Share News

మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:58 PM

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌) 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం
నల్లగొండలో కొనసాగుతున్న కౌంటింగ్‌

మొదటి ప్రాధాన్యంలో ముందంజ

ద్వితీయ స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే్‌షరెడ్డి

మొదటి ప్రాధాన్యంలో ఎవరికీ రాని కోటా ఓటు

ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభం

అశోక్‌కుమార్‌, ప్రేమేందర్‌రెడ్డి ఓట్లే కీలకం

నేటి రాత్రికి తుదిఫలితం వచ్చే అవకాశం

నల్లగొండ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): శాసనమండలి నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌) 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రాకే్‌షరెడ్డి 1,04,248 ఓట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. రాకేశ్‌రెడ్డి కంటే మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యత లభించింది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి 43,313 మొదటి ప్రాధాన్య ఓట్లతో మూడోస్థానంలో ఉండగా, నల్లగొండకు చెందిన స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌ 29,697మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించి నాలుగోస్థానంలోకి వచ్చారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో గతానికి భిన్నంగా అత్యధికంగా 25,824 చెల్లనిఓట్లు ఉన్నాయి. మొత్తం చెల్లిన ఓట్ల ఆధారంగా 1,55,095 ఓట్లను కోటా ఓటుగా రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన ప్రకటించారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఆధిక్యత సాధించిన కాంగ్రెస్‌ అబ్యర్ధి తీన్మార్‌ మల్లన్న కోటా ఓటు సాధించాలంటే ఆయనకి ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో 32,282 ఓట్లు రావాల్సి ఉంది. అదే రాకే్‌షరెడ్డి గెలవాలంటే 50,847 ఓట్లు రావాల్సి ఉంది. ఉప ఎన్నిక కౌంటింగ్‌ శుక్రవారం సాయంత్రానికి ముగిసే అవకాశం కనిపిస్తోంది.

నేటి రాత్రికి ఫలితం వచ్చే అవకాశం

ఉప ఎన్నికలో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికలో నలుగురికి మినహా మిగిలిన అభ్యర్థులందరికీ అతి తక్కువ ఓట్లే వచ్చాయి. కొందరికి డబుల్‌ డిజిట్‌ ఓట్లే రావడం గమనార్హం. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ మెదలుపెట్టి వారి ద్వితీయ ప్రాధాన్య ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు కలుపుతూ వస్తారు. ఇలా ప్రధాన అభ్యర్థులు మినహా మిగిలిన 48 మంది అభ్యర్థుల ఓట్లు కలిపినా కోటా ఓటు వచ్చే అవకాశం ఉండదు. అయితే ఈ 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ శుక్రవారం ఉదయం వరకు కొనసాగే పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మూడో రౌండ్‌ ఓట్ల కౌంటింగ్‌పై తమకు అనుమానాలున్నాయని, మళ్లీ లెక్కించాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే్‌షరెడ్డి డిమాండ్‌ చేయడంతో వాతావరణం వేడెక్కింది. ఎన్నికల సంఘం ఆయన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అనే అంశం తేలాల్సి ఉంది.

అభ్యర్థులను చెమటలు పట్టించిన చెల్లని ఓట్లు

మొదటి ప్రాధాన్య ఓట్లలో చెల్లని ఓట్లు అత్యధికంగా నమోదవ డం ప్రధాన పార్టీల అభ్యర్థులను చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నడూలేని రీతిలో పోలైన ఓట్లలో దాదాపు 8.50శాతం ఓట్లు చెల్లకుండా పోయాయి. మూడో రౌండ్‌ వరకే 23,784 ఓట్లు చెల్లకుండా పోగా, ప్రధాన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగో రౌం డ్‌ ముగిసే సరికి 25,824ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎంతో అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్ల ఓట్లే ఈ స్థాయిలో చెల్లకుండా పోవడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాలెట్‌ పేపర్లపై అడ్డగోలు రాతలు, నినాదాలు, సంతకాలు, ఫోన్‌ నెంబర్లు, ప్రాధాన్య ఓటు ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరి తదితర కారణాలతో ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లని ఓట్లు అధికంగా ఉండడం వల్లే మొదటి ప్రా ధాన్య ఓట్లతో కోటా ఎవ్వరికీ రాలేదని, అనివార్యంగా ద్వితీయ ప్రాధాన్యానికి వెళ్లాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విజేతను తేల్చేది ఆ ఇద్దరి ద్వితీయ ప్రాధాన్య ఓట్లే

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నల్లగొండకు చెందిన పాలకూరి అశోక్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేట్‌ అయ్యాక, వారి బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్య ఓట్లే విజేతను తేల్చే అవకాశముందని భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అశోక్‌కుమార్‌, 48 మంది స్వతంత్ర అభ్యర్థుల తర్వాత ఎలిమినేట్‌ అవుతారు. ఆయన ఓట్లలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎవరికి ఏ స్థాయిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వస్తాయనే అంశం కీలకం కానుంది. అయితే కౌంటింగ్‌ సరళిని పరిశీలిస్తున్న రాజకీయనేతలు, పరిశీలకులు అశోక్‌కుమార్‌కు చెందిన బ్యాలెట్ల ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో కోటా ఓటు ఎవరికీ రాదని, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ తప్పదని భావిస్తున్నారు. ఆయన బ్యాలెట్ల ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కోటా ఓటు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అప్పటికీ కోటా ఓటు రాకపోతే రెండో స్థానంలో ఉండే అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాఽధాన్య ఓట్లనూ లెక్కిస్తారు. అప్పటికీ కోటా ఓటు రాకపోతే తృతీయ ప్రాధాన్య ఓట్ల ను లెక్కించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ద్వితీయ ప్రాఽధాన్య ఓట్ల తో ఫలితం తేలే అవకాశం ఉంది.

అభ్యర్థుల సంఖ్య 52

మొత్తం ఓట్లు 4,63,839

పోలైన ఓట్లు 3,36,013

చెల్లిన ఓట్లు 3,10,189

కోటా ఓట్లు 1,55,095

అభ్యర్థి (పార్టీ) మొదటి రెండో మూడో నాలుగో మొత్తం

రౌండ్‌ రౌండ్‌ రౌండ్‌ రౌండ్‌

తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌) 36,210 34,574 35450 16,579 1,22,813

ఏనుగు రాకేష్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) 28,540 27,574 31242 16,892 1,04,248

గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) 11,395 12,843 10278 8,797 43,313

పాలకూరి అశోక్‌ (స్వతంత్ర) 9,109 11,214 7170 2,204 29,697

చెల్లని ఓట్లు 7,728 7,398 8,658 2,040 25,824

Updated Date - Jun 06 , 2024 | 11:58 PM