ప్రైవేట్ భవనాల్లో ఇంకెన్నాళ్లు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:10 AM
ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఆయా కార్యాలయాలకు సొం త భవనాలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా ప్రభుత్వానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లతో సుమారు రూ.300 నుంచి రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

కోట్ల రెవెన్యూ ఉన్నా సొంత భవనాలు కరువు
ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ, మోత్కూరు, నకిరేకల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకే భవనాలు
సౌకర్యాలు లేక దెబ్బతింటున్న డాక్యుమెంట్లు
ఇది 12 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల దుస్థితి
నల్లగొండ: ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఆయా కార్యాలయాలకు సొం త భవనాలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా ప్రభుత్వానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లతో సుమారు రూ.300 నుంచి రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయినా సొంత భవనాలు కరువయ్యాయి. అధికారులు పలుమార్లు నివేదికలు సమర్పించినా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన రాష్ట్ర శాఖ అధికారులు భవన నిర్మాణాల ఫైల్‌ను పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో సొంత భవనాలు కలగానే మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేది అర్థం కాని పరిస్థితి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని తెలుసుకొని, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను ఆరా తీశారు. వెంటనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సబ్‌రిజిస్ట్రా్ కార్యాలయాలను తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయనేది అధికారులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి రాష్ట్రంలో మూడు కార్యాలయాలకే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కా ర్యాలయాలకు సొంత భవనాలను నిర్మించేలా నిధులు కేటాయించారు. మొత్తం 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా కోదాడ, మోత్కూరు, నకిరేకల్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను రూ.64లక్షలతో సొంత భవనా లు నిర్మించారు. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభు త్వం పట్టించుకోలేదు. అప్పటి హోంమంత్రి, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మహమూద్ అలీకి కూడా నివేదికలు సమర్పించినప్పటికీ నిధులు మంజూరుకాలేదు. ఆయన కొన్నినెలల క్రితం గత ప్రభుత్వ హయాంలో నల్లగొండలో పర్యటన సందర్భంగా కూడా భవన నిర్మాణాల గురించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి కార్యాలయాలు తరలించాలని చెప్పడమే తప్ప సొంత భవనాల నిర్మాణాల కోసం నిర్ణయం తీసుకోలేదు. నల్లగొండ విషయానికి వస్తే కలెక్టరేట్‌లో కొన్ని కార్యాలయాలు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఆ భవనాల్లోకి కేవలం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్నే తరలించేందుకు వీలుంటుంది. జిల్లా రిజిస్ట్రా్ కార్యాలయం కేవలం అడ్మినిస్ట్రేషన్‌కే పరిమితమైతే తరలించవచ్చు. అయితే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రజలతో అనుబంధంగా ఉంటున్నందున తరలించేందుకు వీలుపడటం లేదు.
ప్రైవేట్ కార్యాలయాల్లో సౌకర్యాలు కొరత
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, చండూరు, చౌటుప్పల్, దేవరకొండ, హుజూర్‌నగర్, మి ర్యాలగూడ, నల్లగొండ, నిడమనూరు, రామన్నపేట, సూర్యాపేట, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. దీంతో అరకొర సౌకర్యాలు నడుమనే అధికారులు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ఆస్తులు క్రయ విక్రయదారులకు సౌ కర్యాలు ఉండటంలేదు. వాష్ రూమ్ సౌకర్యాలతో పాటు మంచినీటి సౌకర్యం లేకపోవడం ఫర్నిచర్ లేకపోవడం కూర్చోవడానికి కనీసం కుర్చీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ సంబంధించిన అధికారులు ఉన్న పరిస్థితులతోనే నెట్టుకుపోతున్నారు. ఇకపోతే కార్యాలయాల్లో పాత డాక్యుమెంట్లకు రక్షణ కరువైంది. గత 70 ఏళ్లకు పైగా పైబడి ఉన్న ఉర్దూ తెలుగు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. గతంలో పాత డాక్యుమెంట్లను ఆన్‌లైన్ చేయిస్తామని అప్పటి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. పాత డాక్యుమెంట్లు చినిగిపోయే పరిస్థితి ఉంది. ఎంతో విలువైన ఉర్దూ డాక్యుమెంట్లు ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఉర్దూ డాక్యుమెంట్లను తెలుగులోకి అనువదించి వాటిని ఆన్‌లైన్‌లో భద్రపరచాలని గతంలో నిర్ణయించినా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వానికి రెవెన్యూ పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదనేది విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వానికి నివేదిక పంపాం : కోమటిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, నల్లగొండ.
నల్లగొండలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవ నం సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభు త్వం కూడా త్వరలో సొంత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. సొంత భవనం ఏర్పాటైతే ఆస్తుల క్రయవిక్రయదారులకు సౌకర్యాలు మెరుగుపడతాయి. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన వెంటనే నల్లగొండలో సొంతభవనాన్ని నిర్మిస్తాం.
ప్రభుత్వం దృష్టిలో ఉంది : ఎస్.ప్రకాష్, ఉమ్మడి నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్
గత ప్రభుత్వం హయాంలోనే జిల్లా అధికారులు సొంత భవనాలకు సంబంధించి నివేదికలు పంపించారు. ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే నిధులు మంజూరు చేసే అవకాశం ఉం ది. గతంలో కలెక్టరేట్‌లో ఖాళీగా ఉన్న కార్యాలయంలోకి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించాలని సూచించారు.