Share News

నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌

ABN , Publish Date - May 27 , 2024 | 12:35 AM

శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం జరగనుంది. పోలింగ్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌

సర్వం సిద్ధంచేసిన యంత్రాంగం

ఉదయం 8గంటల నుంచి పోలింగ్‌

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది, సామగ్రి

భారీ పోలీస్‌ బందోబస్తు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ: శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం జరగనుంది. పోలింగ్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయమే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది, పోలీసులు వారికి కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు చేరారు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 12 జిల్లాలో 605 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,63,839మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 52మంది అభ్యర్థులు తలపడుతుండగా, కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకే్‌షరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పాలకూరి అశోక్‌కుమార్‌ తదితరులు పోటీలో నిలిచారు. నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి హోరాహోరీ ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఆదివారం పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు. ఆదివారం రాత్రి వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోలింగ్‌ విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు ఇతర సామగ్రితో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, అదనపు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, మరో ఉద్యోగితో పాటు ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద భద్రతకు పోలీసులను కేటాయించారు. వీరంతా ఆదివారం సాయంత్రానికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే ఉండి ఉదయం 6.30నిమిషాలకు పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 7గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఎన్నికలో ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాల్సి ఉన్నందున అందుకు సంబంధించి ఇప్పటికే ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను ఎన్నికల సంఘం నిర్వహించిం ది. పోలింగ్‌ జరిగే ప్రతీ కేంద్రం వద్ద వెబ్‌కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల తరపున నియమించే ఏజెంట్లు, పోలింగ్‌ సిబ్బంది మినహా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇతరులు గుమికూడితే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. అదేవిధంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉంటున్నందున పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవ్వరూ ఉండకూడదని సూచించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్‌ అనంతరం సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులను సీజ్‌ చేసి నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టిదుప్పలపల్లి వద్ద ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తారు. మొత్తం 12 జిల్లాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు మంగళవారం ఉదయంలోపు ఇక్కడికి చేరనున్నాయి.

జిల్లాలో 34,080మంది ఓటర్లు, 37పోలింగ్‌ కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జిల్లాలో 34,080మంది పట్టభద్ర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భువనగిరి డివిజన్‌కు సంబంధించి రాయిగిరిలోని విద్యాజ్యోతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, చౌటుప్పల్‌ డివిజన్‌కు సంబంధించి సాన్‌జాక్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రి, సిబ్బందిని ఆదివారం తరలించారు. జిల్లాలో మొత్తం 37పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. భువనగిరి డివిజన్‌లో 22, చౌటుప్పల్‌ డివిజన్‌లో 15 పోలిం గ్‌ కేంద్రాల్లో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం 34,080మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. భువనగిరి డివిజన్‌లో పురుషులు 12,421మంది, మహిళ లు 7,784మంది, చౌటుప్పల్‌ డివిజన్‌లో 8,471మంది పురుషులు, 5,458మంది మహిళలు ఉన్నారు.

సూర్యాపేట జిల్లాలో 51,497మంది ఓటర్లు

సూర్యాపేట(కలెక్టరేట్‌): వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జిల్లాలో 51,497మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో 16 సెక్టార్‌ అధికారుల ఆధ్వర్యంలో 71 టేబుల్స్‌ ఏర్పాటుచేసి బ్యాలెట్‌ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని సిబ్బందికి ఆదివారం అందజేశారు. 71 కేంద్రాల్లో నిరంతరం వెబ్‌కాస్టింగ్‌, 19 సమస్యాత్మక కేంద్రాల్లో బయట కూడా వెబ్‌ కాస్టింగ్‌కు కెమెరాలు ఏర్పాటుచేశారు. సూర్యాపేట డివిజన్‌లో మొత్తం 31 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా, మహిళా ఓటర్లు 17,081, పురుష ఓటర్లు 9,071మంది, మొత్తం 26,152 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కోదాడ డివిజన్‌ పరిధిలోని 22 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా, మహిళా ఓటర్లు 8,120, పురుష ఓటర్లు 4,065 మొత్తం 12,185, హుజూర్‌నగర్‌ డివిజన్‌ని 18 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మహిళా ఓటర్లు 8,975, పురుష ఓటర్లు 4,185 మొత్తం 13,160మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 51,497 మంది పట్టభద్ర ఓటర్లు ఈ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రం ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 ప్రాంతాల్లో 71 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 16 మంది తహసీల్దార్లను సెక్టార్‌ అధికారులుగా నియమించారు. అలాగే 340 మంది సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించారు. పోలీస్‌ బందోబస్తు నడుమ రూట్ల వారీగా వాహనాల్లో ఎన్నికల సామగ్రి, సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని మూడు డివిజన్లలో 22 పోలింగ్‌ కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉన్న చోట జంబో పోలింగ్‌ బాక్సును, మిగతా చోట పెద్ద పోలింగ్‌ బాక్సులను వినియోగిస్తున్నారు. కాగా, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్లు సీహెచ్‌.ప్రియాంక, బీఎ్‌స.లత, అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు పరిశీలించారు.

