Share News

పాలేరు వాగులో ఇసుక మాఫియా

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:41 PM

భూగర్భజలాలు అడుగంటిన సంద్భరంలో జలవనరులను సంరక్షించుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వాగులను ఇసుక మాఫియా చెరబడుతోంది. అడ్డగోలుగా తవ్వకాలు చేస్తూ వాగులను ధ్వంసం చేస్తోంది. పోలీసు యంత్రాంగం, ఛోటా లీడర్ల కనుసన్నల్లో వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.

పాలేరు వాగులో ఇసుక మాఫియా

రెండు మండలాల కీలక నాయకుల కనుసన్నల్లో అక్రమ రవాణా

పోలీసుల సహకారంతోనే మాఫియా రెచ్చిపోతోందనే ఆరోపణలు

150 ట్రాక్టర్లను సమీకరించి దందా

రాత్రివేళ జోరుగా రవాణా

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): భూగర్భజలాలు అడుగంటిన సంద్భరంలో జలవనరులను సంరక్షించుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వాగులను ఇసుక మాఫియా చెరబడుతోంది. అడ్డగోలుగా తవ్వకాలు చేస్తూ వాగులను ధ్వంసం చేస్తోంది. పోలీసు యంత్రాంగం, ఛోటా లీడర్ల కనుసన్నల్లో వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు రాజకీయనేతల ఒత్తిళ్లకు లొంగి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రవహించే పాలేరు వాగును చెరబట్టిన ఇసుకమాఫి యా వేములపల్లి మండలం రావులపెంట పరిసర ప్రాంతాల నుంచి నిత్యం 150 పైచిలుకు ట్రాక్టర్లతో ఇసుకను మిర్యాలగూడ, పరిసర గ్రామాలకు అక్రమంగా తరలిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా సాగే ఈ దందాని అడ్డుకోవాల్సిన అధికారయంత్రాంగం వారికి సహకరిస్తోందని వాగు పరిసర ప్రాంతాల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కీలక నాయకులు, పోలీసుల కనుసన్నల్లో పాలేరు వాగును ఇసుక మాఫియా లూటీ చేస్తోందని ఆరోపిస్తున్నారు. వేములపల్లి మండలంలో ప్రవహించే పాలేరు వాగు నుంచి రావులపెంట సమీపంలో అక్రమంగా ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా మిర్యాలగూడ పట్టణం తో పాటు పరిసర గ్రామాలకు రవాణా చేస్తున్నారు. మైనింగ్‌శాఖ నుంచి ఎలాంటి అనుముతులు లేకున్నా యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. మిర్యాలగూడ రూరల్‌, వేములపల్లి మండలాలకు చెందిన 150కి పైగా ట్రాక్టర్లను సమీకరించి ఇసుక రవాణా చేస్తున్న వారికి కొందరు నాయకులు పూర్తిగా సహకరిస్తున్నట్టు వినికిడి.

రోజుకో కోడ్‌

ప్రతి రోజూ రాత్రివేళల్లో ఇసుక దందా కొనసాగుతోంది. సిండికేట్‌లో ఉన్న ట్రాక్టర్లను మార్గమధ్యలో పోలీసులు పట్టుకోకుండా రోజుకో కోడ్‌ను వినియోగిస్తున్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎక్కడైనా వాహనాలు ఆపితే, ఈ కోడ్‌ను వారికి చెబితే ట్రాక్టర్లను వదిలేస్తున్నారు. ఎలాంటి ఆటంకాల్లేకుండా ట్రాక్టర్లలో ఇసుక రవాణాకు అనుమతిస్తున్నందు న ఒక్కో ట్రాక్టర్‌ యజమాని నెలకు రూ.12వేల వరకు చెల్లిస్తున్నారని, అందులో పోలీసులకు, ఇతర శాఖల అధికారులకు వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కీలకమైన ఇద్దరు నాయకులు పోలీ్‌సశాఖలో ఈ దందాను నియంత్రించాల్సిన అధికారితో పాటు, మరో క్షేత్రస్థాయి అధికారి, సుదీర్ఘకాలం పోలీస్‌ కార్యాలయంలో తిష్ఠవేసిన మరో ఉద్యోగితో కలిసి దీన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. ఒక్క రావులపెంట ప్రాంతం నుంచే నిత్యం 1,000 క్యూబిక్‌మీటర్ల వరకు ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ఇటు మైనింగ్‌శాఖకు గానీ, అటు రెవెన్యూశాఖకు గానీ, గ్రామపంచాయతీకి గానీ ఎలాంటి ఆదాయం రాకపోగా, అడ్డగోలు తవ్వకాలతో వాగులో నీటిచెమ్మలేకుండా పోతోంది. దీంతో పరిసరాల్లోని బోరుబావులు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. సూర్యాపేట- బీమారం- మిర్యాలగూడ రహదారిలో నిత్యం రాత్రివేళ భారీగా ఇసుకట్రాక్టర్లు ఎలాంటి అనుమతుల్లేకుండా వెళ్తున్నా పోలీసులుగానీ, ఇతర శాఖల అధికారులు గానీ పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈఅక్రమదందాకు సహకరిస్తున్న పోలీసులను కట్టడి చేసేందుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, సంబంధిత అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్‌, రెవెన్యూశాఖలు ఈ దందాను నిరోధించేందుకు కార్యాచరణ అమలు చేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. రావులపెంట కేంద్రం గా సాగుతున్న ఇసుకతవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని జిల్లా మైనింగ్‌శాఖ అధికారి జే.శామ్యూల్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Apr 20 , 2024 | 11:41 PM