Share News

‘జగన్మోహినీ’గా దర్శనమిచ్చిన నృసింహుడు

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:43 AM

జగద్రక్షుడు.. స్వయం భు పాంచనారసింహుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవ విశేష ఘట్టాలతో యాదాచల దివ్యక్షేత్రం ఆదివారం మహోత్సవ శోభను సంతరించుకుంది.

‘జగన్మోహినీ’గా దర్శనమిచ్చిన నృసింహుడు

యాదగిరికొండపై బ్రహ్మోత్సవ శోభతో

యాదగిరిగుట్ట, మార్చి17: జగద్రక్షుడు.. స్వయం భు పాంచనారసింహుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవ విశేష ఘట్టాలతో యాదాచల దివ్యక్షేత్రం ఆదివారం మహోత్సవ శోభను సంతరించుకుంది. వేద పండితులు, అర్చకబృందం, రుత్వికుల వేద పారాయణాలు, హోమ పూజలు, అలంకార సేవలతో పాటు ఆధ్యాత్మికత సందడి నెలకొంది. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోలు జరిగే రోజున స్వామివారు జగన్మోహినీ అలంకారంలో భక్తుల ను తన్మయ పరిచారు. సర్వజగత్తులోని సకల జీవరాశి ని తనవైపు ఆకర్షించడానికి.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణకు అవతార పురుషుడు లక్ష్మీనృసింహుడు ‘జగన్మోహిని’ దివ్య సుందర రూపంలో అలరింపజేశారు. పట్టుపీతాంబరాలు, బంగారు, వజ్ర, ముత్యాలను పొదిగిన దివ్యాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ముగ్ధమనోహర జగన్మోహిని అలంకార మూర్తుల సేవ ముందు పారాయణీకులు, పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛరణలు, మూలమంత్ర జపస్తోత్ర పఠనాలు జరపగా.. ఆస్థాన విధ్వాంసులు మంగళవాయిద్యాలు మోగిస్తుండగా భక్త జనులు గోవింద నామస్మరణ నడుమ ఆలయ తిరువీధుల్లో అలంకార సేవ ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయ తూ ర్పు రాజగోపురం ముందు అలంకారసేవకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘స్వామివారే పరమా త్మ’ ప్రజలందరూ జీవాత్మలు అనే భగద్గీతలోని సారానికి అనుగుణంగా నారసింహుడిని జగన్మోహిని దివ్యాలంకరణలో దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశం చెందారు. ఈ వైదిక కార్యక్రమాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాం డూరి వెంకటాచార్యులు, అర్చకబృందం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మక ర్త బి.నర్సింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు పాల్గొన్నారు.

యాగశాలలో హవన పూజలు

యాదగిరికొండపై అంగరంగ వైభవంగా జరుగుతు న్న లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం ప్రధానాలయ యాగశాలలో హోమ పూజలు నిర్వహించారు. మండపంలో రుత్వికు లు మూలమంత్ర జపాలు, వేద పారాయణాలు చేస్తూ యాగం నిర్వహించారు.

శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ప్రభాతభేరి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఆదివారం శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాతబేరి వైదిక పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రభాతవేళ వేదపారాయణాలతో స్థానిక శ్రీవైష్ణవస్వాములు, రుత్వికులు స్వామిని కొలుస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.

స్వామివారికి టీటీడీ మేల్చాట్‌ పట్టువస్త్రాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుమల తిరుపతి దేవస్థా నం తరపున ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కల్యాణ పట్టువస్త్రాలు(మేల్చాట్‌) ఉప కార్యనిర్వహణాధికారి లోకనా ధం,పర్యవేక్షకులు సురేష్‌, అర్చకులు మురళిలు సం ప్రదాయరీతిలో అందజేశారు. ముందుగా టీటీడీ అధికారులు, అర్చకస్వాములు బ్రహ్మోత్సవ కల్యాణ పట్టువస్త్రాలను తీసుకుని ప్రధానాయలం చుట్టూ ప్రదక్షిణచేసి ముఖమండపంలో ఆలయ అనువంశి క ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు కు అందజేశారు. ముందుగా స్వామివారిని జగన్మోహినీ అలంకారసేవలో టీటీడీ బృందం పాల్గొంది.

