Share News

సాగర్‌ నీటితో చెరువులు, కుంటలను నింపాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:03 AM

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ నీటితో చెరువులు, కుంటలను నింపి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.

సాగర్‌ నీటితో చెరువులు, కుంటలను నింపాలి
ఐలాపురం చెరువులో గిరిజనులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ రూరల్‌, ఏప్రిల్‌ 5: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ నీటితో చెరువులు, కుంటలను నింపి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం గ్రామ చెరువులో గిరిజన మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోయాయని, ఫలితంగా సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడిందన్నారు. ముఖ్యంగా వేసవిలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఐలాపురం గ్రామస్థులు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి సాగర్‌ మెయిన కెనాల్‌ ద్వారా తాగునీటిని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం సాగర్‌ ఎడమకాల్వ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు తాగునీటి కోసం నీటిని తీసుకెళ్తున్నారని, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సాగర్‌ ప్రధానకాల్వ ద్వారా చుట్టుపక్కల ఉన్న చెరువులను, కుంటలను నింపాలని డిమాండ్‌ చేశారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి తాగునీటి ఎద్దడిని నివారించవచ్చని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సాగర్‌ నీటితో చెరువులను, కుంటలను నింపి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బీకార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్‌, రాంమ్మూర్తి, నాగేశ్వర్‌నాయక్‌, శ్రీనునాయక్‌, వెంకటేశ్వర్లు, జగననాయక్‌, బాణావత నాగమ్మ, సునీత, లక్ష్మి, నాగమ్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:03 AM