Share News

సమరం షురూ

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:40 AM

సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభంకానుంది. మైకుల మోతలు.. ప్రచార హోరుతో నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇప్పటికే వేడెక్కిన వాతావరణం.. మరింత ఉద్విగ్ఘంగా మారనుంది. ప్రతిపక్షాల ఆరోపణలు.. అధికార పక్షం ఎదురు దాడులతో రసవత్తరం కానుంది.

సమరం షురూ

నేడు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌

ఈ నెల 18 నుంచి 25వరకు నామినేషన్ల స్వీకరణ

భువనగిరి కలెక్టరేట్‌ వద్ద ఏర్పాట్లు పూర్తి

ఉదయం 11 నుంచి 3గంటల వరకు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభంకానుంది. మైకుల మోతలు.. ప్రచార హోరుతో నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇప్పటికే వేడెక్కిన వాతావరణం.. మరింత ఉద్విగ్ఘంగా మారనుంది. ప్రతిపక్షాల ఆరోపణలు.. అధికార పక్షం ఎదురు దాడులతో రసవత్తరం కానుంది. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో, నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి నల్లగొండ జిల్లాకేంద్రంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

లోక్‌సభ నియోజకవర్గస్థాయిలో గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు జిల్లా ఎన్నికల యంతారంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు భువనగిరి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే సంబంఽధిత అధికారులతో సమీక్షించారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం యాదాద్రి భువనగి రి, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, జనగామ జిల్లాల్లో విస్తరించి ఉం ది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్‌, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, జనగామ జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయు. ఈ నియోజకవర్గంలో 18 లక్షల మంది ఓటర్లున్నారు. భువనగిరి నియోజకవర్గం విస్తీర్ణంపరంగా పెద్దది కావడంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా నియోజకవర్గాల్లోని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు(ఏఆర్వోలు), వివిధ శాఖల అధికారులతో ఎన్నికలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లాస్థాయిలో నోడల్‌ అధికారులను నియమించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారులు గా వ్యవహరించిన వారు ప్రస్తుతం ఏఆర్వోలుగా ఉంటారు. వీరికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ పూర్తిచేశారు. నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల కోడ్‌ అమలు,సీ-విజిల్‌,తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

పర్యవేక్షణ కట్టుదిట్టం

ఎన్నికలను సజావుగా పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థుల ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా చేయించేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌, వీడియో సర్వేలెన్స్‌, వీడియో వ్యూయింగ్‌, మోడల్‌ కోడ్‌ అఫ్‌ కండక్ట్‌, సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్‌ టీంలను ఏర్పాటుచేశారు. ఈ నియోజకవర్గంలో 2,141 పోలింగ్‌ కేంద్రా లు ఉన్నాయి. పోలింగ్‌ నిర్వహణకోసం అవసరమైన పోలింగ్‌ అధికారు లు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులను గుర్తించారు. ఈ ఎన్నికల నిర్వహణకు మొత్తం పోలీసు సిబ్బందితో కలిపి 20వేలకు పైగా మంది విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్‌కు వినియోగించేందుకు ఈవీఎం ల పరిశీలన మొదటి దశ పూర్తయింది. అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. మరోసారి కూడా పరిశీలించనున్నారు.

భువనగిరి కలెక్టరేట్‌ వద్ద నామినేషన్ల స్వీకరణ

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల అధికారిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ భువనగిరి మండలం రాయిగిరిలో గల కలెక్టరేట్‌లో ఉంటుంది. ఈ మేరకు కలెక్టరేట్‌ ఆవరణలో భద్రత కట్టుదిట్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు మాత్రమే ర్యాలీకి అనుమతి ఉంటుంది. అభ్యర్థుల వెంట నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 25న నామినేషన్లకు చివరి గడువు. అభ్యర్థితోపాటు ఐదుగురికి మాత్రమే నామినేషన్లు వేసే కార్యక్రమానికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా ఒక్కో అభ్యర్థికి మూడు వాహనాలకు మాత్రమే నామినేషన్లు వేసే ప్రాంతానికి అనుమతిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించి జనరల్‌ అభ్యర్థులు నామినేషన్‌ సందర్భంగా రూ.25వేలు డిపాజిట్‌ చేయాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్‌తోపాటు ఫాం-26 ద్వారా అఫిడవిట్‌ దాఖలు చేయాలి. నామినేషన్లు వేసే ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

భువనగిరిలో మొత్తం 18,04,930 ఓటర్లు

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 18,04,930 ఓటర్లు ఉన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉండటంతో మరింత మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని ఓటర్ల తుది జాబితాను జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రకటించింది. భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 18లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 8,96,219, మహిళలు 9,08,632, ఇతరులు 79 మంది ఓటర్లు ఉన్నారు.

పారదర్శకంగా ఎన్నికలు

భువనగిరి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే

యాదాద్రి: లోక్‌సభ ఎన్నికలను ప్రశాంత వాతావణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, నేడు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు భువనగిరి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, ఉదయం 11గంటల నుంచి 3గంటల సమయం వరకు ఉంటుందని తెలిపారు. సెలవుదినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. భువనగిరి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లో ఎస్‌ఎ్‌సటీ, వీఎస్టీ, వీవీటీ, ఎఫ్‌ఎ్‌సటీ టీములు 58 పనిచేస్తున్నాయని, 245 సెక్టార్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బెన్‌ షాలోమ్‌, గంగాధర్‌ పాల్గొన్నారు.

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి

భువనగిరి అర్బన్‌: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఈసీ సమీక్షించి మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బూత్‌లెవల్‌లో ఓటింగ్‌శాతం పెంచేలా సెక్టార్‌ అధికారులతో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్లు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవడమేకాక అర్బన్‌ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల నిర్వహణపై హెల్ప్‌డెస్క్‌ ద్వారా వివరించాలన్నారు. ఈవీఎం రెండో ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌

ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ

25న నామినేషన్లకు చివరి గడువు

26న నామినేషన్ల పరిశీలన

29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు

మే 13న పోలింగ్‌

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు

Updated Date - Apr 18 , 2024 | 12:40 AM