ఆత్మహత్యల మిస్టరీని తేల్చండి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:47 PM
భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు భవ్యశ్రీ, వైష్ణవిల ఆత్మహత్య ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
భువనగిరిలోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన రాజకీయ ప్రముఖులు
ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
ఎస్‌ఎఫ్‌ఐ నిరసన సమావేశం
భువనగిరి టౌన, ఫిబ్రవరి 6 : భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు భవ్యశ్రీ, వైష్ణవిల ఆత్మహత్య ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యకు దారితీసిన మిస్టరీని తేల్చా లన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. హత్యలా, ఆత్మహత్యలా తేల్చాలని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలని ఆందోళనలు మిన్నం టాయి. ఈ ఘటనపై అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రముఖులతో పాటు పలువురు హాస్టల్‌ను సందర్శించి, ఇద్దరు బాలికలకు నివాళులర్పిస్తూనే వసతుల దుస్థితిని పరిశీలిస్తూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం భువనగిరిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయగా ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో నిరసన సమావేశం నిర్వహించారు.
ఆత్మహత్యలపై సమగ్ర దర్యాప్తు జరపాలి
భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్యలపై అనుమానాలున్నాయి. ఉన్నత భవిష్యత కోసం హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరం. ఒకే రూంలో ఆత్మహత్యకు పాల్పడి నాలుగు రోజులు గడుస్తున్నా సాక్ష్యాధారాలు లభించలేదని పోలీసులు పేర్కొనడం దారుణం. వెలుపలి వ్యక్తులు హాస్టల్‌లోకి ప్రవేశించినట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నా ఆ దిశగా అధికారులు విచారణ చేపట్టకపోవడం అమానుషం. అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్ దుస్థితి, విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలి.
- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
ఘటనపై ప్రభుత్వం స్పందించాలి
విద్యార్థినుల జంట ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి కుటుంబాల్లో ఆవేదన మిగిల్చిన భవ్యశ్రీ, వైష్ణవిలు ఆత్మహత్య చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్నా పాలకులు చూపుతున్న నిర్లక్ష్యం బాలికల సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ప్రభుత్వం విఫలమైంది. పేద విద్యార్థులు మాత్రమే సంక్షేమ వసతి గృహాల నిర్వహణను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోంది. ఎలాంటి భద్రతా, రక్షణ లేని భువనగిరి వంటి హాస్టల్స్ రాష్ట్రమంతటా ఉన్నాయి. భువనగిరిలో విద్యార్థినుల ఆత్మహత్యలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.
-డాక్టర్ శిల్పారెడ్డి, బీజేపీ మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు
విద్యార్థినులు పిరికివారు కాదు
భవ్యశ్రీ, వైష్ణవి క్లాస్ టాపర్స్ అని తమ హాస్టల్ పరిశీలనలో తేలింది. విద్యార్థినుల సమస్యలపై భవ్యశ్రీ వార్డెనతో పాటు అధికారులను ప్రశ్నించేదని, ఆ అక్కసుతోనే ప్రాణ స్నేహితులైన ఇద్దరినీ అధికారులు, సిబ్బంది వేధించేవారని పలువురు అంటున్నారు. వారి ఆత్మహత్యలపై లోతైన విచారణ జరిపి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులది. కానీ తమ పిల్లల ఆత్మహత్యలపై అనుమానాలు ఉన్నట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులతో పాటు అధికారులు పూర్తిస్థాయిలో స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
-సంధ్య, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు.
నిర్వహణ నిర్లక్ష్యంతో ప్రాణాలు బలి
హాస్టల్ నిర్వహణలో వార్డెనతో పాటు సిబ్బంది, సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యమే భవ్యశ్రీ, వైష్ణవి ప్రాణాలను బలితీసుకున్నాయి. విద్యార్థినుల మానసిక స్థితిని గుర్తించి కౌన్సిలింగ్ చేయడంలో హాస్టల్ సిబ్బంది, ఉపాధ్యాయులు విఫలమయ్యారు. దాంతో మనోవైదనకు గురై విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో తప్పనిసరిగా మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషన తరగతులు నిర్వహించాలి. జంట ఆత్మహత్యల కారకులను గుర్తించి, శిక్షించాలి. హాస్టల్ నిర్వహణలో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయాలను అరికట్టాలి. మితిమీరిన జోక్యంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్య వేక్షించి ఉంటే విద్యార్థినుల ప్రాణాలు నిలిచేవి.
-ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
దోషులను కఠినంగా శిక్షించాలి
భువనగిరిలో జంట ఆత్మహత్యల ఘటనకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి. ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్నా హాస్టల్ వార్డెన, సంబంధిత శాఖ అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థినుల ఆత్మహత్యకు కారకులెవరు, హాస్టల్ సిబ్బందిని కాపాడుతున్నదెవరో తేలాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న భవ్యశ్రీ, వైష్ణవి పేద, బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతోనే దర్యాప్తులో వేగం మందగించింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
-ఆర్‌ఎల్ మూర్తి, ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు