజలకు ఉపశమనం లభించింది.
భువనగిరి రూరల్: ఈదురు గాలులు ఆదివారం బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా మండలంలోని బీఎన్ తిమ్మాపూర్, వీరవెల్లి, ముస్త్యాలపల్లి, చీమలకొండూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మండలంలోని వీరవెల్లికి చెందిన రైతులు కంచి మల్లయ్య, భిక్షపతి, రేగు మల్లే్‌ష వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రేగు మల్లేశ్ పశువుల కొట్టం పైకప్పు ఎగిరిపోవడంతో మూగ జీవాలు అతలాకుతలమయ్యాయి. బీఎన్ తిమ్మాపూర్‌లో అంగడి సుధాకర్ ఫొటో స్టూడియో పైకప్పు ఎగిరిపోవడంతో విలువైన ఎలక్ర్టానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయి. అదే గ్రా మానికి చెందిన తోటకూరి మల్లయ్య ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.
మోత్కూరు: మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్థంభాలు విరిగాయి. గత వారం, పది రోజులుగా రైతులు పొడి దుక్కిలో పత్తి విత్తనాలు విత్తి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈవర్షంతో విత్తిన పత్తి గింజలు మొలకెత్తుతాయని రైతులంటున్నారు. ఈ వర్షానికి సోమవారంనుంచి రైతులు పత్తి విత్తనాలు విత్తనున్నారు.
వలిగొండ: మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వర్షపు జల్లులు కురిశాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రొద్దుటూరులో పెద్దబోయిన ఇస్తారికి చెందిన ఇంటి రేకుల పైకప్పు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి.
మండలం వర్షపాతం(మిమీ)
బొమ్మలరామారం 22.0
రామన్నపేట 16.5
తుర్కపల్లి(ఎం) 15.0
అడ్డగూడూరు 15.0
మోత్కూరు 12.0
గుండాల 9.0
చౌటుప్పల్ 9.0
రాజాపేట 5.5
ఆలేరు 4.8
చౌటుప్పల్ 4.5
భువనగిరి 3.5
బీబీనగర్ 2.5
మోటకొండూరు 2.5
రాజాపేట 2.3
పోచంపల్లి 1.5
వలిగొండ 1.3
నారాయణపూర్ 0.5