Share News

అధనపు భారం రూ.55కోట్లు

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:23 AM

ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలు కాకపోవడంతో వస్తు రవాణా వాహనాల యజమానులపై పన్నుల భారం పడుతోంది. సింగిల్‌ పర్మిట్‌ విధానంలో నిబంధనల మేరకు రూ.5వేలు చెల్లిస్తే ఒక లారీ ఏడాదిలో ఎన్నిసార్లయినా పక్కపక్క రాష్ట్రాలకు వస్తు రవాణా చేయవచ్చు. అయితే రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ విధానం అమలు కాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని లారీ యజమానులు వాపోతున్నారు.

అధనపు భారం రూ.55కోట్లు

సింగిల్‌ పర్మిట్‌ లేక చిక్కులు

వస్తు రవాణా వాహనాలపై ఆర్థిక భారం

లారీ వెళ్లొస్తే పర్మిట్‌కు రూ.2వేలు

చెక్‌పోస్టులు ఎత్తివేయాలన్న కేంద్రం

పాటించని ఇరు రాష్ట్రాలు

చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది మామూళ్ల వసూలు!

(కోదాడ)

ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలు కాకపోవడంతో వస్తు రవాణా వాహనాల యజమానులపై పన్నుల భారం పడుతోంది. సింగిల్‌ పర్మిట్‌ విధానంలో నిబంధనల మేరకు రూ.5వేలు చెల్లిస్తే ఒక లారీ ఏడాదిలో ఎన్నిసార్లయినా పక్కపక్క రాష్ట్రాలకు వస్తు రవాణా చేయవచ్చు. అయితే రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ విధానం అమలు కాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని లారీ యజమానులు వాపోతున్నారు.

రాష్ట్ర ఏర్పాటు అనంతరం 158జీవో ప్రకారం 2015-16లో సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోదాడ సమీపంలో రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద, మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి, నాగార్జునసాగర్‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల ఏర్పాటుతో ఇరు రాష్ట్రాలకు సరుకు రవాణా చేసేందుకు వారం పర్మిట్‌కు (ఒకసారి వెళ్లొచ్చేందుకు) రూ.2వేలు, నెలకు రూ.5వేలు ఏడాదికి రూ.60వేలు లారీ యజమానులు చెల్లిస్తున్నా రు. నేషనల్‌ పర్మిట్‌ నిబంధన ప్రకారం కొత్త లారీ కొనుగోలు చేసినప్పుడే రూ.19వేలు పర్మిట్లకు చెల్లిస్తారు. దీం తో లారీ దేశంలో ఎక్కడికైనా, ఎన్నిమార్లయినా తిరిగి రావొచ్చు. అయితే 12 ఏళ్లు దాటిన లారీలకు నేషనల్‌ పర్మిట్‌ నిబంధన వర్తించదు. ఫలితంగా పక్కపక్క రాష్ట్రాలకు సరుకు రవాణకు సింగిల్‌ పర్మిట్‌ తీసుకోవా లి. సింగిల్‌ పర్మిట్‌కు ఏడాదికి రూ.5వేలు కడితే సరిపోతుంది. తెలంగాణ సరిహద్దులో ఉన్న తమిళనాడు, కర్నాటకతోపాటు ఇతర రాష్ట్రాలలో ఈ సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలులో ఉంది. అయితే తెలంగాణ, ఏపీ మధ్య మాత్రం సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలు కాకపోవడంతో నెలకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.60వేలు చెల్లించాల్సి వస్తోందని లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. వీటికి తోడు లారీకి అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నా, సరిహద్దు వద్ద ఉన్న చెక్‌పోస్టులో ఒక్కో లారీ నుంచి రూ.600 వరకు ముడుపులు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒక్క కోదాడ సమీపంలోని రామాపురం చెక్‌పోస్టు నుంచి నిత్యం 400 వస్తు రవాణా లారీలు ప్రయాణిస్తున్నాయి. ముడుపుల చొప్పున లారీల యజమానులు రోజుకు రూ.2.40లక్షలు సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లా చెక్‌పోస్టుల ద్వారా నిత్యం సుమారు 1200 వాహనాల్లో సరుకు రవాణా అవుతోందని లారీ యజమానులు చెబుతున్నారు. వాహనానికి అన్ని పేపర్లు ఉన్నా చెక్‌పోస్టుల వద్ద రూ.600 చొప్పున మామూళ్లు వసూలు చేస్తుండటంతో 1200 వాహనాలకు రోజుకు రూ.7.20లక్షలు అవుతోందని వారు పేర్కొంటున్నారు. వీటికి తోడు ట్యాక్స్‌ల అదనపు భారంతో లారీలు నడపలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం చేసి పారిపోయే డ్రైవర్లకు రూ.7లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలుశిక్ష చట్టాన్ని తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో డ్రైవర్లు పనిచేసేందుకు ఇష్టపడరని, ఫలితంగా రవాణ రంగం మనుగడ కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తివేయాలని కేంద్రం చెప్పినట్టుగా అమలుచేయాలని, మామూళ్లకు చెక్‌పెట్టి, హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

రూ.55కోట్ల అదనపు భారం ఇలా..

