Share News

‘పది’కి వేసవి ప్రణాళిక

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:41 PM

పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లా విద్యా శాఖ వేసవి ప్రణాళిక రూపొందించింది. డీఈవో నారాయణరెడ్డి ఇందుకుకోసం ప్రత్యేక కార్యాచరణ తయారు చేశారు. పదో తరగతి విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని పెంచడానికి ఆయన చర్యలు తీసుకుంటున్నారు.

‘పది’కి వేసవి ప్రణాళిక

పదో తరగతి విద్యార్థుల ప్రతిభకు మెరుగులు

2024-25 విద్యా సంవత్సర విద్యార్థులకు వేసవిలో ఆన్‌లైన్‌ బోధన

జిల్లాలో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి

రోజూ గంట చొప్పున రెండు సబెక్టుల బోధన

మోత్కూరు, ఏప్రిల్‌ 23: పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లా విద్యా శాఖ వేసవి ప్రణాళిక రూపొందించింది. డీఈవో నారాయణరెడ్డి ఇందుకుకోసం ప్రత్యేక కార్యాచరణ తయారు చేశారు. పదో తరగతి విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని పెంచడానికి ఆయన చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుం డా ప్రణాళిక రూపొందించారు. ఈప్రణాళిక అమలు విషయమై పాఠశాల చివరి రోజున మంగళవారం (ఈ నెల 23న) జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు జూన్‌లో పదో తరగతిలోకి రానున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. సబ్జెక్టు నిపుణులు ఆన్‌లైన్‌ ద్వారా బోధించే విషయాలను విని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రోజుకు రెండు సబ్జెక్టులపై ఆన్‌లైన్‌ క్లాసులు

2023-24 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు పదో తరగతి చదివేందుకు ఈ నెల 25 నుంచి జూన్‌ 11 వర కు ఆన్‌లైన్‌ ద్వారా జిల్లాలో సంసిద్ధత కార్యక్రమం చేపట్టనున్నారు. జిల్లాలో సబ్జెక్టు ఫోరంలు ఉన్నాయి. ఆయా సబ్జెక్టు ఫోరం ద్వారా సబ్జె క్టు నిపుణులతో ప్రతిరోజూ రెండు సబ్జెక్టులను ఒక్కో సబ్జెక్టు ఒక్కోగం ట చొప్పున ఆన్‌లైన్‌లో బోధించనున్నారు. ఇందులో బేసిక్స్‌ ఎక్కువగా నేర్పించనున్నారు. సబ్జెక్టు నిపుణులు చెప్పింది వినడంతోపాటు వర్క్‌షీట్లు ఇచ్చి విద్యార్థులతో పూర్తి చేయిస్తారు.వాటిని ఉపాధ్యాయులు పర్యవేక్షించేలా చూస్తున్నారు.జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులు పది వేల మందికి ఈ ఆన్‌లైన్‌ బోధనతో లబ్ధిపొందుతారంటున్నారు.

నేటి నుంచి వేసవి సెలవులు

2023-24 విద్యా సంవత్సరం నేటితో ముగిసింది. అన్ని తరగతుల విద్యార్థుల వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం క్లాస్‌ టీచర్లు విద్యార్థులకు తెలిపారు. నేటి నుంచి జూన్‌ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు సంతోషంగా ఇళ్లకు వెళ్లారు. ఈ నెల 25 నుంచి ప్రస్తుత 9వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పదో తరగతి సబ్జెక్టులు బోధించనున్నారు.

సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి: సహిత విద్య జిల్లా కో ఆర్డినేటర్‌ పెసరు లింగారెడ్డి

తుర్కపల్లి, ఏప్రిల్‌ 23: విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చినందున పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్‌ పెసరు లింగారెడ్డి సూచించారు. మండలంలోని కొండాపూర్‌ ప్రాథమిక, వాసాలమర్రి ఉన్నత, వీరారెడ్డిపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు వేసవి సమయాన్ని వృథా చేయవద్దన్నారు. పై తరగతుల్లో ప్రతిభ కనబరిచేందుకు ప్రత్యేక టైంటేబుల్‌ ప్రకారం చదవాలన్నారు. ఈత వచ్చినా పెద్దల పర్యవేక్షణ లేకుండా చెరువులు, బావులు, నదుల వద్దకు వెళ్లకూడదన్నారు. కూల్‌డ్రింక్స్‌, ఐస్‌ క్రీమ్స్‌ తినకుండా తరచూ తాగు నీరు, నిమ్మరసం, కొబ్బరి నీళ్ల వంటివి తాగాలన్నారు. సెలవుల్లో పిల్లలు వీలైనన్ని కథల పుస్తకాలు చదవాలని, బొమ్మలు, పెయింటింగ్‌లు వేయాలని, అభిరుచి మేరకు చిన్నచిన్న కథలు, కవితలు రాయాలని, అందుబాటులో ఉన్న వస్తువులతో అలంకరణ వస్తువులు తయారు చేయాలన్నారు. పాఠశాల నుంచి తెచ్చుకున్న గ్రంథాలయం పుస్తకాలను చదవాలన్నారు. విద్యార్థులతో జిల్లా విద్యాశాఖ తరఫున నిర్వహించ తలపెట్టిన 40 రోజుల ప్రత్యేక కార్యాచరణపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, ఉమాదేవి, సత్యం, రమణి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు లత, పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 11:41 PM