Share News

కష్టపడి చదివి.. పైలెట్‌గా ఎదిగి

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:04 AM

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని సీతరాంతండాకు చెందిన కుమార్‌, బుజ్జి దంపతుల కుమారుడు కొర్ర అరవింద్‌ చౌహననాయక్‌.

కష్టపడి చదివి.. పైలెట్‌గా ఎదిగి

నౌకాదళంలో పైలెట్‌గా అరవింద్‌నాయక్‌

దేవరకొండ, జూన 21 : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని సీతరాంతండాకు చెందిన కుమార్‌, బుజ్జి దంపతుల కుమారుడు కొర్ర అరవింద్‌ చౌహననాయక్‌. తండ్రి చిన్నప్పుడు మృతిచెందగా తల్లి తండాలో అంగనవాడీ కార్యకర్తగా పనిచేస్తూ కుమారుడిని చదివించింది. తల్లి బుజ్జి, మేనమామ, బంధువుల ప్రోత్సాహంతో కష్టపడి చదివిన అరవింద్‌ భారత నౌకాదళంలో పైలెట్‌గా ఎదిగారు. దేవరకొండలోని ఎస్‌పీఆర్‌ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకొని ఉపాధ్యాయుల ప్రోత్సహంతో 2013లో విజయనగరం జిల్లాలోని సైనిక్‌ స్కూల్‌లో సీటు సాధించాడు. సైనిక్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం, శిక్షణ అనంతరం 2016 సెప్టెంబరులో ఆలిండియా స్థాయిలో యూపీఎ్‌ససీ నిర్వహించిన నేషనల్‌ డిఫెన్స అకాడమి పరీక్షలో రాష్ట్రస్థాయిలో 170వ ర్యాంక్‌ సాధించాడు. నాలుగు వేల మందిని ఇంటర్వ్యూకు పిలవగా, అందులో 300మంది ఎంపికయ్యారు. అందులో అరవింద్‌ చౌహన ఒకరు. మైసూరులో నిర్వహించిన ఇంటర్వ్యూలో నౌకా దళంలోకి అర్హత సాధించాడు. అప్పటి ఆయన వయస్సు 21ఏళ్లే. మూడేళ్ల పాటు పూణెలో శిక్షణ పొందుతూనే బీటెక్‌ పూర్తి చేశాడు. కేరళలోని ఇండియన నావిల్‌ అకాడమీలో ఏడాది శిక్షణ తీసుకొని 2021లో భారతీయ నౌకాదళంలో గ్రూపు-1 స్థాయి సబ్‌ లెప్ట్‌నెంట్‌గా ఎంపికయ్యాడు. నౌకాదళంలో అధికారిగా కొనసాగుతూ పైలెట్‌గా పదోన్నతి పొందాడు. చదువుతోపాటు తనను ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనతండాల నుంచి విద్యార్థులు కష్టపడి చదివి దేశ రక్షణ కోసం సైన్యంతోపాటు నౌకాదళంలో చేరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అరవింద్‌ కోరారు.

Updated Date - Jun 22 , 2024 | 12:04 AM