Share News

పత్తి రైతుల పరేషాన్‌

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:41 AM

వర్షాభావానికి తోడు ఎండల కారణంగా పత్తిచేలు వాడుముఖం పట్టడంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళనలో చెందుతున్నారు. మే నెలాఖరున, జూన్‌ మొదటి వారంలో కురిసిన వర్షాలతో తొలుత నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3లక్షల ఎకరాలలోపు విత్తనాలు విత్తారు.

పత్తి రైతుల పరేషాన్‌

ముఖం చాటేసిన వరుణుడు

చాలా ప్రాంతాల్లో వాడుతున్న మొక్కలు

ముడత తెగుళ్లతో దెబ్బతింటున్న చేలు

తెల్లబంగారం దిగుబడులపై ప్రభావం

నాన్‌ ఆయకట్టులో వరిసేద్యంపై నీలినీడలు

నల్లగొండ : వర్షాభావానికి తోడు ఎండల కారణంగా పత్తిచేలు వాడుముఖం పట్టడంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళనలో చెందుతున్నారు. మే నెలాఖరున, జూన్‌ మొదటి వారంలో కురిసిన వర్షాలతో తొలుత నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3లక్షల ఎకరాలలోపు విత్తనాలు విత్తారు. ఆ తరువాత జూలై మొదటి వారంలో కురిసిన వర్షాలతో 5లక్ష ల ఎకరాలకు పత్తి సాగు విస్తీర్ణం చేరింది. కాగా, కొద్దిరోజులు గా వర్షాలు లేకపోవడం పత్తిచేలు వాడుపడుతున్నాయి. దీనికి తోడు ముడత తెగుళ్లు రైతులను వేధిస్తోంది.

వర్షాలు లేక ఓ వైపు పత్తిచేలు వాడుపడుతుంటే మ రోవైపు తెగుళ్ల నుంచి పత్తిని కాపాడుకునేందుకు రైతు లు నానా తంటాలు పడుతున్నారు. పురుగు మందులను పిచికారీ చేస్తున్నా తెగులు అదుపులోకి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణశాఖ ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయని ప్రకటించినా చినుకు జాడ మాత్రం లేదు. దీనికి తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆదివారం నల్లగొండ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్ర త 35.5డిగ్రీలుగా నమోదు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలుగా ఉంది. వేసవిలా వానకాలంలో ఎండలు ఉండటంతో పత్తిచేలతో పాటు మెట్టపంటలు దెబ్బతినే పరిస్థి తి నెలకొంది. ఏక్కడో ఒకచోట జల్లులు తప్ప సమృద్ధిగా ఎక్కడా వర్షాలు నమోదవడం లేదు. మెట్ట పంటలు పూర్తిగా వాడుముఖం పట్టగా, పత్తిగూడలు రాలడంతోపాటు తెగుళ్లు వేధిస్తున్నాయి.

రెండు నెలలుగా లోటు వర్షపాతం....

పత్తి విత్తనాలు వేసి 60 రోజలు అవుతోంది. నల్లగొం డ జిల్లాలో 5.40లక్షల పత్తి సాధారణ విస్తీర్ణానికి ఇప్పటి వరకు 5లక్షల ఎకరాల్లో సాగైంది. రైతులు ఎన్నో ఆశలతో వానాకాలంలో పంటను సాగు చేయగా, వర్షాలు లేక పరిస్థితి తలకిందులైంది. జూన్‌ 1 నుంచి ఈనెల 18వ తేదీవరకు జిల్లాలో 281.8మి.మీల వర్షపాతానికి 302.3 మి.మీల వర్షం కురిసినట్లు సీపీవో కార్యాలయం పేర్కొంటోంది. ఈ 78రోజుల్లో 10.8మి.మీలు అధికంగా వర్షం కురిసింది. నల్లగొండ డివిజన్‌లో 7.2మి.మీలు, మిర్యాలగూడ డివిజన్‌లో 6.5మి.మీలు, దేవరకొండ డివిజన్‌లో 32.6మి.మీల వర్షపాతం అధికంగా నమోదైంది. చండూ రుడివిజన్‌లో 2.2మి.మీల వర్షపాతం లోటు ఉంది. జిల్లా వ్యాప్తంగా 10.8మి.మీలు మాత్రమే అధిక వర్షపాతం న మోదైంది. జూన్‌లో 82.3మి.మీల వర్షపాతానికి 160.8 మి.మీల వర్షం కురవగా, 93.3మి.మీలు అధికంగా నమోదైంది. జూలై మాసంలో 128.9మి.మీల వర్షపాతానికి 108.4మి.మీలు కురిసింది. 15.9మి.మీలు వర్షపాతం లోటు ఏర్పడింది. ప్రస్తుత నెలలో 139.0మి.మీల సాధారణ వర్షపాతం నమోదు కావల్సి ఉంది.ఈ నెల 18వ తేదీవరకు జిల్లాలో 69.7మి.మీల సాధారణ వర్షపాతానికి 43.1మి.మీల వర్షం కురిసింది.ఈ 18రోజు ల్లో 38.2మి.మీల లోటు వర్షపాతం నమోదైంది.

