Share News

రక్షిత నీరు వృథా

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:30 AM

ప్రజల గొంతు తడపాల్సిన గోదావరి జలాలు భువనగిరి మునిసిపాలిటీ పరిధిలో రోడ్డుపై వృథాగా పారుతున్నాయి.

రక్షిత నీరు వృథా
భువనగిరిలో రోడ్డుపై పారుతున్న గోదావరి జలాలు

మూడు నెలలుగా రోడ్డుపై పారుతున్న గోదావరి జలాలు

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 23: ప్రజల గొంతు తడపాల్సిన గోదావరి జలాలు భువనగిరి మునిసిపాలిటీ పరిధిలో రోడ్డుపై వృథాగా పారుతున్నాయి. పైపులైన లీకేజీతో మూడు నెలలుగా స్థానిక జగదేవ్‌పూర్‌ రోడ్డు నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లే రహదారిపై 30వ వార్డు పరిధిలో రక్షిత జలాలు రోడ్డు పాలవుతున్నాయి. పైపులైన లీకేజీ, వృధా అవుతున్న తాగునీటిపై స్థానికులు ఇచ్చిన పలు ఫిర్యాదుల మేరకు ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది కూడా పలుమార్లు లీకేజీని పరిశీలించి వెళ్లారు మినహా ఇప్పటివరకు చేసిందేమీ లేదని స్థానికులు పేర్కొంటున్నారు. నీటి వృఽథాపై స్థానికులు ఇచ్చిన పలు ఫిర్యాదుల మేరకు అధికారులు, సిబ్బంది సందర్శించి వెళ్లారు మినహా చేసిందేమీ లేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో నల్లాల ద్వారా ఇంటికి చేరాల్సిన తాగునీరు రోడ్డుపై పారుతూ మురికి కాలువలో చేరుతోంది. దీంతో ఆ ప్రాంతంలో అపరిశుభ్రత నెలకొనడంతో పాటు లీకేజీ కారణంగా ఆ పైపులైన ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన లీకేజీల పేరిట మునిసిపల్‌ వార్షిక బడ్జెట్‌లో లక్షలాది రూపాయల కేటాయింపు జరుగుతున్నటికీ నెలల తరబడిగా లీకేజీలకు మరమ్మతులు చేపట్టకపోతుండటంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లీకేజీలు పట్టణ వ్యాప్తంగా ఉన్నాయని వెంటనే వాటన్నింటికీ మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని తాగునీటి పైప్‌లైన్లకు ఏర్పడిన లీకేజీలన్నింటికీ వెంటవెంటనే మరమ్మతులు చేయిస్తున్నామని, మిగిలిన లీకేజీలను త్వరలోనే నియంత్రిస్తామని మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజుల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 24 , 2024 | 12:30 AM