Share News

కాగితాలకే పరిమితమైన పారిశుధ్య ప్రణాళిక

ABN , Publish Date - May 22 , 2024 | 12:19 AM

చెర్వుగట్టు దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులు ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాట్లపై చేపట్టిన సర్వే ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. అదేవిధంగా రాతిబండ తొలగింపు పనులు రెండు నెలలుగా నిలిచిపోయాయి.

కాగితాలకే పరిమితమైన పారిశుధ్య ప్రణాళిక
తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మురికికాల్వ

చెర్వుగట్టు దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులు ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాట్లపై చేపట్టిన సర్వే ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. అదేవిధంగా రాతిబండ తొలగింపు పనులు రెండు నెలలుగా నిలిచిపోయాయి.

నార్కట్‌పల్లి, మే 21 : నల్లగొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంపై పారిశుధ్య ప్రణాళిక కేవలం కాగితాలకే పరిమితమైంది. గుట్టపై మెరుగైన పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటు కోసం సర్వే చేయించి తయారు చేసిన ప్రణాళిక దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కార్యాచరణ దిశగా అడుగులు పడటంలేదు. దేవస్థానంలో పారిశుధ్య లోపంపై తరుచూ భక్తుల ఫిర్యాదులతో పాటు దేవస్థానాన్ని సందర్శించిన అప్పటి దేవదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ చెర్వుగట్టుపై అపరిశుభ్రత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఇందుకుగాను మెరుగైన పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటులో పూర్తి అవగాహన ఉండే మునిసిపల్‌ అధికారుల సలహా తీసుకోవాలని భావించారు. అప్పటి నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న రమణాచారిని సంప్రదించారు. ఎండోమెంట్‌ కమిషనర్‌ విజ్ఞప్తి మేరకు చెర్వుగట్టుపై పారిశుధ్య వ్యవస్థ కోసం హైదరాబాద్‌కు చెందిన ఎనసీపీఈ అనే ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో సర్వే చేసి అంచనా నివేదిక తయారీ చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారు. రమణాచారి సూచనల మేరకు ఎనసీపీఈకి చెందిన ఇంజనీర్లు రెండు పర్యాయాలు చెర్వుగట్టు క్షేత్రాన్ని సందర్శించి గుట్టపైన, కింద, గుట్ట చుట్టూ దేవస్థాన స్థలాలను క్షేత్ర పరిశీలనతో సర్వే పూర్తి చేసి వాస్తుదోషాలు లేకుండా ఉండేలా సుమారు రూ.1.93 కోట్ల అంచనాతో డిజైన చేసిన డీపీఆర్‌ నివేదికను నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌కు అందజేశారు.

సర్వేలో ప్రతిపాదించిన పనులు

చెర్వుగట్టుపై పక్కా మెరుగైన పారిశుధ్యం ఏర్పాటను ఎనసీపీఈ ఇంజనీర్ల బృందం సర్వే చేసి ఇచ్చిన డీపీఆర్‌లో పేర్కొంది. గుట్టపై 520 మీటర్ల నిడివిలో సుమారు రూ.36.63 లక్షల అంచనా వ్యయంతో 300 డయాతో కూడిన సేవరేజ్‌ లేన, 2000 మీటర్ల నిడివిలో రూ.64.44 లక్షల అంచనాతో డ్రైనేజీ, వరద నీటి కాల్వ నిర్మాణం, రూ.23లక్షల అంచనా వ్యయంతో 67 చోట్ల మ్యానహోల్స్‌ నిర్మాణం, 1,200 మీటర్ల నిడివితో రూ.17.27లక్షలతో సెప్టిక్‌ట్యాంక్‌ నిర్మాణం, రూ.37.61లక్షలతో క్రాష్‌ బారియర్‌, బీంగార్డు బారియర్స్‌, గాల్వనైజ్డ్‌ హాట్‌డిప్‌ ప్రాసెస్‌, రూ.15లక్షలతో సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా పనులను ప్రతిపాదించింది.

నిలిచిన....‘బండ’ తొలిచే పనులు!

చెర్వుగట్టు దేవస్థానం ప్రధానాలయంలో చేపట్టిన రాతిబండ (పొరల) తొలగింపు పనులు రెండు నెలలకు పైగా నిలిచాయి. లింగరూపుడై గుహలో కొలువైన మూలమూర్తిని భక్తులు దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రవేశ ద్వారం నుంచి లోపలివరకు అడ్డు తగిలే రాతిబండ పక్కన వంగి స్వామిని చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిటారుగా నిలబడి నిఠలేశ్వరుడిని తనివితీరా చూసేలా ఆలయ లోపలి భాగాన్ని సౌకర్యవంతంగా మలచాలని చేపట్టిన రాతిబండ పొరల తొలగింపు పనులు రెండు నెలలకు పైగా నిలిచిపోయాయి. గత ఏడాది ఆగస్టులో రాతిబండ పొరల తొలగింపు పనులను ప్రారంభించారు. సుమారు రూ.14లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను ఆరు నెలల్లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భక్తులు నిల్చునేలా రాతిబండ పొరల తొలగింపు సుమారు 1200 సీఎ్‌ఫటీ పరిమాణంలో చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 700 సీఎ్‌ఫటీ పరిమాణం వరకే చేయగలిగారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్టు ఉన్న కారణంగా బ్లాస్టింగ్‌కు బదులు బ్లేడ్‌ కటింగ్‌ విధానంతో మాత్రమే చేయాల్సి రావడం, పైగా కేవలం ఆలయం మూసివేసిన సమయాల్లో మాత్రమే పనులు చేయాల్సి ఉండటంతో సమయం సరిపోలేదని తెలుస్తోంది. దీంతో రోజుకు 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే చేయగలిగారు.

ఇదిలా జనవరి నెలాఖరు వరకు కొనసాగిన పనులు దేవస్థానంలో ఫిబ్రవరి మాసంలో జరిగిన జాతర నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. మిగిలిన 500 సీఎ్‌ఫటీ ఏరియా పనిని పూర్తిచేసి తొలచిన పొరల స్థానాన్ని మృదువగా మార్చే పనులు చేయాల్సి ఉంది. అదేవిధంగా స్వామివారి మూలవిరాట్టు దర్వాజ వెడల్పుతో పాటు ఎదురుగా భక్తులు కూర్చుని పూజల్లో పాల్గొనే ప్రాంగణాన్ని పాలిష్‌ బండలతో సుందరీకరించాల్సి ఉంది.

చర్యలు తీసుకుంటాం

అపరిశుభ్రత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూపొందించిన ప్రతిపాదనలు కమిషనర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.శాఖాపరంగా పాలనా, సాంకేతిక పరమైన అనుమతులు రావాల్సి ఉంది. రాగానే పనులు ప్రారంభిస్తాం. అదేవిధంగా రాతిబండ పొరల తొలగింపు పనులను త్వరగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తాం. జాతర సమయంలో పనులు నిలిపివేశాం. తర్వాత సదరు కాంట్రాక్టర్‌కు చెందిన బంధువులు మృతిచెందడంతో కొంత ఆలస్యం జరిగింది. వెంటనే పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడతాం.

సిరికొండ నవీన కుమార్‌,

Updated Date - May 22 , 2024 | 12:19 AM