Share News

రైతుల పేరుతో చెరువు లూటీ

ABN , