సన్నాలకు గండం
ABN , Publish Date - Sep 23 , 2024 | 12:14 AM
వాతావరణంలో మార్పులు వరి పంటకు శాపంగా పరిణమించాయి. వరి నాటిన దగ్గరి నుంచి తెగుళ్ల ఉధృతి అధికమైంది. ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ప్రకృతి అనుకూలత లేకపోవడంతో పంట ఎదుగుదలలో సమస్యలు ఏర్పడ్డాయి.
వరిలో ఉధృతంగా తెగుళ్ల వ్యాప్తి
వాతావరణంలో మార్పులే కారణం
పెరుగుతున్న పెట్టుబడులు
ఆందోళనలో అన్నదాతలు
సమగ్ర యాజమాన్యంతో ఫలితాలు
మిర్యాలగూడ (వ్యవసాయం): వాతావరణంలో మార్పులు వరి పంటకు శాపంగా పరిణమించాయి. వరి నాటిన దగ్గరి నుంచి తెగుళ్ల ఉధృతి అధికమైంది. ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ప్రకృతి అనుకూలత లేకపోవడంతో పంట ఎదుగుదలలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో రైతు ల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది నీటి లభ్యత కారణంగా ఉమ్మడి జిల్లాలో 10.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
ప్రస్తుత వానాకాలంలో మొత్తం వరి విస్తీర్ణంలో 95శాతం సన్న రకాలు సాగయ్యాయి. వరుస భారీ వర్షాలు, ముసురుతోపాటు ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, ఉక్కపోత వంటి కారణాలతో వరి సాగులో ఇబ్బందులు ఎదురయ్యాయి. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో జూన్‌లో నారు పోసుకుని జూలైలో నాటు వేసిన పొలాలు వర్షాలకు ఏపుగా పెరగడంతో దోమ వ్యాప్తి, బూడిద తెగులు (బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు) అధికమైంది. ఇప్పటికే రెండు నుంచి మూడుమార్లు ఖరీదైన పురుగు మందులు పిచికారీ చేసినా దోమవ్యాప్తి నియంత్రణలో రాలేదని రైతులు వాపోతున్నారు. దోమతో పాటు మొగిపురుగు ఆశించడంతో దిగుబడులపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు నెలలో ఆలస్యంగా సాగు చేసిన వరికి ప్రారంభం నుంచే పచ్చపురుగు ఆశించింది. ఆకును గీరి తినడంతో పచ్చగా మారింది. ఇప్పటి వరకు రెండు నుంచి మూడుమార్లు రైతులు పురుగు మందులు పిచికారీ చేశారు. సాధారణ రసాయనిక మందులు పని చేయకపోవడంతో కొత్త రకం, ఖరీదైనవి పిచికారీ చేస్తున్నారు. ధర అధికంగా ఉండటంతో ఎకరానికి సుమారు రూ.2,500 వరకు ఖర్చు వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం అనుకూలిస్తే తప్ప పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరిలో సమస్యలు అధికమయ్యాయి : నాగేశ్వరరావు, రైతు, తుంగపాడు, మిర్యాలగూడ
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. నాటు దగ్గరి నుంచి తెగుళ్ల సమస్య అధికమైంది. ఆకుపచ్చపురుగు, బూడిద తెగులు, దోమ, మొగి వ్యాప్తితో పంట దెబ్బతింటోంది. సస్యరక్షణ చేపట్టాల్సి రావడంతో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దిగుబడులు ఆశించిన మేర వచ్చే పరిస్థితి కనపడటం లేదు.
అధికంగా పురుగు మందుల వాడకంతో నష్టం..
సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి
డాక్టర్ లింగయ్య, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం, కంపసాగర్ శాస్త్రవేత్త
రైతులు దశాబ్దకాలంగా సేంద్రీయ ఎరువులు వాడటం లేదు. పశువుల ఎరువుతో పాటు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము పంటలు రైతులు సాగు చేయడం లేదు. కేవలం అడుగు పిండితో పాటు, నత్రజని ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమిలో పోషక విలువలు తగ్గాయి. దీనికి తోడు వాతావరణంలో మార్పుల కారణంగా ప్రస్తుతం వరిలో తెగుళ్ల వ్యాప్తి అధికమైంది. రైతులు ఇష్టానుసారంగా మందులు పిచికారీ చేయకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చు.
