మహిళాభివృద్ధితోనే దేశ పురోగతి
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:08 AM
మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందితేనే దేశం పురోగతిలో ఉంటుందని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.
సూర్యాపేట(కలెక్టరేట్), మార్చి 7 : మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందితేనే దేశం పురోగతిలో ఉంటుందని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొన్ని మహిళా సంఘాలు బ్యాంకు రుణాలతో వస్తువులను తయారు చేసి ఇతర జిల్లాలకు ఎగుమతి చేయడం శుభపరిణామమన్నారు. మహిళలకు సహనం, ఓర్పు, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటాయన్నారు. స్ర్తీ లేనిదే మానవ మనుగడలేదన్నారు. పని ప్రదేశాల్లో మహిళలను ఎవరైనా వేధించినా, అగౌరవపరిచినా కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం దివ్యాంగులకు చార్జింగ్ బ్యాటరీతో నడిచే త్రీవీలర్లు, స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా సంక్షేమ అధికారి వెంకటరమణ, జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, మునిసిపల్ చైర్‌పర్సన పెరుమాళ్ల అన్నపూర్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.