హాస్టళ్లపై పర్యవేక్షణ
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:32 AM
సంక్షేమ హాస్టళ్లపై ప్రభు త్వం ప్రత్యేకశ్రద్ధ వహించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భోజన వసతి సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు.
అధికారులు బస చేయాలని ప్రభుత్వ ఆదేశం
హాస్టళ్లను సందర్శిస్తూ, బస చేస్తున్న అధికారులు
విద్యార్థులకు అందిస్తున్న మెనూ, సౌకర్యాలపై నివేదికలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారంపై దృష్టి
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): సంక్షేమ హాస్టళ్లపై ప్రభు త్వం ప్రత్యేకశ్రద్ధ వహించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భోజన వసతి సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు.ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖ అధికారులు హాస్టళ్ల నిర్వహ ణ పడక్బందీగా చేపట్టాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న విద్యార్థులే చదువుకుంటున్నారు. కొంచెం ఆర్థికంగా ఉన్న కు టుంబాలు ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో చదివిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో పనిచేస్తే గాని పూట గడవని కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల ల్లో చదువుతున్నారు. వీరందరికీ కూడా హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు మొత్తం 19వరకు ఉండగా, 11బాలుర హాస్టళ్లలో 473మంది విద్యార్థు లు, ఎనిమిది బాలికల హాస్టళ్లలో 501మంది విద్యార్థుల వరకు చదువుకుంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాలో మొత్తం బాలురు, బాలికలు ఎనిమిది హాస్టళ్లు ఉండగా, 683మంది విద్యార్థులున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 15 బాలురు, బాలికల వసతిగృహాలున్నాయి. వీటిలో 10బాలురు హాస్టళ్లలో 393 మంది విద్యార్థులు, ఐ దు బాలికల హాస్టళ్లలో 231 మంది విద్యార్థులుంటున్నారు. విద్యార్థులకు నాలుగు జతల దుస్తులు, కార్పెట్‌లు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు, స్కూల్ బ్యాగ్‌లు, మ్యాట్రీస్, పిల్లోస్, నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వసతుల న్నీ కూడా పక్కాగా అమలవుతున్నాయా? విద్యార్థు ల స్థితిగతులపై తెలుసుకునేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, ఎలాంటి వసతులు కల్పించాలన్న వాటిపై పూర్తిస్థాయి నివేదికను అం దించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశా రు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంక్షేమ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు హాస్టళ్లలో రాత్రి బసచేస్తూ, విద్యార్థులతో కలిసి నిద్రిస్తున్నారు. ఉద యం వేళల్లో వారికి హాస్టళ్లలోని మరుగుదొడ్లు, స్నానాల గదులు సరిపడా ఉన్నాయా? టిఫిన్, పాలు, గుడ్లు ఇస్తున్నారా? భోజనం ఎలా ఉంటుందని పర్యవేక్షిస్తున్నారు. దీంతో సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
మెనూ అమలుపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వం అందజేస్తున్న మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇకనుంచి జిల్లాస్థాయి అధికారులు హాస్టళ్లలో బసచేసి, వారి పర్యవేక్షణలో హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా? వార్డెన్ల పర్యవేక్షణ ఎలా ఉంది? విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న అంశాలపై జిల్లాయంత్రాంగం దృష్టి సారించింది. హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నప్పటికీ, పప్పు, కూరలు చాలా పలుచగా, నాసిరకంగా ఉంటున్నాయన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు పోషకాహారం కోసం రోజువారీగా అందజేస్తున్న గుడ్లు, పాలు, పండ్లు సైతం తాజాగా ఉండటంలేదని, వారినికోసారి మాంసాహారం సైతం సక్రమంగా పెట్టడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖల అధికారులతోపాటు మండల ప్రత్యేకాధికారులు విద్యార్థులతో మమేకం కానున్నారు. వీరు హాస్టళ్లలో అధికారులు గుర్తించిన సమస్యలను కూడా పూర్తి నివేదికను రూపొందించనున్నారు. అన్ని హాస్టళ్లల్లో ప్రత్యేకంగా ట్యూటర్‌ను నియమించినప్పటికీ, పర్యవేక్షణ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు చదువుల్లో రాణించలేకపోతున్నారు. చాలావరకు హాస్టళ్లల్లో ఉదయం 5నుంచి 6గంటల వరకు, రాత్రి వేళల్లో 5గంటల నుంచి 6 వరకు విధిగా విద్యార్థులను చదివించాలి. అయితే పర్యవేక్షణ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు చదువుపట్ల శ్రద్ధ చూపడంలేదు. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. దీంతో ఒకప్పుడు ఆటల్లో రాణించిన విద్యార్థులు... నేడు ఆదరణ లేక క్రీడలకు దూరం కావల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
హాస్టళ్లలో నిద్ర చేస్తున్నాం : జైపాల్‌రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి
జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో రాత్రిపూట నిద్ర చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులు హాస్టళ్లను సందరిస్తూ... రాత్రి బసచేసి, విద్యార్థుల సౌకర్యాలపై దృష్టి సారిస్తు న్నాం. ఇప్పటివరకే జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో అధికారులు విద్యార్థులతో కలిసి నిద్రచేశారు. జిల్లాలోని అన్ని బాలురు, బాలికల హాస్టళ్లల్లోనూ మెనూ అమలు తీరుపై పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థుల సమస్యలను కూడా తెలుసుకుంటున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.