వరి సన్న గింజ రకాల్లో ఆకు ఎండు తెగులు కనిపిస్తోంది. ఆకుల చివర పసుపు రంగు మచ్చలు అంచుల నుంచి కిందికి వ్యాపిస్తాయి. పసుపు రంగు చారలు, ఆకు ఒక వైపు లేదా రెండు వైపులా కనిపిస్తాయి.
ఈ తెగులు తీవ్రంగా ఉన్నపుడు ఆకులు ఎండి గడ్డిలా కనిపిస్తాయి. అధిక గాలి వేగం, చిరు జల్లులు, 22-26 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా వరి నాట్లు ఒత్తుగా వేసిన పొలాల్లో తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది.
నివారణ చర్యలు
ఈ తెగులును పూర్తిగా నివారించే మందులు లేవు. అయితే తొలి దశలో కాపర్‌హైడ్రాక్మైడ్ 400గ్రా. ఎకరానికి, లేదా సైప్టోమైసిన్ సల్ఫేట్, టిట్రాసైక్లిన్ హైడ్రాక్లోరైడ్ 9:1ను 40గ్రా. ఎకరానికి పిచికారి చేయాలి.
దోమ పోటు
దోమ ఉధృతి ఉంటే పంట దిగుబడులు తగ్గిపోతాయి. కంకిలోని గింజలు తాలుగా మారడం, గింజ నాణ్యత కోల్పోవడంతోపాటు గింజల్లో నూక శాతం ఎక్కువవుతుంది. 8 నత్రజని ఎరువులు అధికంగా వాడటం, అనవసరంగా రసాయనిక మందులు పిచికారీ చేయడం, బెట్టవాతావరణం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా దోమ ఉధృతమవుతుంది.
వరి దుబ్బుల మొదళ్ల దగ్గర ఆకులు ఎండి గడ్డిలాగ కనిపిస్తాయి.
సాధారణంగా ఈ దోమ ఉధృతి వానాకాలంలో అక్టోబరు-నవంబరులో, యాసంగిలో అయితే మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
దోమ వ్యాప్తి అధికంగా ఉంటే పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది.
నివారణ చర్యలు
తొలి దశలో దోమ నివారణకు ఎసిఫేట్76 ఎస్‌పి 300గ్రా. ఎకరానికి, లేదా బ్యూప్రొఫెజిన్ 320మి.లీ ఎకరాకు, లేదా పైమెట్రాజైన్ 50 డబ్ల్యూజీ 100గ్రా. ఎకరానికి పిచికారి చేయాలి.
ఆకుచుట్టు పురుగు
వాతావరణంలో అధిక తేమ, నత్రజని ఎరువుల వాడ కం వల్ల ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది.
ఈ పురుగు పోటాకు దశలో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. వానాకాలంలో ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది.8 లార్వాకు ఆకులను పొడవుగా గొట్టంలా మలచి ఆకుముడతలోఉండి పత్రహరితాన్ని గీరి తింటాయి.
ఆకులను గీరి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతాయి. దూరం నుంచి ఆకులు తెల్లబడి కనిపిస్తాయి.
నివారణ చర్యలు
కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400గ్రా. ఎకరానికి లేదా ప్లూబెండియమైడ్ 20డబ్ల్యు డీజీ 50గ్రా. ఎకరానికి, లేదా ప్లూబెండియమైడ్ 39.35 ఎస్.సి, 20మి.లీ ఎకరాకు పిచికారి చేయాలి.
కాండం తొలుచు పురుగు (మొగిపురుగు)
పూత దశలో ఆశించినప్పుడు గొలుసు గింజలు మొత్తం తాలుగా మారి గొలుసు ఎండిపోయి తెల్లకంకిలా మారుతుంది.
చనిపోయిన మొగి, తెల్లకంకి లాగినపుడు తేలికగా ఊడి వస్తాయి.
నివారణ చర్యలు
చిరు పొట్టదశలో ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్4జీ గుళికలు 8 కిలోలు, లేదా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు వేయాలి. 8 పురుగు నివారణకు కార్టాప్ హైక్ర్లోరైడ్ 400గ్రా. ఎకరానికి. లేదా క్లోరాన్‌ట్రనిలిప్రోల్ 60 మి.లీ ఎకరానికి పిచికారీ చేయాలి.