Share News

జోరుగా క్యాంపు రాజకీయాలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:43 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లోనూ పాగా వేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఎంపీ ఎన్నికల్లో గంపగుత్తగా సీట్లు సాధించాలంటే మండల, గ్రామ స్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు కీలక పదవుల్లో ఉండాలనే యోచనలో కాంగ్రెస్‌ దిగ్గజాలు ఉన్నారు.

జోరుగా క్యాంపు రాజకీయాలు

నల్లగొండలో 8న అవిశ్వాసం, నేడు క్యాంపునకు కౌన్సిలర్లు

మునిసిపాలిటీలపై కాంగ్రెస్‌ కన్ను

కలిసి వచ్చిన అధికారం, బీఆర్‌ఎ్‌సలో కుమ్ములాటలు

ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లోనూ పాగా వేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఎంపీ ఎన్నికల్లో గంపగుత్తగా సీట్లు సాధించాలంటే మండల, గ్రామ స్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు కీలక పదవుల్లో ఉండాలనే యోచనలో కాంగ్రెస్‌ దిగ్గజాలు ఉన్నారు. ఈ మేరకు అవకాశం ఉన్న మునిసిపాలిటీలు, మండల పరిషత్తుల్లో అవిశ్వాస తీర్మానాలకు తెర లేపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మునిసిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 19 మునిసిపాలిటీలు ఉండగా, అందులో సగానికి పైగా మునిసిపాలిటీల్లో ప్రస్తుత మునిసిపల్‌ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్‌ సమాయత్తం అవుతోంది. కొంత మంది మునిసిపల్‌ చైర్మన్లు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరగా, మరికొంత మంది మునిసిపల్‌ చైర్మన్లు తీర్మానాలు ప్రవేశపెట్టకముందే కాంగ్రెస్‌తో జత కట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

బీఆర్‌ఎ్‌సకు తిరుగులేదని భావించిన చోట అంతర్గత కుమ్ములాటలతో సొంత పార్టీకి చెందిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపైనా అవిశ్వాసానికి కౌన్సిలర్లు రంగం సిద్ధంచేశారు. అవసరమైతే కాంగ్రెస్‌ కౌన్సిలర్లకు చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు సైతం వారు వెనకాడటం లేదు. విప్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలు, చైర్మన్లు వారి చేయి దాటిన కౌన్సిలర్లను బెదిరించే ప్రయత్నం చేస్తుండగా, ఈ విషయంలో కలెక్టర్ల నివేదికే ఫైనల్‌. బీఆర్‌ఎస్‌ నేతలు పంపిన విప్‌ నోటీసులో పలు దోషాలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలను కాదని, ఏ కలెక్టర్‌ నిర్ణయం తీసుకోరని కాంగ్రెస్‌ పెద్దలు వలస వచ్చిన కౌన్సిలర్లకు భరోసా ఇస్తున్నారు. అవిశ్వాసాలను అపేందుకు ప్రస్తుత చైర్మన్లు హైకోర్టు, విప్‌ అంటూ చివరి ప్రయత్నాలు చేస్తుండగా, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వ ప్లీడర్లు, కలెక్టర్లు, మునిసిపల్‌ సీనియర్‌ అధికారులను కాంగ్రెస్‌ నేతలు సంప్రదించి అవిశ్వాస ప్రతిపాదన, నోటీసులు అన్ని పకడ్బందీగా చేయిస్తున్నారు. పూర్తి బలం ఉన్నా, ముందుచూపుతో కొన్ని చోట్ల అవిశ్వాసానికి ముందు క్యాంపులకు కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 8న నల్లగొండ మునిసిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఉండగా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన కౌన్సిలర్లను శనివారం హైదరాబాద్‌కు క్యాంపునకు తరలించనున్నట్టు సమాచారం.

ఫ నల్లగొండ మునిపిల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి సన్నిహితుడు. భూపాల్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో కోమటిరెడ్డిపై ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్‌ నల్లగొండ మునిసిపాలిటీని కైవసం చేసుకునే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల ముందే మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌తో పాటు మరో కొంత మంది కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన మునిసిపల్‌ చైర్మన్‌ను తప్పించేందుకు కాంగ్రెస్‌ వేగంగా పావులు కదుపుతోంది. నల్లగొండలో మొత్తం 48 వార్డులు ఉండగా, తొలుత బీఆర్‌ఎ్‌సకు 23, కాంగ్రె్‌సకు 18, ఏఐఎంకు 1, బీజేపీకి 6 కౌన్సిలర్‌ స్థానాలు దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమీకరణలు మారడంతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఎంఐఎం కౌన్సిలర్లు పలువురు కాంగ్రె్‌సలో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీకి 34మంది కౌన్సిలర్ల బలం ఉంది. బీఆర్‌ఎస్‌ బలం 8 స్థానాలకు పడిపోయింది. కౌన్సిలర్‌ పిల్లి రామరాజును బీఆర్‌ఎస్‌ బహిష్కరించింది. బీజేపీలో ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు.

