Share News

ఎంజీయూ ఇన్‌చార్జి వీసీగా నవీన్‌మిత్తల్‌

ABN , Publish Date - May 21 , 2024 | 11:46 PM

మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ఛాన్సలర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రిన్సిపల్‌ కార్యదర్శి (స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ) నవీన్‌మిత్తల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంజీయూ ఇన్‌చార్జి వీసీగా నవీన్‌మిత్తల్‌

15 జూన్‌ లేదా కొత్త వీసీ నియమితులయ్యేంతవరకు కొనసాగింపు

నేడు ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డికి వీడ్కోలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ఛాన్సలర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రిన్సిపల్‌ కార్యదర్శి (స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ) నవీన్‌మిత్తల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీకి పూర్తికాలపు వైస్‌ఛాన్సలర్‌ను నియమించేంతవరకు నవీన్‌మిత్తల్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతారు. ప్రస్తుత వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి 2021, మే 24న బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ముగియడంతో, తాజాగా ఇన్‌చార్జి వీసీని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించే ప్రక్రియను చేపట్టింది. అందుకు సెర్చ్‌ కమిటీలను నియమించి దరఖాస్తులను కూడా స్వీకరించింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ పోస్టుకు 157మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చే సుకున్నారు. దరఖాస్తుదారుల్లో సెర్చ్‌ కమిటీ ముగ్గురిని ఎంపికచేసి గవర్నర్‌కు నివేదిస్తే, ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్‌ వైస్‌ఛాన్సలర్‌గా నియమిస్తారు. ఈసారి రాజకీయపరమైన ని యామకం కాకుండా, యూనివర్సిటీల్లో విద్యాప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా, పారదర్శకం గా పనిచేసే, అనుభవజ్ఞులైన వారిని వీసీలుగా నియమిస్తున్నారనే చర్చ సాగినా, ఆ ప్రక్రియ కొలిక్కిరాకపోవడం, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉం డడంతో అనివార్యంగా ఐఏఎస్‌ అధికారులను ఇన్‌చార్జి వీసీలుగా నియమించినట్లు యూనివర్సిటీ వర్గాల్లో చర్చ సాగుతోంది.కొత్తవీసీ నియమితులయ్యేంతవరకు లేదా 15 జూన్‌ వరకు నవీన్‌మిత్తల్‌ ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వీసీగా పదవీ కాలం పూర్తిచేసిన గోపాల్‌రెడ్డికి బుధవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్లు రిజిస్ట్రార్‌ అల్వాల రవి తెలిపారు.

పూర్తికాలపు వీసీలు నలుగురే

మహాత్మాగాంధీ యూనివర్సిటీ 2007లో ఏర్పాటు కాగా, ఇప్పటి వరకు 14 మంది వీసీలుగా పనిచేశారు. వీరిలో నలుగురే పూర్తిస్థాయి వైస్‌ఛాన్సలర్లుగా నియమితులై పూర్తి పదవీకాలం పనిచేశారు. మొదటి వీసీగా ప్రొఫెసర్‌ వి.గంగాధర్‌ 2007-2010 వరకు మూడేళ్లు పనిచేయగా, ఆ తర్వాత ప్రొఫెసర్‌ కె.నరసింహారెడ్డి 2011-2014 వరకు పనిచేశారు. తదుపరి 2016-2019 వరకు ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ వీసీగా పనిచేయగా, 2021 నుంచి ఇప్పటివరకు ప్రొఫెసర్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి పదవీబాధ్యతలు నిర్వహించారు. మిగిలిన కాలంలో ఐఏఎస్‌ అధికారులు, ఇతర యూనివర్సిటీల వైస్‌ఛాన్సలర్లను ఇన్‌చార్జి వీసీలుగా నియమించి పాలన కొనసాగించారు. నవీన్‌మిత్తల్‌కు ముందు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కె.సునీత, శైలజారామయ్యర్‌, ఏ.వాణీప్రసాద్‌, టి.విజయ్‌కుమార్‌ ఎంజీయూకు ఇన్‌చార్జి వీసీగా పనిచేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని ఎంజీయూ లాంటి యూనివర్సిటీల్లో వీసీ స్థాయి నుంచి అన్ని స్థాయిల అధికారుల నియామకాలతో పాటు, నిధుల కేటాయింపుల్లో, విద్యపరంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వం చిన్నచూపు ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రమేయంతో పోస్టింగులిచ్చారే తప్ప యూనివర్సిటీల ప్రయోజనాలు పట్టించుకోలేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలోనైనా యూనివర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసే వైస్‌ఛాన్సలర్‌ నియామకం ఉండాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా నియమితులవ్వడంతో యూనివర్సిటీ పాలనపై నవీన్‌మిత్తల్‌ దృష్టి సారిస్తారా? లేక నామమాత్రంగా కొనసాగుతారా? అనే చర్చ యూనివర్సిటీ వర్గాల్లో సాగుతోంది. యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలపై ఇన్‌చార్జి వీసీ దృష్టి సారించాలని, అన్ని విభాగాలపైనా సమీక్ష జరిపి గాడిన పెట్టాలని విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - May 21 , 2024 | 11:46 PM