Share News

ఆమెకేదీ అందలం

ABN , Publish Date - May 08 , 2024 | 12:02 AM

ఓట్లలోనూ ఆమెదే పైచేయి. ఆమెను అందెలం ఎక్కిస్తామని అన్ని పార్టీలు ఉపన్యాసాల తో ఊదరగొడతాయి. కానీ వాస్తవంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి.

ఆమెకేదీ అందలం

పార్లమెంట్‌లో కాలుమోపని మహిళ

ఓట్లలో అధికమైనా.... అవకాశమివ్వని పార్టీలు

భువనగిరి పార్లమెంట్‌ నుంచి మొండిచేయి!

భువనగిరి టౌన్‌, మే7: ఓట్లలోనూ ఆమెదే పైచేయి. ఆమెను అందెలం ఎక్కిస్తామని అన్ని పార్టీలు ఉపన్యాసాల తో ఊదరగొడతాయి. కానీ వాస్తవంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి. 18వ పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాలనుంచి ఏ ఒక్క మగువ నేటివరకూ పార్లమెంట్‌లో ప్రజాప్రతినిధిగా కాలు మోపలేదు. ప్రధాన రాజకీయ పార్టీలేవి మహిళలను ఇప్ప టివరకు పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలపకపోవడమే అసలైన కారణం. సుమారు పదేళ్లపాటు సోనియాగాంధీ జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగి, నేటికీ ఆమెనే ఆ పార్టీ అగ్రనేతగా కొనసాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ, చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటున్న బీజేపీ, మహిళాభ్యుదయానికి తామే అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న బీఆర్‌ఎస్‌ మహిళలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయి మినహా చైతన్యానికి, కార్యదక్షతకు ప్రతీకలైన మగువలను పార్లమెంటుకు పంపే చిత్తశుద్ధిని చూపలేదని మహిళాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీపీఎం మాత్రం 2019 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి మల్లులక్ష్మిని నిలిపి కాస్త చిత్తశుద్ధిని ప్రదర్శించింది.

ప్రచారానికి మాత్రమే పరిమితం

అన్ని రంగాలతోపాటు రాజకీయ రంగంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న నేతల మాటలు ఊరడింపునకే పరిమితమవుతున్నాయనేది జగమెరిగిన సత్యం. రిజర్వేషన్‌ కారణంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం పదవులు దక్కుతున్నప్పటికీ విధుల్లో మాత్రం కుటుంబ సభ్యులదే ఆధిపత్యంగా ఉంటుంది. కనీసం పార్టీ పదవులలోనూ తమకు ప్రాధాన్యం గుర్తింపు, గౌరవం లభించడంలేదని అన్ని పార్టీల మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు వాపోతుండటం సర్వసాధారణమే. కానీ పార్టీ, ఎన్నికల సభలకు, కార్యక్రమాలకు మాత్రం అధికసంఖ్యలో తరలి రావాలని ఆదేశిస్తున్న తీరు సమంజసంగా ఉండటంలేదని స్వయంగా ఆ పార్టీల మహిళా నాయకులే పార్టీ వేదికలపై పలుమార్లు లేవనెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో సభలకు, ర్యాలీలకు ప్రత్యేక ఆకర్షణ చేకూరేందుకే కేవలం తాత్కాలిక ప్రాధాన్యం, గుర్తింపు ఇస్తున్నారని మహిళా నాయకురాళ్లు వాపోతున్నారు. ఇప్పటికైనా మహిళల నాయకత్వ పటిమపై ఉన్న చిన్న చూపును వీడాలని కోరుతున్నారు.

ఆమెదే పైచేయి

ప్రస్తుత 2024 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. రెండు నియోజక వర్గాలలో కలిపి పురుషులకంటే మహిళా ఓటర్లు 44, 162మంది అధికంగా ఉన్నారు. భువనగిరితో పోలిస్తే నల్లగొండలోనే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో ప్రచారానికి వచ్చే నాయకులను నిలదీయాలని, భవిష్యత్‌ లో చట్ట సభకు తమను పంపుతారని విశ్వాసం ఉన్న పార్టీలకే ఓటేయాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

ఓట్లు ఇలా..

నియోజక వర్గం మహిళలు పురుషులు ఇతరులు

భువనగిరి 9,04,247 8,94,376 78

నల్లగొండ 8,76,538 8,42,247 169

మొత్తం 17,77,785 17,36,623 247

Updated Date - May 08 , 2024 | 12:02 AM