Share News

సంక్రాంతి ముందు సిలిండర్ల కొరత

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:31 PM

సంక్రాంతి పండగకు పిల్లలు, బంధువులు ఇంటికి వస్తుంటారు. ఓ రెండు రోజులు ముందుగానే పిండి వంటలు చేద్దామని మహిళలు ఉపక్రమించగా, ఇంట్లో వంట గ్యాస్‌ ఖాళీ అయింది. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకుందామని బుక్‌ చేస్తే రాలేదు. డోర్‌ డెలివరీ బోయ్‌ను వాకబు చేస్తే స్టాక్‌ లేదని సమాధానమిస్తున్నాడు.

సంక్రాంతి ముందు సిలిండర్ల కొరత

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, పెట్రో ట్యాంకర్ల సమ్మె ఎఫెక్ట్‌

మోత్కూరులో బారులు తీరిన వినియోగదారులు

లోడ్‌ రాగానే తీసేసుకుంటున్న వైనం

మోత్కూరు: సంక్రాంతి పండగకు పిల్లలు, బంధువులు ఇంటికి వస్తుంటారు. ఓ రెండు రోజులు ముందుగానే పిండి వంటలు చేద్దామని మహిళలు ఉపక్రమించగా, ఇంట్లో వంట గ్యాస్‌ ఖాళీ అయింది. గ్యాస్‌ సిలిండర్‌ తీసుకుందామని బుక్‌ చేస్తే రాలేదు. డోర్‌ డెలివరీ బోయ్‌ను వాకబు చేస్తే స్టాక్‌ లేదని సమాధానమిస్తున్నాడు. గోదాం వద్దకైనా వెళ్లి తెచ్చుకుందామంటే అక్కడా స్టాక్‌ లేదు. దీంతో సంక్రాంతి పండుగకు పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

మోత్కూరు భారత్‌ గ్యాస్‌ గోదాంకు శుక్రవారం ఒక లోడ్‌ లో 340 గ్యాస్‌ సిలిండర్లు వచ్చాయి. సిలిండర్లు వస్తాయని తెలియడంతో లోడ్‌ రాక ముందు నుంచే వినియోగదారులు గోదాం వద్ద బారులు తీరారు. లోడ్‌ రాగానే సిలిండర్లు గోదాంలో దించకుండానే లారీ వద్ద నుంచే వినియోగదారులు తీసేసుకుంటున్నారు. క్యూలో నిల్చున్న వారిలోనూ పలువురికి సిలిండర్లు అందక వెనుతిరిగారు. వినియోగదారులు గోదాం వద్దకే వెళ్లి తీసుకోవడంతో డోర్‌ డెలివరీ చేసే వాహనానికి సిలిండర్లు లేక డెలివరీ బాయ్స్‌ గ్రామాలకు వెళ్లలేకపోయారు. దీంతో గ్రామీణ ప్రజలకు బుక్‌చేసినా సిలిండర్లు అందడం లేదు.

కాంగ్రెస్‌ హామీ, ట్యాంకర్ల సమ్మె ఎఫెక్ట్‌

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వ స్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌, రూ.400 లకు సిలిండర్‌ ఇస్తామని బీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చాయి. ఎవ రు అధికారంలోకి వచ్చినా సిలిండర్‌ నాలుగైదు వందలకే లభిస్తుంది కదా అని డబుల్‌ సిలిండర్‌ ఉన్న వినియోగదారులంతా గ్యాస్‌ ఖాళీ అయినా నవంబరు నుంచి కొత్త సిలిండర్లు తీసుకోలేదు. డిసెంబరులో ఎన్నికల ఫలితాలు వెలువడి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కొద్ది రోజులు ఆగి తే రూ.500లకే సిలిండర్‌ వస్తుందని ఇంట్లో గ్యాస్‌ పూర్తయినా తీసుకోకుండా పక్కంటి వారి నుంచి, స్నేహితుల వద్ద నుంచి అదనపు సిలిండర్‌ బదులు తీసుకొని నెట్టుకొచ్చారు. తాజాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించడంతో రూ.500కు సిలిండర్‌ ఇచ్చేందుకు సమయం పడుతుందని భావించిన వినియోగదారులు జనవరి 1 నుంచి వాటి కోసం ఎగబడ్డారు. ఇదిలా ఉండగా, ఇటీవల పెట్రో ట్యాం కర్ల యజమానులు నాలుగు రోజులు సమ్మె చేశారు. దీంతో స్టాక్‌ పాయింట్ల వద్ద గ్యాస్‌ నిల్వలు తగ్గాయి. దీంతో మోత్కూరు భారత్‌ గ్యాస్‌ గోదాంకు రోజు విడిచి రోజు ఒక లోడ్‌ రావాల్సి ఉండగా, నాలుగైదు రోజులకు ఒక లోడ్‌ వస్తోంది. ఇటు సకాలంలో కావాల్సినన్ని సిలిండర్లు సరఫ రా కాక, అటు ఒక్క సారిగా డిమాండ్‌ పెరగడంతో గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. మోత్కూరు భారత్‌ గ్యాస్‌ గో దాం పరిధిలో మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాలతో పాటు తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో దీపం పథకం గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ల కొరత కారణంగా డోర్‌ డెలివరీ కాంట్రాక్టరు గ్రామాలకు తీసుకెళ్లలేకపోవడంతో గ్రామాలు, మండల కేంద్రాల నుంచి వినియోగదారులు మోత్కూరు గోదాంకు వచ్చి తీసుకెళ్తున్నారు. పండుగ ముందు ఈ కష్టాలేంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోత్కూరు లో గ్యాస్‌ కొరతపై అదనపు కలెక్టర్‌ సైతం ఆరా తీసినట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10.80లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. కాగా, పలుచోట్ల అన్ని కంపెనీల గ్యాస్‌ గోదాంల వద్ద ఇదే పరిస్థితి ఉంది.

మూడు వారాలుగా గ్యాస్‌ సిలిండర్లు రాలేదు : ఎలిమినేటి లక్ష్మి, ఆత్మకూరు(ఎం)

మోత్కూరు భారత్‌ గ్యాస్‌ గోదాం నుంచి ఆత్మకూరుకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా అవుతుంటాయి. మేం ఆన్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసి సుమారు మూడు వారాలు అవుతోంది. నేటికీ సిలిండర్‌ రాలేదు. మూడు వారాలుగా గ్రామానికి సిలిండర్ల వ్యాన్‌ రాలేదు. గ్యాస్‌ సిలిండర్‌ ఖాళీ అవడంతో పండుగ ముందు ఇబ్బంది అవుతోంది. వెంటనే గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలి.

సరఫరా తక్కువ, డిమాండ్‌ ఎక్కువ : ఆంజనేయులు, మోత్కూరు భారత్‌ గ్యాస్‌ గోదాం ఇన్‌చార్జి

మోత్కూరు గోదాంకు రోజు విడిచి రోజు సిలిండర్ల లోడ్‌ రావాల్సి ఉంది. పెట్రో ట్యాంకర్ల సమ్మె కారణంగా కంపెనీల నుంచి మూడు, నాలుగు రోజులకు ఒక లోడ్‌ వస్తోంది. అదీకాక రెండు మాసాలుగా వినియోగదారులు సిలిండర్లు తీసుకోకుండా ఇప్పుడు అంతా ఒక్క సారిగా రావడంతో కొరత ఏర్పడింది. వారం రోజుల్లో అంతా సర్దుకుంటుంది.

Updated Date - Jan 12 , 2024 | 11:31 PM