Share News

సమ్మో హన రూపంలో సంరక్షకుడు

ABN , Publish Date - May 21 , 2024 | 11:56 PM

విష జలము తాగిన వారిని మరణం నుంచి కాపాడిన తీరు కాళీయ మర్ధన లీలలో భక్తులను రక్షించి కాళీయుడి గర్వమణిచేందుకు శ్రీకృష్ణుడిగా, హనుమద్వాహన రూఢూడైన శ్రీరామచంద్రమూర్తిగా భక్తకోటికి యాదగిరీశుడు దర్శనమిచ్చారు.

సమ్మో హన రూపంలో సంరక్షకుడు
తిరువీధుల్లో ఊరేగుతున్న స్వామివారు

కాళీయ మర్ధనుడిగా నృసింహుడు

రెండో రోజు జయంత్యుత్సవాలు

భువనగిరి అర్బన, మే 21 : విష జలము తాగిన వారిని మరణం నుంచి కాపాడిన తీరు కాళీయ మర్ధన లీలలో భక్తులను రక్షించి కాళీయుడి గర్వమణిచేందుకు శ్రీకృష్ణుడిగా, హనుమద్వాహన రూఢూడైన శ్రీరామచంద్రమూర్తిగా భక్తకోటికి యాదగిరీశుడు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం రెండో రోజు జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించారు. కాళీయమర్ధనుడిగా యాదగిరీశుడు శ్రీకృష్ణ అలంకరణలో వేద మంత్ర పఠనాలతో పూజలు చేపట్టారు. భక్తజనం పాల్గొనగా తిరువీధి సేవను ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిత్య ఆరాధనల అనంతరం ఉదయం నిత్యహవనములు, మూలమంత్ర జపాలు, లక్ష్మీసూక్త, శ్రీవిష్ణు సహస్ర పారాయణాలు, అభిషేకాలు, నవకలశస్నపనములతో పాటు స్వామిఅమ్మవార్లకు వివిధ పుష్పమాలికలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. రాత్రి వేళ సామూహిక పారాయణాలు, నృసింహ మూలమంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించి శ్రీరాముడి అలంకరణలో హనుమంత సేవ తిరువీధుల్లో చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి అలంకరణలు మినహా ఉదయం విశేషస్నపనం, నిత్యహవనం, నృసింహ మూలమంత్ర హనవం, లక్ష పుష్పార్చన రాత్రి నృసింహ మూలమంత్ర హవనం జయంత్యుత్సవాల్లో భాగంగా శాసో్త్రక్తంగా అర్చకులు నిర్వహించారు. వేడుకల్లో ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు దూశెట్టి క్రిష్ణ, పర్యవేక్షకులు రాజనబాబు, వాసం వెంకటేశ్వర్లు, అశోక్‌, రామారావు, ఉద్యోగ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:56 PM