Share News

సాగునీటి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:03 AM

సాగునీటి ప్రాజెక్టులతోపాటు కాల్వల పెండింగ్‌ పను లు త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జిల్లా యంత్రాంగానికి సూచించారు.

సాగునీటి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయాలి

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదాద్రి,జనవరి 10(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులతోపాటు కాల్వల పెండింగ్‌ పను లు త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య జిల్లా యంత్రాంగానికి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులతోపాటు నూతనంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగేతో కలిసి సమీక్ష సమావేశంలో చర్చించారు. కాళేశ్వరం రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా 14, 15, 16వ ప్యాకేజీలో కాల్వల పురోగతిపై సమీక్షించారు. వీటికి సంబంధించిన భూసేకరణ వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణపై వివరాలను వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి 10 సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి స్థలాలు సేకరించాలన్నారు. ప్రతీ అధికారి కూడా ప్రజలకోసం పనిచేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే మాట్లాడుతూ ప్రాధాన్య క్రమంలో నీటిపారుదల, చెరువులు, చెక్‌డ్యాంలు, రోడ్ల పనులకు సంబంధించిన ప్రణాళికనలు రూపొందించాలని, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు కావాల్సిన స్థలాలపై నివేదిక తయారు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.

ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతేనే పనులు

బస్వాపూర్‌లోని నృసింహసాగర్‌ రిజర్వాయర్‌ పనులతోపాటు భూసేకరణకు సంబంధించిన నిధుల మంజూరుకోసం ప్రభుత్వానికి నివేదించామని అధికారులు విప్‌ దృష్టికి తెచ్చారు. ముంపు గ్రామాలైన బస్వాపూర్‌, లప్పానాయక్‌ తదితరతండాలకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ఇదివరకే ప్రతిపాదనలు పంపామని, వాటిని మంజూరు చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా మైనర్‌ ఇరిగేషన్‌ కింద బునాదికాల్వ, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల ఆధునీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కావాలని కోరారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ ప్రాజెక్టులతోపాటు కాల్వల పునరుద్ధరణకు సంబంధించిన ప్రస్తుతం అవసరమైన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తాను మంత్రులతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, ఎ.భాస్కర్‌రావు, ఆర్డీవో అమరేందర్‌, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ ఈ ఈ శంకరయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నాగలక్ష్మి, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:03 AM