Share News

ముమూర్తం ఖరారు

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:11 AM

వేలాది మంది కార్యకర్తలు. వందలా ది వాహనాలతో ర్యాలీలు, ప్రదర్శనలకు వేళయింది. అంగ, అర్ధ బల నిరూపణ చేసుకునేందుకు సమయం ఆసన్నమైం ది. పార్టీల అగ్రనేతలు, లేదంటే జాతీ య, రాష్ట్రస్థాయి నేతలను తీసుకొచ్చి నామినేషన్లు వేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

ముమూర్తం ఖరారు

18వ తేదీ నుంచి నామినేషన్లకు సిద్ధమవుతోన్న అభ్యర్థులు

శుభ ఘడియలు అయిదు రోజులే అంటున్న పండితులు

ఆ రోజుల్లోనే నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు

నామినేషన్లకు పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యేలా కసరత్తు

కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లకు తేదీలు ఖరారు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): వేలాది మంది కార్యకర్తలు. వందలా ది వాహనాలతో ర్యాలీలు, ప్రదర్శనలకు వేళయింది. అంగ, అర్ధ బల నిరూపణ చేసుకునేందుకు సమయం ఆసన్నమైం ది. పార్టీల అగ్రనేతలు, లేదంటే జాతీ య, రాష్ట్రస్థాయి నేతలను తీసుకొచ్చి నామినేషన్లు వేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ స్థానాలకు ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, నామినేషన్ల తేదీ దగ్గరపడుతుండడంతో అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. నామినేషన్ల ఘట్టానికి మంచి మహూర్తం కోసం వేదపండితులను ఆశ్రయిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంటే, అదే రోజు నుంచి నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. ప్రఽధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 25వరకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండడంతో శుభముహూర్తాలు, పేరుబలాలు చూసుకొని నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వేదపండితులను ఆశ్రయిస్తూ అనువైన తేదీలను తెలుసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నేతలు నామినేషన్‌ రోజే తమ సత్తా చాటేలా భారీ ర్యాలీలు, కీలకనేతల ఆధ్వర్యంలో బహిరంగసభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఘట్టానికి తెరలేవనుండడంతో లోకసభ సమరం వేడెక్కనుంది.

18 నుంచి నామినేషన్ల దాఖలు

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 18 నుంచి 25వరకు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఎనిమిది రోజుల్లో తమ పేరు బలం, పార్టీ బలం, జన్మనక్షత్రాల ప్రకారం ఏరోజు నామినేషన్‌ వేస్తే సత్ఫలితాలుంటాయని కోరుతూ అభ్యర్థులు వేదపండితులను ఆశ్రయిస్తున్నారు. పండితుల సూచనల ప్రకారం, మరోవైపు పార్టీ అధిష్ఠానాల నుంచి వస్తోన్న ఆదేశాల మేరకు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. వేదపండితులు పేర్కొంటున్న ప్రకారం 19, 23, 25వ తేదీలు తిథి, నక్షత్రాల ప్రకారం శుభగడియలు కావని, ఆ రోజుల్లో నామినేషన్లు వేయడం సబబు కాదని చెబుతుండడంతో ఆ రోజుల్లో నామినేషన్లుండే అవకాశం లేదు. 18, 20, 21, 22, 24 తేదీల్లో శుభఘడియలుండడంతో ఈ తేదీల్లో అభ్యర్థుల జాతకాల ప్రకారం అత్యంత శుభదినం ఉన్నరోజు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

నామినేషన్లకు అభ్యర్థులు సిద్ధం

కాంగ్రెస్‌ భువనగిరి అభ్యర్థి చామలకిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 21న, సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ 19న, నల్లగొండ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి 24న నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. వీరి నామినేషన్ల కార్యక్రమాలకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు పార్టీ జాతీయనేతలు హాజరవుతారని చెబుతున్నారు. వీలైతే నామినేషన్ల దాఖలు రోజు పార్లమెంట్‌ నియోజకవర్గకేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అయితే మే మొదటివారం లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంఽధీ పర్యటన ఖరారైతే బహిరంగసభల తేదీలను మార్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నల్లగొండనుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శానంపూడి సైదిరెడ్డి కూడా 22 లేక 24న నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈయన నామినేషన్‌ రోజునే నల్లగొండలో భారీ బహిరంగసభ నిర్వహించి, బీజేపీ దిగ్గజనేత, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలైని తీసుకురావాలని యోచిస్తున్నారు. భువనగిరి లోక్‌సభ అభ్యర్థి డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ నామినేషన్‌కు సైతం కీలక జాతీయనేతను ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామమల్లేశ్‌ నామినేషన్ల కార్యక్రమాలకు కేటీఆర్‌ రానున్నట్లు చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ సైతం జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా ప్రణాళిక ఖరారు చేస్తున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:15 AM