Share News

దుకాణాలు కొండపైనేనా!

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:21 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనాని కి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండగా, రద్దీకి అనుగుణంగా కొండపైనే మరికొన్ని దుకాణాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి.

దుకాణాలు కొండపైనేనా!

కొండకింద నిర్మించిన సముదాయాల సంగతేంటో

టెండర్లు లేకుండా వర్తకులకే అప్పగించేనా..

భువనగిరి అర్బన్‌: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనాని కి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండగా, రద్దీకి అనుగుణంగా కొండపైనే మరికొన్ని దుకాణాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ దుకాణాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం మొ గ్గు చూపుతుండటంతో వాటి కోసం కొండపైనే సూచనప్రాయంగా స్థలాన్ని నిర్ధారించారు. అయి తే వైటీడీఏ మాస్లర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా వీటిని ఇక్క డ ఎలా ఏర్పాటు చేస్తారు? వీటికి టెండర్లు నిర్వహిస్తారా? కొండపైన వర్తకులకే అప్పగిస్తారా? కొండకింద నిర్మించిన సముదాయాల సంగతేందీ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు నిర్ణయం ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

గత ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఆల యం,ఇతర అవసరాలకు మినహా కొండపైన ఎలాం టి నిర్మాణాలు ఉండొద్దని నిర్ణయించింది. ఇతర అవసరాలకు కొండకింద భూసేకరణ చేసి తేప్పోత్సవం, లక్ష్మీపుష్కరిణి, దీక్షపరుల మండపం, కల్యాణ కట్టా, అన్నదాన సత్రం, బస్టాండ్‌ తదితరాలకు సంబంధిం చి భవనాలను వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించింది. వీటితో పాటు ఇక్కడే రూ.13కోట్ల వ్యయంతో 162 దుకాణ సముదాయాలను వర్తకుల కోసమే నిర్మించింది. ఈ నిర్మాణాలు ఇలా ఉండగానే 112మంది వర్తకులు జీవనోపాధి కోసం కోర్టు ద్వారా 2026 సంవత్సరం వరకు స్టే పొంది కొండపైనే 10 దుకాణాల ద్వారా వర్తకం నిర్వహిస్తున్నారు.

విప్‌ ప్రకటనతో...

కోర్టుస్టేతో కొండపైన వర్తకులు 10 దుకాణాలు నిర్వహిస్తుండగా, అదే సమయంలో మరో 15 దుకాణాలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ప్రకటించారు. వైటీడీఏ మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా వీటిని కొండపైన ఏర్పాటు చేస్తారా? అవి కూడా టెండర్లు నిర్వహించకుండా కొండపైన వర్తకులకే కేటాయిస్తారా? పాత ఆచారా ల పునరుద్ధరణ పేరుతో కొండపైనే ఏర్పాటు చేస్తే కొండకింద నిర్మించిన దుకాణ సముదాయాలు సం గతేంటి? అసలు నిరుద్యోగులకు కేటాయిస్తారా అనే ప్రశ్నలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సందేహాల నడుమ కొండపైన కొత్తగా ఏర్పాటు చేయను న్న దుకాణాలు సముదాయాల కోసం అధికారులు స్థలాన్ని సూచనప్రాయంగా గుర్తించినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. బ్రేక్‌ దర్శనం టికెట్‌ కౌంటర్‌ నుంచి పైకి వెళ్లే దారిలో వాహనాల పా ర్కింగ్‌ స్థలానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటుకు యోచిస్తున్నారు. అధికారులు కూడా మొగ్గు చూపడంతో కేటాయింపు ఇప్పటికే వర్తకులకేననే ఆపోహలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఆలయ పునర్నిర్మాణం సమయం నుంచి ఉపాధి కల్పించాల ని స్థానికంగా డిమాండ్‌ ఉంది. వాటికి అనుగుణం గా దుకాణాలు కేటాయింపులు చేస్తారో? లేదోననే అనుమాలు ఉన్నాయి. కొండపైన వర్తకులకే 15 దుకాణాలు కేటాయిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వ విప్‌ను స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పాత ఆచారాల పునరుద్ధర ణ పేరుతో భక్తులకు తీర్థం సమర్పణ, శఠగోపం అందజేయడం, 10 దుకాణాల ఏర్పాటు, కొబ్బరికాయలు కొట్టే స్థలం, డార్మెంటరీ హాల్‌ తదితరాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వచ్చాయి. వీటి పేరు తో ఈ 15 దుకాణాలు కూడా కొండపైనే ఏర్పాటు చేస్తారేమోననే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.

భక్తుల రద్దీకి అనుగుణంగా దుకాణాలు : భాస్కర్‌రావు, ఆలయ ఈవో

భక్తుల రద్దీకి అనుగుణంగా దుకాణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కమిషనర్‌కు పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలు కేటాయింపు ఉంటుంది. ప్రస్తుతం 10 దుకాణాలకు 2026 సంవత్సరం వరకు కోర్టు స్టే విధించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 15దుకాణాలు వర్తకులకే కేటాయిస్తారో? టెండర్లు నిర్వహిస్తారో? ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ప్రకటిస్తాం.

Updated Date - Jul 28 , 2024 | 12:21 AM