ఫ నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో హాలియా, నందికొండ మునిసిపాలిటీలు ఉండగా వీటిని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. హాలియాలో 12 వార్డులు ఉండగా, బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కౌన్సిలర్లు యత్నించగా, స్థానికంగా ఉన్న వైశ్య సామాజికవర్గం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని అవిశ్వాస ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలన్న సీనియర్‌నేత జానారెడ్డి సూచనతో ఇక్కడ బ్రేక్‌ పడింది. బీఆర్‌ఎస్‌ చైర్మన్‌కు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు మధ్య వైరం ఉండటం, తాజాగా చైర్మన్‌కు కలిసివచ్చింది.

ఫ నందికొండ మునిసిపాలిటీలో బీఆర్‌ఎ్‌సలోని అసమ్మతి సభ్యులతో కలిసి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 2వ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అనారోగ్యంతో మృతిచెందగా 11 మంది సభ్యులు ఉండగా, మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రె్‌సకు 4, బీఆర్‌ఎ్‌సకు ఏడుగురు ఉన్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఏకమయ్యారు.

ఫ మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మునిసిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక్కడ 10 వార్డులకు కాంగ్రెస్‌ ఆరు, బీఆర్‌ఎస్‌ మూడు, బీజేపీ ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌ నుంచి చైర్మన్‌ అయిన చంద్రకళ ఆ తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరారు. తిరిగి అవిశ్వాసం ద్వారా ఈ మునిసిపాలిటీని కాంగ్రెస్‌ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఫ సూర్యాపేట జిల్లాలోని కోదాడలో చైర్మన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మొత్తం 35 వార్డులు ఉండగా, బీఆర్‌ఎస్‌ 25, కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాలు కలిసి 10 స్థానాల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికల ముందునుంచి ఇప్పటి వరకు 15 మంది వరకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రె్‌సలో చేరారు. ప్రస్తుతం అధికార పార్టీకి 25 మంది కౌన్సిలర్లు ఉండడంతో చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈనెల 20న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగనుంది.

ఫ నేరేడుచర్లలో మొత్తం 15వార్డులకు కాంగ్రెస్‌ ఏడు, బీఆర్‌ఎస్‌ ఏడు, బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నాయి. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటీ పడి ఐదుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులను వినియోగించుకున్నారు. తాజాగా, బీఆర్‌ఎస్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీలతారెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. మారిన సమీకరణలతో బీఆర్‌ఎస్‌ సభ్యులు కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ బలం 12కు చేరింది.

ఫహుజూర్‌నగర్‌లోనూ చైర్మన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం కాగా, ఆమె కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వైస్‌చైర్మన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. 28 వార్డులకు ప్రస్తుతం కాంగ్రెస్‌ బలం 18కి చేరింది.

ఫ దేవరకొండ, చిట్యాల, హుజూర్‌నగర్‌, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌లో చైర్మన్లుగా ఎన్నికైన వారు కాంగ్రె్‌సలో చేరడంతో ప్రస్తుతం వారిపై అవిశ్వాసం లేనట్టే. నకిరేకల్‌ మునిసిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది.

భువనగిరిలో 23న అవిశ్వాస తీర్మాన సమావేశం

యాదాద్రి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): భువనగిరి మునిసిపాలిటీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రస్తుత మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్యపై సొంతపార్టీకి చెందిన కౌన్సిలర్లతోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత నెల 30న కలెక్టర్‌కు 31మంది కౌన్సిలర్లు వారి సంతకాలతో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. ఈ మేరకు 23న ఉదయం 11గంటలకు అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ నోటీసులు జారీచేశారు. మునిసిపాలిటీలో మొత్తం 35మంది కౌన్సిలర్లు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉంటారు. అవిశ్వాస ప్రత్యేక సమావేశానికి 24మంది కౌన్సిలర్లు హాజరైతే కోరం సరిపోతుంది. సమావేశాన్ని, ఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల అధికారిగా ఆర్డీవో లేదా జిల్లాస్థాయి అధికారిని కలెక్టర్‌ నియమించే అవకాశం ఉంది. కోరం లేకుంటే సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానాన్ని ఫిబ్రవరి 2023న అప్పటి కలెక్టర్‌కు కౌన్సిలర్లు విన్నవించారు. పలు రాజకీయ పరిణామాల దృష్ట్యా నోటీసులు జారీ కాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి చెందడటంతో మరోసారి మునిసిపాలిటీలో అవిశ్వాసం తెరపైకి వచ్చింది. గతంలో కేవలం 19మంది కౌన్సిలర్లు మాత్రమే సంతకాలు చేసి అవిశ్వాసం కోరగా, తాజాగా 31మంది కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కలెక్టర్‌కు విన్నవించడం గమనార్హం. మరోవైపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు జోరుగా కౌన్సిలర్లతో చర్చలు ప్రారంభించారు.

Updated Date - Jan 05 , 2024 | 11:43 PM