Share News

తుంగతుర్తికి దక్కిన ఎంపీ టికెట్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:37 PM

భువనగిరి ఎంపీ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం హేమాహేమీలు పోటీపడగా, చివరికి తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన నేతకు దక్కింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్‌ ఖరారు చేసింది.

తుంగతుర్తికి దక్కిన ఎంపీ టికెట్‌

యాదాద్రి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి)/ మోత్కూరు: భువనగిరి ఎంపీ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం హేమాహేమీలు పోటీపడగా, చివరికి తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన నేతకు దక్కింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తుంగతుర్తి నియోజకవర్గం, శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్‌ ఖరారు చేసింది. దీంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు బాణాసంచాకాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిని ప్రకటించినప్పుడు భువనగిరి అభ్యర్థిని ప్రకటించకుండా అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది. ఈ టికెట్‌ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడి కుమారుడు కోమటిరెడ్డి సూర్యపవన్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి గట్టి ప్రయత్నం చేశారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే డిమాండ్‌ కూడా తెరపైకి రాగా, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కాంగ్రె్‌సలోకి వస్తారని, ఆయనకే టికెట్‌ ఇస్తారనే ప్రచారం సాగింది. చివరికి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల అయోమయానికి తెరదించుతూ అధిష్ఠానం చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చింది.

పేరు: చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

పుట్టిన తేదీ: 24-10-1974

తల్లిదండ్రులు: అరుణ, వాసుదేవరెడ్డి

స్వగ్రామం: శాలిగౌరారం

విద్యార్హత: హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా

పార్టీ పదవులు: 2005-06 వరకు ఏపీ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, 2007-08 వరకు రాహుల్‌గాంధీ టీం డిస్కవరీ ఇండియా టాస్క్‌ఫోర్స్‌ మెంబర్‌, ఆమ్‌ ఆద్మీకా సిపాహీ నేషనల్‌ కోఆర్డినేటర్‌, 2008-09 వరకు జాతీయ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి, 2009-11 వరకు జాతీయ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, 2017- 21 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధి, 2021 నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు

Updated Date - Mar 28 , 2024 | 11:37 PM