Share News

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:45 PM

ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మోక్షం కలిగింది. శనివారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శనివారం నుంచి బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదల

నేటి నుంచి ప్రక్రియ ఆరంభం

నల్లగొండ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/భువనగిరిటౌన్‌: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మోక్షం కలిగింది. శనివారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శనివారం నుంచి బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియ ప్రారంభం కానుంది. మల్టీజోన్‌-2 పరిధిలోకి వచ్చే ఉమ్మడి జిల్లాలో ఈనెల 8 నుంచి 30వ తేదీ వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 23 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గత ఏడాది మల్టీజోన్‌-1లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్‌పడింది. ఆ సమయంలో ఆగిన ప్రక్రియ నుంచి తాజా ప్రక్రియను కొనసాగిస్తామని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లలోపు పదవీ విరమణ పొందనున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ల్యాంగ్వేజ్‌ పండిట్‌, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌ కూడా ఈ షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నారు. మృతిచెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల జాబితాను ఉన్నతాధికారులకు ఆయా జిల్లాల డీఈవోలు నివేదించారు. దీంతో కొత్త సీనియారిటీ జాబితాలను రూపొందించి ఉపాధ్యాయ బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మల్టీజోన్‌-2లో ఉన్న నల్లగొండ జిల్లాలో జీహెచ్‌ఎం పోస్టులు 109, సూర్యాపేట జిల్లాలో 102, యాదాద్రి జిల్లాలో 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - Jun 07 , 2024 | 11:45 PM