ఆందోళనలో పత్తి రైతులు

పత్తి రైతులు ఒక్కో ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎండు దుక్కుల నుంచి మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు మొత్తం కలిపి రూ.25వేల వరకు వ్యయమైంది. అయితే ప్రస్తత పరిస్థితులు చూస్తుంటే పెట్టుబడులు సైతం వచ్చే లా లేవని రైతులు వాపోతున్నారు. మరో వారం రోజుల్లోపు వర్షాలు కురవకపోతే పత్తిచేలు కోలుకునే పరిస్థితి ఉండదు. ఎకరానికి పత్తి 10క్వింటాళ్ల నుంచి 12క్వింటాళ్లకు దిగుబడి రావల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2 నుంచి 3క్వింటాళ్ల దిగుబడి వస్తుందో రాదో అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. మున్ముందు భారీ వర్షాలు నమోదైతేనే తెల్లబంగారం ముందుపడుతుంది.

నాన్‌ ఆయకట్టులో వరి సేద్యానికి అష్టకష్టాలు

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో బోరుబావులు అడుగంటిపోతున్నాయి. బోర్లలో నీరు ఇంకిపోవడంతో వరి సేద్యానికి రైతు లు అష్టకష్టాలు పడుతున్నారు. నాన్‌ ఆయకట్టులో బోరుబావులు ఆధారం గా రైతులు వరి సాగుచేశారు. నీరు అడుగంటడంతో బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 5.20లక్షల ఎకరాల్లో వరిసాగు కావ ల్సి ఉండగా, ఇప్పటి వరకు 3లక్షల ఎకరాల్లోపే వరిసేద్యమైంది. ఆయకట్టు లో సెప్టెంబరు 15లోగా మరో లక్ష ఎకరాల్లో వరిసేద్యమయ్యే అవకాశం ఉంది. ఈ వానాకాలంలో 1.20లక్షల ఎకరాల్లో వరి సేద్యం తగ్గనుంది. ఇక నాన్‌ ఆయకట్టులో వరి సాగైన ప్రాంతాల్లో బోర్లలో నీరు లేకపోవడంతో వానాకాలం వరిపంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. చాలా చోట్ల రైతులు ఐదెకరాలు ఉంటే ఎకరం నుంచి రెండు ఎకరాలు మాత్రమే నాట్లు వేశారు. దీని ప్రధాన కారణం వర్షాలు లేకపోవడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోవడం. వారంలోపు సాధారణ వర్షాలు కురిస్తే పత్తిచేలు బయట పడుతాయి. భారీ వర్షాలు కురిస్తే పత్తి రైతులు గట్టెక్కడంతోపాటు వరిసేద్యం పెరగనుంది. వాతావరణశాఖ వర్షాలు కురుస్తాయని చెబుతున్నా ఆకాశంలో మబ్బులు కానరావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేవరకొండ డివిజన్‌లో అత్యధికంగా వర్షాలు : పి.శ్రవణ్‌కుమార్‌ జేడీఏ, నల్లగొండ

నల్లగొండ జిల్లాలో దేవరకొండ డివిజన్‌లో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ ప్రాంత రైతులు పంటలకు యూరియా, పొటాష్‌ వాడుతున్నారు. పత్తిచేల దశ 60రోజులకు చేరింది. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంటోంది. రైతులు ఇప్పటి వరకు 5లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయ గా, 3లక్షల ఎకరాల్లో వరి సేద్యమైంది. సెప్టెంబరు 15 నాటికి మరో లక్ష ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నందున రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు.

Updated Date - Aug 19 , 2024 | 12:41 AM