Share News

జిల్లా కేంద్ర ఆస్పత్రి ఇక నుంచి బోధనాస్పత్రి

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:42 AM

జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల ఈవిద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు త్వరలో జరిగే కౌన్సిలింగ్‌ ద్వారా సీట్లు కేటాయించనున్నారు.

జిల్లా కేంద్ర ఆస్పత్రి ఇక నుంచి బోధనాస్పత్రి

పాత కలెక్టరేట్‌లో ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభంకానున్న ప్రభుత్వ వైద్య కళాశాల

225 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌

433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం

కళాశాల ఏర్పాటుకు 20 ఎకరాల స్థలాన్ని విరాళం గా అందజేసేందుకు ముందుకొస్తున్న దాతలు

భువనగిరి టౌన్‌, జూన్‌ 2: జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల ఈవిద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు త్వరలో జరిగే కౌన్సిలింగ్‌ ద్వారా సీట్లు కేటాయించనున్నారు. వాస్తవానికి యాదగిరిగుట్టలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని, అప్పట్లో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అనువైన పరిస్థితులు లేకపోవడంతో భువనగిరి పట్టణ శివారులోని పగిడిపల్లి వద్దగల పాత కలెక్టరేట్‌లో ఈవిద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాల ప్రారంభంకానుంది. భువనగిరి జిల్లా ఆస్పత్రిని వైద్య కళాశాల బోధనా ఆస్పత్రిగా అనుసంధానం చేశారు. ఈమేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలో ఉన్న జిల్లా ఆస్పత్రిని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడిక ల్‌ ఎడ్యూకేషన్‌ (డీఎంఈ) పరిధిలోకి చేరుస్తూ 5 జూలై, 2023న అప్ప టి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కానీ తదనంతరం వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో ఆస్పత్రి బదిలీ ప్రక్రియలో కాస్త జా ప్యం నెలకొన్నది. ఈ నెల 6వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే బదిలీ ప్రక్రియ లాంఛనంగా పూర్తికానుంది. అలాగే మెడికల్‌ కళాశాల లో 433మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు 16 సెప్టెంబరు,2023నే ఆర్థికశాఖ అనుమతులిచ్చింది. దీంతో ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే నియామకాల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు జిల్లా ఆస్పత్రిలో టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న నర్సింగ్‌ స్టాఫ్‌ను రెండు నెలల క్రితమే ఇతర ఆస్పత్రులకు బదిలీచేసి తాత్కాలికంగా ఇక్కడే పోస్టింగ్‌ ఇచ్చారు. కానీ త్వరలోనే ఆ తాత్కాలిక పోస్టింగ్‌లను రద్దుచేయడంతోపాటు ఇప్పటి వరకు పని చేస్తున్న వైద్యులు సహా అన్ని విభాగాల సిబ్బందిని టీవీవీపీ పరిధిలోని ఇతర ఆస్పత్రులకు బదిలీ చేయనున్నారు. త్వరలో నియమించనున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌, తోపాటు 33 విభాగాలకు చెందిన 433 మంది వైద్య కళాశాలతోపాటు జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహించనున్నారు. అయితే ఒకేసారి కాకుండా దఫాలవారీగా నియామక ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్రతిపాదిత పోస్టులన్నింటికీ నూతన నియామకాలు ఉండవని కొన్ని పోస్టులను బదిలీలతో కూడా భర్తీ చేస్తారని తెలుస్తోంది.

బోధనా ఆస్పత్రితోనైనా ప్రైవేట్‌ అక్రమాలకు అడ్డుకట్ట పడేనా.. ?

జిల్లా ఆస్పత్రి చుట్టూ ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులే లక్ష్యంగా దందా సాగిస్తున్న విషయం విధితమే. జిల్లా ఆస్పత్రిలోని సుమారు ప్రస్తుత వైద్యులందరికీ ఆ పరిసరాల్లోనే సొంత క్లినిక్‌లు లేదా ఇతర క్లినిక్‌లకు విజిటింగ్‌ డాక్టర్లుగా ఉన్న నేపథ్యంలో చికిత్సల కోసం జిల్లా ఆస్పత్రికి వస్తున్న రోగుల్లో పలువురిని ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇదే తరహాలో రోగ నిర్ధారణ పరీక్షలలో కూడా జరుగుతోంది. దీంతో పలువురు రోగులు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లకు వెళ్తూ ఆర్థిక దోపిడీకి గురవుతుండగా రెఫరల్‌ వైద్యులు, సిబ్బందికి కమీషన్లు కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యకళాశాల అనుబంధ ఆస్పత్రిగా మారుతున్న జిల్లా ఆస్పత్రిలో పూర్తి హంగులు, విస్తృత వైద్యసేవలు, వైద్య నిపుణులు, అందుబాటులోకి రానుండడంతో ప్రైవేట్‌ దందాకకు అడ్డుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్థలం ఇచ్చేందుకు దాతల పోటీ

జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను పలు దఫాల పరిశీలన అనంతరం యాదగిరిగుట్టలో ప్రారంభించాలని గతంలో నిర్ణయించారు. మండలంలోని మల్లాపూర్‌లో సర్వే నెంబర్‌ 64లో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని అధికారులు భావించారు. అలాగే యాదగిరిగుట్టకు మంజూరైన 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి సైదాపూర్‌లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయింపునకు ప్రతిపాదించారు. కానీ ఆ రెండు స్థలాల కేటాయింపులో జాప్యం నెలకొనడంతోపాటు కళాశాల ఏర్పాటుకు అనువైన భవనాలు లభించక పోవడం, ఐఎంసీ నిబంధనల ప్రకారం 300 పడకల ఆస్పత్రి అందుబాటులేని నేపథ్యంలో భువనగిరిలో వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల శాశ్వత నిర్మాణానికి అవసరమైన 20ఎకరాల స్థలాన్ని విరాళంగా అందజేసేందుకు భువనగిరి, యాదగిరిగుట్ట పరిసరాల్లోని ముగ్గురుదాతలు ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఆ ముగ్గురు ఉన్నతాధికారులను కలిసి భూవిరాళానికి సుముఖతను చూపినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భూదాత పేరిట కళాశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో వ్యక్తిగత ప్రతిష్టకోసం భూవిరాళానికి దాతలు ముందుకు వస్తున్నారా? లేక స్థిరాస్థి వ్యాపార కోణం ఉందో త్వరలో స్పష్టత రానుంది. అయితే విరాళంగా ఇచ్చే భూమి 100శాతం వివాద రహితంగా, దాతలు సఛ్ఛీలురై ఉంటేనే ప్రతిపాదిత భూమిని విరాళంగా స్వీకరించే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా భూముల ధరలు ఆకాశానికి అంటుకుంటున్న పరిస్థితుల్లో 20ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్న వారిని పలువురు అభినందిస్తున్నారు.

100 పడకల నుంచి 225 పడకల ఆస్పత్రిగా

ఇప్పటివరకు 100 పడకల ఆస్పత్రిగా ఉన్న జిల్లా ఆస్పత్రిని 225 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. నిబంధనల ప్రకారం వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి 300 పడకల ఆస్పత్రిగా ఉండాల్సి ఉంటుంది. దీంతో జిల్లా ఆస్పత్రిని ప్రస్తుతానికి 100 పడకల నుంచి 225పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. మిగతా 75 పడకల ను భవిష్యత్‌లో విస్తరిస్తారా? లేక సమీపంలోని మరేదైనా ఏరియా ఆస్పత్రిని డీఎంఈ పరిధిలోకి చేరుస్తూ అనుబంధ ఆస్పత్రిగా మారుస్తారో త్వరలో తేలనుంది. కాగా ప్రస్తుత జిల్లా ఆస్పత్రిపై మరో రెం డు అంతస్థుల నిర్మాణానికి, ప్రస్తుత వార్డులను ఆధునికీకరించేందు కు రూ.185కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తున్నది. ప్రతిపాదిత పనులు టీజీఎంఎస్‌ ఐడీసీ పర్యవేక్షణలో జరుగుతాయి. ఇందుకోసం పలు దఫాలుగా అధికారులు జిల్లా ఆస్పత్రిని పరిశీలించి వెళ్లారు. ఇప్పటివరకు భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షణ అధికారి (డీసీహెచ్‌ఎ్‌స)గా కొనసాగే వారు కానీ జిల్లా ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లనుండడంతో జిల్లాలోని ఆలేరు, చౌటుప్పల్‌, రామన్నపేట, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లలో ఒకరిని డీసీహెచ్‌గా పరిగణిస్తారా? లేక జిల్లా కేంద్రమైన భువనగిరి కేంద్రంగా నూతన డీసీహెచ్‌ఎ్‌స పోస్టును ఏర్పాటుచేసి ఇక్కడినుంచే ఆస్పత్రులను సమన్వయ పరుస్తారో ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. అయితే మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు ఆస్పత్రిలో ఛాంబర్‌ను ఏర్పాటు చేయగా అదే సమయంలో సూపరింటెండెంట్‌గా ఉన్న డీసీహెచ్‌ఎ్‌సకు ఆస్పత్రి ఆవరణలోని మరో భవనాన్ని కార్యాలయంగా కేటాయించారు.

Updated Date - Jun 03 , 2024 | 12:42 AM