Share News

‘గృహలక్ష్మి’పై ఆశతో అప్పులపాలయ్యారు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:08 AM

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనయనే సా మెతకు సరిగ్గా సరిపోయేలా ఉంది గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల పరిస్థితి.

‘గృహలక్ష్మి’పై ఆశతో అప్పులపాలయ్యారు
గుంజలూరు గ్రామంలో గృహలక్ష్మి పథకంలో మంజూరై తమ సొంత నిధులతో నిర్మించుకుంటున్న ఇల్లు

చివ్వెంల, ఏప్రిల్‌ 7 : నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనయనే సా మెతకు సరిగ్గా సరిపోయేలా ఉంది గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల పరిస్థితి. ఎన్నికల సమయంలో నోటిఫికేషనకు ముందు హడావిడిగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతీ ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు మూడు విడతల్లో ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసి అదరాబాదరాగా లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందజేసింది. వెంటనే శంకుస్థాపనలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు హడావుడి చేయడంతో లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన విడుదల కావడంతో నిధులు విడుదలకాలేదు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. అయితే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ఇంటి పనులు మొదలు పెట్టడంతో చేసేదేమీ లేక అప్పులు తెచ్చి నిర్మాణాలను పూర్తి చేసుకుంటున్నారు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల మాటలను నమ్మి మోసపోయామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా గృహలక్ష్మి పథకంలో ఎంపికైన లబ్ధిదారులను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపిక చేయాలని స్థానిక నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. కొంతమంది నాయకుల మాటలకు తొందరపడకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు.

మండల వ్యాప్తంగా 549 మంది లబ్ధిదారులు ఎంపిక

గృహలక్ష్మి పథకంలో భాగంగా గత ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, అప్పుడున్న స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో చివ్వెంల మండల వ్యాప్తంగా 549 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామానికి 10 నుంచి 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టే క్రమంలో మొదటగా పంచాయతీరాజ్‌ ఏఈ పరిశీలన అనంతరం ఎంపీడీవో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత కలెక్టర్‌కు ఆనలైన ద్వారా వివరాలు, వారి ఫొటోలను పంపిస్తే అప్పుడు ప్రభుత్వం నుంచి నగదు అందాల్సి ఉంది. లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టిన కొద్దికాలానికే అంతా ఎలక్షన హడావుడిలో అధికారులు ఉండడంతో లబ్ధిదారుల పనులను గుర్తించిందీ లేదు, ఆనలైన చేసిందీ లేకపోవడంతో ప్రస్తుతం వారు తీవ్రంగా నష్టపోయారు.

హడావిడిగా చేశారని రద్దు..

గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని హడావిడిగా తీసుకువచ్చారని, బీఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆరోపిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసింది. ఆ పథకం స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇళ్లు, రూ.5 లక్షలు, స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో గత ప్రభుత్వ హామీతో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కొందరు ఉన్న చిన్నపాటి రేకుల ఇళ్లతో పాటు పూరిగుడిసెలను తొలగించుకున్నారు. తమ వద్ద ఉన్న కొంతడబ్బుతో పాటు ప్రభుత్వం అందించే రూ.3 లక్షలతో ఇంటి నిర్మాణం చేపట్టాలని పనులు ప్రారంభించారు. ప్రస్తుతం అలా మొదలైన ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. తప్పని పరిస్థితుల్లో కొందరు అప్పులు చేసి ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. గృహలక్ష్మి పథకం డబ్బులు వస్తాయని ఉన్న గుడిసెను పోగొట్టుకుని కొందరు, అప్పుల పాలై కొందరు లబోదిబోమంటున్నారు.

గృహలక్ష్మి వస్తదని ఉన్న ఇళ్లు కూల్చిన

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో నాకు ఇళ్లు వచ్చింది. దీంతో గతంలో ఉన్న ఇంటిని కూల్చి, పనులు మొదలు పెట్టా. ఈ లోపు ప్రభుత్వం మారింది. నాకు ఒక్క రూపాయ రాలేదు. అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం చేస్తున్న, ఇందిరమ్మ ఇళ్లు పథకంలోనైనా గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన తమకు న్యాయం చేయాలి.

- పల్లేటి విజయ, గుంజలూరు, గృహలక్ష్మి లబ్ధిదారురాలు.

ఎలాంటి ఆదేశాలు రాలేదు

గృహలక్ష్మి పథకం ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పథకంలో సొంత డబ్బులతో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారుల విషయంలో తమకు ఎలాం టి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత తెలియజేస్తాం.

- చక్రాల సంతో్‌షకుమార్‌, ఎంపీడీవో, చివ్వెంల మండలం.

90 శాతం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇచ్చారు

గృహలక్ష్మి పథకాన్ని మండలంలో ఎలక్షన ముందు హడావుడిగా ప్రారంభించి, కాంగ్రె్‌సలో ఉన్న కార్యకర్తలను, నాయకులను బెదిరించి, ఇళ్ల పేరుతో మభ్యపెట్టి ఆ పార్టీలో చేరుకున్నారు. 90శాతానికి పైగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇల్లను మంజూరు చేశారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం సాయం చేస్తుంది.

- పఠాన సమీర్‌ఖాన, యూత కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు, చివ్వెంల.

Updated Date - Apr 08 , 2024 | 12:08 AM