Share News

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:08 AM

జిల్లాలో వచ్చే లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ స్టేషన్ల నిర్ధారణ, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అంశాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన

కలెక్టర్‌ హరిచందన దాసరి

నల్లగొండ టౌన్‌, మార్చి 7: జిల్లాలో వచ్చే లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ స్టేషన్ల నిర్ధారణ, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అంశాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల సంఖ్య 1,500 దాటిన చోట అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, అలాగే ఓటరు నివాసానికి పోలింగ్‌ కేంద్రానికి మధ్య 2కిలోమీటర్లకు మించి దూరం ఉన్న చోట పోలింగ్‌ కేంద్రం మార్పునకు అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం 1,633 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, క్షేత్రస్థాయిలో ఈఆర్‌వోలు పరిశీలించిన అనంతరం 43 అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, అలాగే 36 పోలింగ్‌ కేంద్రాల మార్పునకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు తెలిపారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. దరఖాస్తుకు 2023 నవంబరు నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు నిండి ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్‌ కలెక్టర్‌ ఎన్‌.నటరాజ్‌, పలు రాజకీయపార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి : ఎస్పీ

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని ఎస్పీ చందనాదీప్తి పోలీస్‌ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అధికారులు ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ రోజు, ఆ తరువాత రోజు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో విధిగా పర్యటించాలన్నారు. ఎన్నికల సందర్భంగా సమస్యలు సృష్టించే వారిని గుర్తించి బైండోవర్‌ చేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించిన, సోషల్‌ మీడియాలో అసత్య ప్రసారాలు, ఉద్దేశపూర్వక, వ్యక్తిగతంగా రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు చేసిన వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మద్యం, డబ్బు పంపిణీ కాకుండా ప్రత్యేకంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.రాములునాయక్‌, ఎస్‌బీ డీఎస్పీ జి.రమేష్‌, డీఎస్పీలు శివరాంరెడ్డి, గిరిబాబు, రాజశేఖర్‌రాజు, డీసీఆర్‌బీ డీఎస్పీ సైదా, సీఐలు, ఎస్‌ఐలు, మాస్టర్‌ టైన్రర్‌ పరమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:08 AM