ఓటు ఇలా వేయాలి..

ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్‌ పేపర్‌లో ఎన్నికల సంఘం సరఫరా చేసిన వాయిలెట్‌ స్కెచ్‌ పెన్‌ ద్వారా మాత్రమే ఓటు వేయాలి.

ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3, 4 ప్రాధాన్య క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటేయాలి.

మొదటి ప్రాధాన్య ఓటుగా 1వ అంకెను అభ్యర్థికి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయాలి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, బ్యాలెట్‌ పేపర్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1, 2, 3 వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి.

ఓటర్లు ఓటు వేసేటప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురుగా భారతీయ సంఖ్యలైన 1, 2, 3 లేదా రోమన్‌ సంఖ్యలు ఐ, ఐఐ, ఐఐఐ, ఐగ తరహాలో మార్క్‌ చేయవచ్చు.

నోటాకు ఓటు వేయాల్సి వస్తే బ్యాలెట్‌ పేపర్‌పై 1, 2 ప్రాధాన్యాల తరువాత 3వ ప్రాధాన్య ఓటును నోటాకి ఎదురుగా మార్క్‌ చేయవచ్చు.

ఇలా చేయకూడదు...

బ్యాలెట్‌ పేపర్‌లో ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు 1వ సంఖ్య ఇవ్వకూడదు.

బ్యాలెట్‌ పేపర్‌పై సంతకం చేయడం, ఇనిషియల్‌ వేయడం, పేరు, అక్షరాలు వంటివి రాయకూడదు.

ఓటరు బ్యాలెట్‌ పేపర్‌పై 1, 2, 3, 4, 5 సంఖ్యల రూప ంలో మాత్రమే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. పదాల రూపం లో, వన్‌, టూ, త్రీ అని రాయకూడదు.

బ్యాలెట్‌ పేపర్‌పై రైట్‌ మార్క్‌ టిక్‌ చేయడం లేదా ఇం టూ మార్కు పెట్టడం వంటివి సైతం చేయకూడదు.

ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యాలు ఇవ్వకూడదు. ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1, 2 సంఖ్యలు వేయకూడదు.

బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో గాక ఇతర ప్రాంతాల్లో 1, 2, 3 అంకెలు వేయకూడదు.

అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు వచ్చేలా నంబర్‌ మార్కు చేయకూడదు.

పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లు ఇలా..

జిల్లా పురుష మహిళ థర్డ్‌ మొత్తం పోలింగ్‌

ఓటర్లు ఓటర్లు జెండర్‌ స్టేషన్లు

నల్లగొండ 51,560 29,311 0 80,871 97

సూర్యాపేట 34,176 17,321 0 51,497 71

యాదాద్రి 20,838 13,242 0 34,080 37

సిద్ధిపేట 3,122 1557 0 4679 5

జనగామ 14,915 8,503 1 23,419 27

హన్మకొండ 25,739 17,990 0 43,729 67

వరంగల్‌ 27,038 16,774 0 43,812 59

మహబూబాబాద్‌ 22,948 11,985 0 34,933 36

ములుగు 6587 3712 0 10,299 17

జె.భూపాలపల్లి 8,000 4535 0 12,535 16

ఖమ్మం 50,676 33,199 4 83,879 5

బి.కొత్తగూడెం 22,590 17,516 0 40,106 55

మొత్తం 2,88,189 1,75,645 5 4,63,839 605

విధులను సమర్ధంగా నిర్వహించాలి : కలెక్టర్‌

భువనగిరి రూరల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ విధులను సమర్ధంగా నిర్వహించాలని అధికారులు, ఎన్నికల సిబ్బందికి కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే సూచించారు. ఆదివారం రాయిగిరిలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని భువనగిరి జోన్‌ డీసీపీ రాజేశ్‌చంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్‌ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. వారి వెంట భువనగిరి ఆర్డీవో పి.అమరేందర్‌, డీఏవో ఎం.ఉపేందర్‌రెడ్డి, అదనపు డీఆర్డీవో సురే్‌షకుమార్‌, డీటీలు భగత్‌, కె.కళ్యాణ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 27 , 2024 | 12:35 AM