ఉమ్మడి జిల్లాలో 10వేలకు పైగా గూడ్స్‌ వాహనాలు ఉన్నాయి. వాటిలో నిత్యం ఇరు రాష్ట్రాలకు సరుకు రవాణా అవుతోంది. జిల్లా నుంచి సిమెంట్‌, ధాన్యం, పప్పులు, పాలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ లాంటి నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 7వేల మంది లారీ ఓనర్లు ఉన్నారు. సింగిల్‌ పర్మిట్‌ విధానం ప్రకారం 10వేల వాహనాలకు రూ.5వేల చొప్పున రూ.5కోట్లు అవుతోంది. సింగిల్‌ పర్మిట్‌ విధానం లేకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాలను నడిపేందుకు 11 నెలల కాలానికి రూ.55కోట్లు అదనంగా చెల్లిస్తున్నారు. పక్క రాష్ట్రాలకు సింగిల్‌ పర్మిట్‌ నిబంధన ఉన్నా, ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి సారించకపోవడంతో ఆర్థికభారం లారీ యజమానులపై ఆర్థిక భారం పడుతోంది. ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం 2019లో చెప్పినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పాటిచడం లేదు.

పెరిగిన పెట్టుబడులు, ఖర్చులు : కనగాల నాగేశ్వరరావు, ఏఐఎంటీసీ మేనేజింగ్‌ కమిటీ సభ్యుడు

1994లో 12టైర్ల లారీపై పెట్టుబడి రూ.4.80లక్షలుగా ఉండేది. 12శాతం వడ్డీతో, 20శాతం డౌన్‌ పేమెంట్‌తో లారీ తీసుకొనేవారం. నేడు అదే లారీకి రూ.18లక్షల పెట్టుబడి పెడుతున్నాం. ఇంకోపక్క పెరుగుతున్న రవాణా ఖర్చులతో లారీలు నడపలేకపోతున్నాం. హైదరాబాద్‌ నుంచి వయా వాడపల్లి మద్రాస్‌కు సుమారు 700కి.మీ సరుకు రవాణాకు రూ.8వేలకు పైగా ఖర్చు వస్తోంది. టన్నుకు కిరాయి రూ.1300కాగా, 17టన్నులకు వచ్చేది రూ.22,110. హైదరాబాద్‌లో గుమస్తా మామూళ్లు రూ.90, బ్రోకర్‌ మామూళ్లు రూ.500, టోల్‌గేట్‌ చార్జీలు రూ.2,800, దిగుమతి మామూళ్లు రూ.110, మద్రా్‌సలో బ్రోకర్‌ మామూళ్లు రూ.400, ఆర్టీవో నాలుగు చెక్‌పోస్టుల వద్ద మామూళ్లు రూ.800లు, నాలుగు కమర్షియల్‌ చెక్‌పోస్టుల వద్ద రూ.800. ఇక పోలీసు మామూళ్లు సుమారు రూ.1000, తెలంగాణలో టోల్‌గేట్‌ల వద్ద రూ.1800 మొత్తం కలిపి రూ.8,300 పైగా రవాణా ఖర్చు వస్తోంది. ఇన్ని ఇబ్బందులతో వాహనాలు నడుపుతున్న లారీ యజమానులకు సింగిల్‌ పర్మిట్‌ విధానాన్ని చేయాలి. చెక్‌పోస్టులు ఎత్తివేసి, మామూళ్లకు స్వస్తి పలికాలి. ఈ నెల 10 లేదంటే 11వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం జగన్‌తో లారీ యజమానులు సమావేశం కానున్నాం. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎంలు సానుకూల నిర్ణయం తీసుకొని సింగిల్‌ పర్మిట్‌ విధానంతోపాటు, చెక్‌పోస్టుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకోవాలి.

రవాణా రంగానికి ప్రభుత్వం అండగా ఉండాలి : గుమ్మడి దుర్గప్రసాద్‌, లారీ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి

దేశ ప్రజలకు అవసరాలైన నిత్యావసర వస్తువులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా సరఫరా చేస్తున్నాం. ఈ రంగానికి అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచుతూ, జరిమానాలు, మామూళ్లు వసూలు చేయడం తగదు. ఇప్పటికే డీజిల్‌ ధరలు పెరిగాయి. కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నాం. రవాణారంగం సాఫీగా నడవాలంటే విభజన చట్టంలోని హామీలను అమలు చేసి, లారీ యజమానులపై భారం పడకుండా చూడాలి.

Updated Date - Jan 05 , 2024 | 12:23 AM