Share News

గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:00 AM

గంజాయి నిర్మూలనలో పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే సూచించారు.

గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ
కోదాడలో ఇనస్పెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

కోదాడ, జనవరి 29 : గంజాయి నిర్మూలనలో పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే సూచించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సర్కిల్‌ ఇనస్పెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రవాణా, సరఫరా, వినియోగం నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి రవాణా నిందితుల గుర్తింపుతో పాటు రికార్డు చేయాలని సూచించారు. అంతేకాక గంజాయి కేసులపై దర్యాప్తు పాటించాల్సిన మేళకువలు, సలహాలు, సూచనలను సీఐలకు అందించారు. నిఘా పెంచడంతో పాటు గంజాయి తీసుకోవటం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పట్టణ సీఐ రాము, వీర రాఘవులు, రామకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

అసాంఘిక కార్యక్రమాలపై చట్టపరంగా చర్యలు

సూర్యాపేట క్రైం : జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే బీకే అన్నారు. సోమవారం పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదులను స్వీకరించి, మాట్లాడారు. ప్రజలు చిన్న చిన్న సమస్యలను ఘర్షణలు పడవద్దన్నారు. సమస్యలను రాజీమార్గంలో పరిష్క రించుకోవాలన్నారు. పోలీసులు ప్రజల సమస్యలపై వేగంగా స్పందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Jan 30 , 2024 | 12:00 AM