Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

నేటికీ తేలని జంట ఆత్మహత్యల మిస్టరీ

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:56 AM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భువనగిరి హాస్టల్‌ విద్యార్థిను ల ఆత్మహత్యల మిస్టరీ కేసు నేటికీ తేలలేదు. ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్న ఇద్దరు స్నేహితులు భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్య చేసుకొని సరిగ్గా నేటికీ నెల రోజులు.

నేటికీ తేలని జంట ఆత్మహత్యల మిస్టరీ

భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్యకు నేటికి నెల

అందని దర్యాప్తు అధికారుల నివేదికలు

న్యాయం చేయాలంటున్న బాధిత కుటుంబ సభ్యులు

భువనగిరి టౌన్‌, మార్చి 3: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భువనగిరి హాస్టల్‌ విద్యార్థిను ల ఆత్మహత్యల మిస్టరీ కేసు నేటికీ తేలలేదు. ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్న ఇద్దరు స్నేహితులు భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్య చేసుకొని సరిగ్గా నేటికీ నెల రోజులు. ఫిబ్రవరి 4న హాస్టల్‌ గదిలోనే వారు ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. వారి ఆత్మహత్యకు పలువురు, పలు కారణాలు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా తోడయ్యాయని కుటుంబ సభ్యులతో పాటు సామాజిక కార్యకర్తలు, వివిధ పార్టీలు చేసిన ఆరోపణలపై అధికారులు నేటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు.

నెల రోజులు గుడుస్తున్నా..

భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకు న్న అనంతరం సుమారు 15 రోజుల పాటు సంక్షేమ వసతి గృహ భవనాన్ని పలు రాజకీయ పార్టీల, సం ఘాల నాయకులు సందర్శించారు. భువనగిరితో పాటు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జంట ఆత్మహత్యపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (స్కీమ్స్‌) కేఆర్‌ఎ్‌స.లక్ష్మీదేవిని నియమించింది. కలెక్టర్‌ హనుమంత్‌ కే.జెండగే ఆర్డీవో క్యాడర్‌కు చెందిన జిల్లా భూ సేకరణ అధికారి నాగలక్ష్మిని దర్యాప్తు అధికారిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర దర్యాప్తు అధికారి లక్ష్మీదేవి రెండుసార్లు భువనగిరిలో పర్యటించగా జిల్లా దర్యాప్తు అధికారి నాగలక్ష్మి, ఆ బాలికలు చదువుతున్న పాఠశాలలో, హాస్టల్‌లో విచారణ జరిపి పలువురి వాంగ్మూలాలు నమోదు చేశారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొన్న హాస్టల్‌ వార్డెన్‌, పీఈటీ తదితరులను కూడా విచారించి వివరాలు నమోదు చేశారు. కానీ, ఇప్పటివరకు రాష్ట్ర దర్యాప్తు అధికారి నివేదిక అందజేయలేదని, జిల్లా దర్యాప్తు అధికారి ఇటీవల బదిలీపై వెళ్లడంతో దర్యాప్తు మధ్యలోనే నిలిచిందని ప్రచారం సాగుతోంది. అలాగే ఈ కేసుకు కీలకంగా పరిగణిస్తున్న సూసైడ్‌ నోట్‌ను, పోస్టుమార్టం రిపోర్టును ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా సూసైడ్‌ నోట్‌ రాసింది వైష్ణవేనని నిర్ధారణ అయింది. పోస్టుమార్టం రిపోర్ట్‌ వివరాలు అందేందుకు మరికొద్ది సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ అందితేనే కేసు పురోగతి సాధిస్తుందని చెబుతున్నప్పటికీ దర్యాప్తు అధికారుల నివేదికలు అందజేయడంలో జాప్యంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. రెండు నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసినప్పటికీ నిజాలను తేల్చడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సహచరుల ఆత్మహత్యతో భీతిల్లి చదువు వదిలి ఇంటికి వెళ్లిపోయిన 114 మంది విద్యార్థులను తాత్కాలికంగా వేర్వేరు హాస్టళ్లలో సర్దుబాటు చేసినా, భవనాల కొరత కారణంగా హాస్టల్‌లో పూర్తిస్థాయిలో పునరుద్దరించలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. ఏదేమైనా భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్య ఉదంతాన్ని త్వరగా తేల్చి హాస్టల్‌ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని అంతా పేర్కొంటున్నారు.

న్యాయం చేయాలి : కోడి లలిత, భవ్యశ్రీ తల్లి

పిల్లలు ఆత్మహత్య చేసుకొని నేటికి నెల రోజులైం ది. అయినా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవ డం దారుణం. ఇద్దరు బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నప్పటికీ వాస్తవాలను తేల్చడంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చూపుతున్నారు.భవ్యశ్రీ, వైష్ణవిది ఆత్మహత్య కాదు. హత్యేనని ఫిర్యాదు కూడా చే శాం. ప్రభుత్వం హడావుడిగా దర్యాప్తు అధికారులను నియమించింది. కానీ, ఏ ఒక్కరూ మమ్ములను నేటి వరకు సంప్రదించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి చూపి మా కుటుంబాలకు న్యాయం చేయాలి.

ఫోరెన్సిక్‌ నివేదిక అందాకే: కె.సురే్‌షకుమార్‌, భువనగిరి టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌

ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఉదంతంలో ఇప్పటికే సూసైడ్‌ నోట్‌ రిపోర్ట్‌ రాగా, పోస్ట్‌మార్టం ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్‌ అందగానే దర్యాప్తును ముమ్మరం చేస్తాం. అలాగే దర్యాప్తు అధికారుల నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. పారదర్శకంగా విచారణ నిర్వహిస్తాం. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొద్ది రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాం. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం, ఆలస్యం జరగడం లేదు.

Updated Date - Mar 04 , 2024 | 12:56 AM