Share News

బిక్కేరు నుంచి ఇసుక తరలింపు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:12 AM

ఇసుక అక్రమ రవాణా నివారణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా అవి అమలుకు నోచుకోవడంలేదనడానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. బిక్కేరు గర్భాన్ని చీల్చి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తుండగా అడ్డుకోబోయిన రైతులను ‘అడ్డొస్తే తొక్కేస్తాం’ అంటూ ఇసుక అక్రమరవాణాదారులు బెదిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బిక్కేరు నుంచి ఇసుక తరలింపు
బండకొత్తపల్లి బిక్కేరు వాగులో ఇసుకను తరలించడంతో గుంతలుగా ఏర్పడ్డ దృశ్యం

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

గుండాల, మార్చి 28: ఇసుక అక్రమ రవాణా నివారణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా అవి అమలుకు నోచుకోవడంలేదనడానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. బిక్కేరు గర్భాన్ని చీల్చి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తుండగా అడ్డుకోబోయిన రైతులను ‘అడ్డొస్తే తొక్కేస్తాం’ అంటూ ఇసుక అక్రమరవాణాదారులు బెదిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలోని బండకొత్తపల్లి బిక్కేరువాగు నుంచి రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బిక్కేరువాగు ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తే భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని తద్వారా వేసవిలో నీటి కొరత ఏర్పడుతుందని రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ రోజు గ్రామంలో రాత్రి 10గంటలు దాటిందంటే ట్రాక్టర్ల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లిపోతోందని, ఆ సమయంలో పొరపాటున అటువైపు ఎవరైన వచ్చినారంటే అడ్డం వస్తే తొక్కించే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు ట్రాక్టర్లను అనుభవం లేని 18సంవత్సరాలలోపు పిల్లలు కూడా ట్రాక్టర్లను నడుపుతూ ఇసుకను తరలిస్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బండకొత్తపల్లి గ్రామం యాదాద్రిభువనగిరి జిల్లాలో సరిహద్దు గ్రామాన్ని ఆనుకుని ఉన్న జనగాం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని నూనెగూడెం, మర్రిపడగ, సీతారాంపురం, వెల్మజాల, రామారం, కొమ్మాయిపల్లి గ్రామాలకు ఇసుక సమస్య తీవ్రంగా ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకున్న ఇసుకాసురులు రాత్రి సమయంలో ఇసుకను తరలిస్తూ ఎక్కువ ధరకు విక్రయించి, జేబులు నింపుకుంటున్నారు. ఇదంతా ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణాపై ప్రశ్నించిన వారిని ‘అడ్డొస్తే తొక్కేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.

అడ్డొస్తే తొక్కిస్తా అంటున్నారు

పగలు రాత్రి అనే తేడా లేకుండా వేరే గ్రామాలకు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుకను తరలించవద్దంటూ అడ్డుకుంటే అడ్డొస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో రాత్రి సమయంలో వ్యవసాయ బావి వద్దకు వెళ్లాలంటే భయమవుతోంది. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి.

-శివరాత్రి అయిలయ్య, రైతు, బండకొత్తపల్లి

భూగర్భజలాలు అడుగంటుతున్నాయి

ఎండలు తీవ్రంగా కొడుతుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి పొలాలు పారడం లేదు. బిక్కేరు వాగులో ఇసుక తరలించడం వల్ల భూగర్భజలాలు మరింత అడుగంటి పోయి తాగు, సాగు నీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ఇసుక రవాణాను నిలిపివేసేలా చూడాలి.

సింగారం చంద్రయ్య, రైతు, బండకొత్తపల్లి

పర్యవేక్షించి చర్యలు చేపడుతాం

బండకొత్తపల్లి గ్రామంలోని బిక్కేరు వాగును పరిశీలిస్తాం. అక్రమంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకుంటాం.

-జలకుమారి, తహసీల్దార్‌, గుండాల మండలం

Updated Date - Mar 29 , 2024 | 12:12 AM