కొండపై యాత్రాజనుల సందడి

యాదగిరిక్షేత్రంలో ఆదివారం యా త్రాజనుల సందడి నెలకొంది. వారాంత పు సెలవు రోజు, దేవదేవుడి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తజనులు పెద్ద సంఖ్యలో ఇష్టదైవాల దర్శనాల కోసం తరలివచ్చారు. కొండపైన ఆలయ తిరువీధులు, ప్రసాదాల విక్రయశాల, దర్శన క్యూలైన్లు, కొండకింద పట్టణ ప్రధానవీధులు, ఘాట్‌రోడ్‌ ప్రాం తాలు భక్తులతో కోలాహలంగా కనిపించాయి. స్వా మివారి ధర్మదర్శనాలకు 3గంటల సమయం, ప్రత్యే క దర్శనాలకు 1గంట సమయం పట్టినట్టు, సుమా రు 30వేలకు పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించిన ట్టు, ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.42,59,584 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా స్వామికి నిత్యారాధనలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని స్వయంభువులను, ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడి నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి.

ఏకశిఖరవాసుడి సన్నిధిలో నేడు బ్రహ్మోత్సవ తిరుకల్యాణం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఘనంగా ఎదుర్కోలు మహోత్సవం

యాదగిరిగుట్ట, మార్చి 17: ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్నీరసింహస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టం తిరుకల్యాణాన్ని దేవస్థాన అర్చక,రుత్విక, వేదపండితుల బృందం సోమవారం రాత్రి 8.45గంటలకు సంప్రదాయరీతిలో ఆరంభించనున్నారు. ముందుగా స్వామివారిని గజవాహనసేవలో, అమ్మవారిని పుష్పామాలంకృత పల్లకి సేవలో తీర్చిదిద్ది ఆలయ తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. యాదగిరికొండ పై అఖిలాంఢ బ్రహ్మాంఢకోటి నాయకుడు లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 10వేల మంది భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవ కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక ముందు ప్రాంగణంలో బారికేడ్లతో గ్యాలరీలను నిర్మిస్తున్నారు. మీడియా, వీవీఐపీలు, దేవస్థాన సిబ్బందితో పాటు స్వామివారి బ్రహ్మోత్సవ కల్యాణ టికెట్టు కొనుగోలు చేసిన భక్తుల కోసం వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో సుమారు 3,500మంది పట్టేలా ధంగా ఏర్పాట్లు చేశారు. ఎనిమిది ఎల్‌ఈడీ టీవీల్లో నాలుగు కల్యాణ వేదిక ప్రాంతంలో, ఒకటి తూర్పు రాజగోపురం ముందు, ఒకటి దర్శన క్యూకాంప్లెక్స్‌ ముందు, రెండు కొండపైన బస్టాండ్‌ ప్రాంతంలో అమర్చనున్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసే భక్తులకు సరిపడా ప్రసాదాలను సిద్ధం చేశారు. కొండకింద ఉచిత అన్నదాన భవనంలో అన్నప్రసాదాల వితరణ చేయనున్నారు. సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, తిరుకల్యాణ వేడుకల్లో పాల్గొనేందుకు పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ కారణంగా సీఎంతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారికంగా వచ్చే అవకాశాలు లేవు.

నేత్రపర్వంగా ఎదుర్కోలు మహోత్సవం

నృసింహుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ సుముహూర్త నిర్ణయ ఘట్టం ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి ప్రధానాలయ తూర్పు తిరుమాఢ వీధిలో నేత్రపర్వంగా కొనసాగింది. దివ్యాలంకార శోభితుడైన నృసింహుడిని అశ్వవాహనంపై అధిరోహించి, పల్లకి సేవలో మహాలక్ష్మీ అమ్మవారిని అలంకరించిన ఆచార్యులు ఆలయ తిరువీధుల్లో ఊరేగింపుగా తూర్పు పంచతల రాజగోపురం వద్దకు తీసుకువచ్చి ఎదుర్కోలు నిర్వహించారు.

Updated Date - Mar 18 , 2024 | 12:43 AM