Share News

వరి నారు పెంపకం ప్రారంభం

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:04 AM

వానాకాలం మొదలుకావడంతో సాగు పనులు ఊపందుకున్నాయి.

వరి నారు పెంపకం ప్రారంభం
చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామంలో నారు మడి

చౌటుప్పల్‌ టౌన, జూన 13 : వానాకాలం మొదలుకావడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు దుక్కులు దున్ని భూములను సాగుకు రైతులు సిద్ధం చేశారు. వరి సేద్యంలో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో నారు పెంపకం ప్రారంభమైంది. వారం రోజులుగా నారు పెంపకంపై రైతులు దృష్టి సారించారు. రోహిణి కార్తె చివరలో వర్షాలు కువడంతో రైతులు మడుల్లో వరి విత్తనాలను చల్లుకున్నారు. రోహిణిలో వరి నారు వేసుకుంటే వంగడాలు బలంగా ఉండడంతో పాటు రోగ నిరోదక శక్తి ఎక్కువగా లభిస్తుందని రైతులు నమ్మకం. గత వానాకాలం సీజనలో 8,729 మంది రైతులు 17,555 ఎకరాలు, ఈ యాసంగిలో 14,725 ఎకరాల్లో 7,727 మంది రైతులు వరి సాగు చేసినట్లు ఏవో నాగరాజు తెలిపారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో చెరువుల్లో చుక్క నీరు లేకుండాపోవడంతో సాగునీటి సమస్య నెలకొంది. యాసంగి సీజనలోనే వరి సాగును కొంతమేరకు రైతులు స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. అదేవిధంగా వానాకాలం సీజనలో కూడా మరికొంత వరి సాగు ను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అందుకనుగుణంగా వరి నారు మడులు కూడా తగ్గిపోయాయి. పిలాయిపల్లి కాల్వ పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో వరి నారు మడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

యాజమాన్య పద్ధతులు పాటిస్తే..

వరి నారుమడి తయారీకి రెండు వారాల ముందు రెండు గుంటల మడికి 2 క్వింటాళ్ల బాగా మాగిన పశువుల ఎరువును వేసి రెండు, మూడు పర్యాయాలు కలియదున్నాలి.

ఎకరం పొలం నాటుకోవడానికి రెండు గుంటల మడిలో అతి సన్న గింజ రకాలైతే 15 కిలోలు, సన్న గింజ రకాలైతే 20కిలోలు, దొడ్డు రకం గింజలైతే 25 కిలోల విత్తనం ఎత్తు మడిలో చల్లుకోవాలి.

వరి విత్తనం దట్టంగా చల్లుకుంటే నారు పెరుగుదల బలహీనంగా ఉంటుంది.

రెండు గుంటల(200చ.మీ.) నారుమడికి 2 కిలోల నత్రజని(కిలో విత్తనం చల్లే ముందు, మరో కిలో విత్తనాన్ని విత్తిన 12-14 రోజులకు), కిలో భాస్వరం, కిలో పొటాష్‌ ఎరువులను వేసుకోవాలి.

మొలకకట్టిన విత్తనాన్ని చల్లి, వారం రోజులు ఆరు తడులు ఇచ్చి, ఆ తరువాత మొక్క దశలో పలుచగా నీరు ఉంచాలి.

జింక్‌ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

నారుమడిలో ఊద, ఒడిపిలి వంటి గడ్డి జాతి కలుపు నివారణకు వరి విత్తనాలను విత్తిన 15-20 రోజులకు సైహలోఫా్‌ప-పి-బ్యూటైల్‌ 1.5 మిల్లీలీటర్‌ లేదా అన్ని రకాల కలుపు ఉన్నప్పుడు బిస్‌పైరీ బ్యాక్‌ సోడియం 0.5 మిల్లీలీటరును ఒక లీటరు నీటికి చొప్పున కలిపి విత్తిన 10-12 రోజులకు పిచికారీ చేసుకోవాలి.

నారు పీకడానికి వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన గుళికలు చల్లుకోవాలి.

పందులు, కోతుల నుంచి రక్షణ పొందేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

నాటు వేసే సమయంలో వరి నారును దూరం నుంచి విసరకూడదు.

శాస్త్రవేత్తల సూచనలను పాటించాలి

వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు నారు మడి యాజమాన్య పద్ధతులను పాటించాలి. మొలకకట్టిన మేలు రకం విత్తనాలను చల్లుకోవాలి. వంగడాలు బలంగా ఉంటే గింజలు కూడా ధృడంగా వచ్చి అధిక దిగుబడులను సాధించేందుకు అవకాశాలు ఉంటాయి. ఏవో, ఏఈవోల సలహాలు, సూచనలను తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టి, మంచి దిగుబడులు పొందాలి.

- ముత్యాల నాగరాజు, ఏవో, చౌటుప్పల్‌

Updated Date - Jun 14 , 2024 | 12:04 AM