Share News

కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:03 AM

ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం రథసప్తమి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు.

కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు
ఏడుగుర్రాల రథంపై ఊరేగుతున్న స్వామివారు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 16 : ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం రథసప్తమి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన ఆచార్యులు నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవాలను శాసో్త్రక్తంగా నిర్వహించారు. ప్రధానాలయంలో ఉత్సవమూర్తులను పట్టువసా్త్రలు, ముత్యాలు, బంగారు, వజ్రాభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి సూర్యప్రభవాహనంపై తీర్చిదిద్దారు. అలంకారసేవను వేదమంత్రపఠనాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. ప్రధానాలయ తూర్పు పంచతల రాజగోపురం ముందు సూర్యప్రభవాహన సేవను అధిష్టింపజేసిన ఆచార్యులు ప్రత్యేకపూజలు చేపట్టి రథసప్తమి విశిష్టతను భక్తులకు వివరించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి స్వర్ణతాపడ దివ్యవిమానరథంపై తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. రథసప్తమి వేడుకలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లనథిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చకబృందం నిర్వహించగా ఆయన అనువంశీక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు పాల్గొన్నారు.

ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవ

యాదగిరీశుడి సన్నిదిలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆండాళ్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకస్వాములు ఊంజల్‌సేవలో తీర్చిదిద్ది తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. అష్టభుజి ప్రాకారమండపంలోని అద్దాల మండపంలోని ఊయలలో అధిష్టింపజేసి అనంతరం ఊంజల్‌ సేవోత్సవం కొనసాగింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.17,47,078 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా భక్తుల సౌకర్యార్థం కొండపైన బస్‌బేలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుచేసిన ఏటీఎంను దేవస్థాన అధికారులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. అదేవిధంగా ఈ నెల 19 నుంచి 25 వరకు కొనసాగనున్న పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను దేవస్థాన అధికారులు ఆవిష్కరించారు.

పాతగుట్టలో అధ్యయనోత్సవాలు

పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక అధ్యయనోత్సవాలు రెండో రోజైన శుక్రవారం ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ప్రభాతవేళ స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు ఉత్సవమూర్తులకు, ఆళ్వారాచార్యులకు పంచామృతాలతో నవకలశ స్నపనం జరిపి దివ్యమనోహరంగా అలంకరించి సేవోత్సవం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం పురప్పాట్టు సేవోత్సవం నిర్వహించిన ఆచార్యులు లక్ష్మీనృసింహుడికి, ఆళ్వార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక పర్వాలను అర్చక, రుత్వికబృందం నిర్వహించగా ఆలయ అనువంశీఖ ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు పాల్గొన్నారు.

విష్ణుపుష్కరిణి పునరుద్ధరణ పనులు

పాతగుట్ట లక్ష్మీనృసింహుడు కొలువుదీరిన కొండపైన ఉన్న విష్ణుపుష్కరిణి పునరుద్ధరణ పనులను దేవస్థాన అధికారులు దాతల సాయంతో నిర్వహిస్తున్నారు. విష్ణుపుష్కరిణిలో తెప్పోత్సవ మండపం, మెట్లను నిర్మించనున్నారు. తెప్పోత్సవ మండపంలో లక్ష్మీనృసింహుల విగ్రహాన్ని ప్రతిష్టాపనతో పాటు విష్ణుపుష్కరిణి ప్రారంభోత్సవ వేడుకలు త్వరలోనే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Feb 17 , 2024 | 12:03 AM