Share News

లోక్‌సభ బరిలో వారసులు?

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:28 PM

త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో వారసులను బరిలో నిలిపేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు పా ర్టీల సీనియర్‌ నాయకులు పావులు కదుపుతున్నారు.

లోక్‌సభ బరిలో వారసులు?

రేసులో సీనియర్‌ నేతల కుటుంబ సభ్యులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో వారసులను బరిలో నిలిపేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు పా ర్టీల సీనియర్‌ నాయకులు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ నేతలతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు వారి కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుండగా, ఒక అసెంబ్లీ స్థానం మినహా మిగతా 11 స్థా నాలను కోల్పోయిన బీఆర్‌ఎస్‌, నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ స్థానాలను కైవ సం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు వ్యుహరచనలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు గెలుపొందడంతో సమరోత్సాహంతో రెండు పార్లమెంటు స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇ ప్పటికే ఈ స్థానాల బాధ్యతలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుకు పార్టీ అదిష్ఠానం అప్పగించింది.

వారసులను బరిలో దింపేందుకు..

పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ నుంచి తానే లోక్‌సభకు పోటీ చేస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జనారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏ కార ణం చేతనైనా బరిలో దిగలేక పోతే తన కుమారుడు రఘువీర్‌రెడ్డితో పోటీ చేయించే ఆలోచనలో ఆయన ఉన్నారు. రఘువీర్‌ 2018లోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి, నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ప్ర యత్నించారు. అప్పట్లో అవకాశం రాకపోవడంతో ఈ సారి బరిలో దిగాలని గట్టి గా ప్రయత్నిస్తున్నారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులను బరిలో దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని నిర్ణయించుకుని టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే ఆయన సోదరుడైన కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ సూర్యపవన్‌రెడ్డిని బరిలో దించుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి నల్లగొండ లేదంటే భువనగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డిని పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుఖేందర్‌రెడ్డి చాలా కాలం నుంచి తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం అంగీకరిస్తే అమిత్‌ లోక్‌సభకు పోటీచేస్తారని ఇప్పటికే ఆయన ప్రకటించారు.

అమిత్‌ నల్లగొండ లేదంటే భువనగిరి నుంచి పోటీ : గుత్తా

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం నల్లగొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి నల్లగొండ లేదా భువనగిరి ఏదో ఒక నియోజకవర్గ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పనిచేసినప్పుడు ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు తన పరిధిలో ఉన్నాయన్నారు. అమిత్‌రెడ్డి పోటీ విషయం పార్టీ చర్చించనుందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్యాడర్‌ను కాపాడుకోవడం కోసం పోటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయామన్న బాధలో ఉండకుండా పార్లమెంటు స్థానానికి పోటీచేసి కార్యకర్తలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో వ్యతిరేకత అనేది సహజమని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో మొదట 12 లోక్‌ సభ స్థానాలు గెలుస్తామని, ఆ తరువాత 14 స్థానాలు గెలుస్తామని చెబుతున్నారని, అయితే ఏ పార్టీ అయినా తాము గెలుస్తామనడం సహజమన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనూ చులకనగా చూడకూడదని సీఎం రేవంత్‌రెడ్డి శాసనమండలిపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు లాంటి రాజకీయాలు తెలంగాణలోకి రావొద్దని తాను కోరుకుంటున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక నెల పరిపాలనపై ఇప్పుడేం మాట్లాడలేమని అన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే స్వాగతిస్తామని అన్నారు.

జిట్టా దారెటు?

బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి గైర్హాజరు

భువనగిరి ఎంపీ స్థానంపై గురి

యాదాద్రి, జనవరి12 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నిక లు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం మళ్లీ మారుతోంది. వచ్చే ఎన్నికల్లోగా ఏ నేత ఏ పార్టీల్లో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరారు. బీఆర్‌ఎ్‌సలో చేరినా ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. ఎన్నికల నాటి నుంచి నేటి వరకు బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి కీలక సమావేశానికి జిట్టా గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. భువనగిరిలో ఏర్పాటుచేసిన తన కార్యాలయానికి సైతం ఆయన తెలంగాణ ఉద్యమకారుడని బోర్డు పెట్టారు గానీ, బీఆర్‌ఎస్‌ నేత అని ఎక్కడా లేదు. దీంతో ఆయన ఏ పార్టీ వైపు వెళ్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. జిట్టా జిల్లాలో సంక్రాంతి సంబురాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు జిల్లాస్థాయి గ్రామీణ క్రీడలు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశాలు పార్టీతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన త్వరలో బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీ అధిష్ఠానంతో ఆయన సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఉద్యమకారుడిగా భువనగిరి ఎంపీ టికెట్‌ కేటాయించాల ని కోరిన ఆయన కాంగ్రెస్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అయితే జిట్టా మాత్రం ఉద్యమకారుడిగా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని, ఏ పార్టీ నుంచి అనేది సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:28 PM