Share News

వేడెక్కుతోన్న అవిశ్వాస రాజకీయాలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:51 AM

భువనగిరి మునిసిపల్‌ అవిశ్వాస రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుత చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్యపై పార్టీలకతీతంగా 35 మంది సభ్యులకు 31 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్‌ ఈ నెల 23న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

వేడెక్కుతోన్న అవిశ్వాస రాజకీయాలు

ఈ నెల 23న సమావేశం

నూతన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలపై చట్టంలో అస్పష్టత

భువనగిరి టౌన్‌, జనవరి 16: భువనగిరి మునిసిపల్‌ అవిశ్వాస రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుత చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్యపై పార్టీలకతీతంగా 35 మంది సభ్యులకు 31 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్‌ ఈ నెల 23న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక సమావేశం తేదీ సమీపిస్తున్న కొద్దీ అవిశ్వాస రాజకీయాలు రంగులు మారుతున్నట్లు ప్రచారమవుతోంది. ఎమ్మెల్యేగా ఓడినప్పటినుంచి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అకస్మాత్తుగా బీఆర్‌ఎస్‌ అసంతృప్త కౌన్సిలర్లతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. కౌన్సిల్‌లో బీఆర్‌ఎ్‌సకు 20 మంది సభ్యులుండగా 16 మంది సభ్యులు, కాంగ్రెస్‌ తొమ్మిది మంది, బీజేపీ ఆరుగురితో కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు చేశారు. అవిశ్వాసం నెగ్గిన అనంతరం కొలువుదీరే నూతన పాలకవర్గంపై చర్చలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ తిరిగి పాలకపక్షంగా ఉండాలని ప్రయత్నం చేస్తుండగా, ఆ పార్టీలోని విభేదాల ఆసరా గా మునిసిపాలిటీపై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త కౌన్సిలర్లతో మాజీ ఎమ్మెల్యే సమావేశమై అవిశ్వాస తీర్మానం, తదనంతరం పరిణామాలపై చర్చించారు. అసంతృప్త 16 మంది కౌన్సిలర్లు ఐక్యం గా ఉంటే ప్రస్తుత చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ను రాజీనామా చేయించి తిరిగి మునిసిపాలిటీపై గులా బీ జెండాను ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నట్లు ప్రచారమవుతోంది. ఈ మేరకు అసంతృప్త కౌన్సిలర్లు తమ ఐక్యతను చాటేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు, రెండు రోజుల్లో మరోమారు క్యాంప్‌నకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే మునిసిపాలిటీపై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలని ఆరాటపడుతున్న ఆ పార్టీ కౌన్సిలర్లలో కూడా తమ పార్టీ నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఆశావాహులు పట్టుదలతో వ్యవహరిస్తుండడంతో ఆ పార్టీలో అసమ్మతి పొడసూపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ నెల 23న జరిగే అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశం చుట్టూ మునిసిపల్‌ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.

నూతన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు చిక్కులు

చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ను గద్దె దింపడం సులువుగా ఉన్నప్పటికీ నూతన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు మాత్రం న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని మునిసిపల్‌ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు గత ప్రభుత్వం చేసిన మునిసిపల్‌ చట్ట సవరణలే కారణమని అధికారులు చెబుతున్నారు. 2019 మునిసిపల్‌ సవరణ చట్టం ప్రకారం మూడేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం లేదు. కానీ మూడేళ్ల కాల పరిమితి గడువు ముగిసిన వెంటనే రాష్ట్రంలో మునిసిపల్‌ అవిశ్వాస రాజకీయాలు వేడెక్కడంతో అప్పటి ప్రభుత్వం హడాహుడిగా అవిశ్వాస కాలపరిమితి గడువును నాలుగేళ్లకు పెంచింది. పెంచిన గడువు పూర్తవడం, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో మరోమారు అవిశ్వాస రాజకీయాలు రగిలాయి.

Updated Date - Jan 17 , 2024 | 12:51 AM