త్యాగానికి ప్రతీక మొహర్రం
ABN , Publish Date - Jul 16 , 2024 | 11:47 PM
కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలలోని ఓ వర్గం ఏటా మొహర్రం వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
నేడు మాతం ప్రదర్శనకు ఏర్పాట్లు
భువనగిరి టౌన్, జూలై 16: కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలలోని ఓ వర్గం ఏటా మొహర్రం వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకా రం మొదటి మాసాన్ని మొహర్రంగా పిలవడంతోపా టు పది రోజుల పాటు పవిత్ర దినాలుగా భావిస్తారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకల్లో హిందువులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈనెల 10వ తేదీన మొదలైన మొహర్రం వేడుక లు తొమ్మిది రోజులు పల్లె, పట్టణాల్లో పీర్లను ఉరేగించి పీర్ల కొట్టానికి చేర్చారు. రాత్రి వేళ పీర్ల కొట్టం ఎదుట అగ్నిగుండం ఏర్పాటు చేసి అలావ్ ఆడారు. పదో రోజున బుధవారం ఆషురా నిర్వహిస్తారు. ఈ రోజున బెల్లం పానకం తయారు చేసి పంపిణీ చేస్తారు. పీర్లను తిరిగి ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. షియా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం భువనగిరిలో అమరులను స్మరిస్తూ పదునైన ఆయుధాలతో ఒంటిపై బాదుకుంటూ రక్తం చిందిస్తూ మాతం ప్రదర్శన నిర్వహించనున్నారు. కులమతాలకతీతంగా పలువురు దట్టీలు సమర్పించి మొక్కు చెల్లించుకునేందుకు సిద్దమవుతున్నారు. మాతం ప్రదర్శన, మొహర్రం వేడుకల సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.