Share News

మహోద్యమానికి పోచంపల్లి నాంది

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:45 AM

చారిత్రక మహోద్యమానికి భూదాన్‌పోచంపల్లి నాంది పలికింది. గాంధీజీ ఆశయాలు, సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేయడంకోసం ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు.

మహోద్యమానికి పోచంపల్లి నాంది

భూదాన్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన వినోబాభావే

నేడు భూదాన్‌ జయంతి ఉత్సవం

భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్‌ 17: చారిత్రక మహోద్యమానికి భూదాన్‌పోచంపల్లి నాంది పలికింది. గాంధీజీ ఆశయాలు, సర్వోదయ సిద్ధాంతాలను ప్రచారం చేయడంకోసం ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. సర్వోదయ నాయకుడు శ్రీరామకృష్ణ దూత్‌ ఆహ్వానంమేరకు 1951 ఏప్రిల్‌ 15న హైదరాబాద్‌ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. అప్పట్లో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న రజాకార్ల దోపిడీలు, కల్లోల పరిస్థితులను తెలుసుకుని పరిష్కారమార్గాన్ని అన్వేషించడానికి వెంటనే పాదయాత్రగా బయలుదేరి 17వ తేదీన ప్రస్తుత పోచంపల్లికి వినోబాభావే చేరుకున్నారు. మరుసటి రోజు ఏప్రిల్‌ 18న ఎస్సీలతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమి ఇస్తే సాగు చేసుకొని జీవిస్తామని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా? అని వినోబాభావే ప్రశ్నించారు. అక్కడే ఉన్న వెదిరె రామచంద్రారెడ్డి వెంటనే లేచి 100 ఎకరాల సేద్యయోగ్యమైన భూమిని దానం చేస్తానని ప్రకటించి.., అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి వినోబాభావేకు అందజేశారు. వెంటనే ఆ భూమిని వినోబాభావే పేదలకు పంచి భూదానోద్యమానికి బీజంవేశారు. ఇలా భూదానోద్యమానికి పోచంపల్లిలోనే అంకురార్పణ జరిగింది. ఇదిలా ఉంటే భూదాన్‌పోచంపల్లిలో నేడు భూదాన్‌ జయంతి ఉత్సవం నిర్వహించనున్నారు.

వినోబా మందిరానికి ఆదరణ ఏదీ...?

పోచంపల్లిలో భూదానోద్యమ చారిత్రక నేపథ్యానికి స్మృతి చిహ్నంగా నిర్మించిన వినోబామందిరం నేటికీ ప్రారంభానికి నోచలేదు. స్మృతిచిహ్నం, వినోబామందిరం శిఽథిలం కాగా, 2012లో రూ.50లక్షలతో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పట్టణంలో వినోబామందిరాన్ని పునర్నిర్మించారు. దాని పర్యవేక్షణ లేక ఎప్పుడూ తాళం వేసే కన్పిస్తోంది. అంతేగాక నిత్యం దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందులో నాటి భూదానోద్యమ చారిత్రక నేపథ్యాన్ని చాటేందుకు ఫొటోగ్యాలరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నేటికీ వినోబామందిరం ఆదరణ లేక వెలవెల పోతోంది.

Updated Date - Apr 18 , 2024 | 12:45 AM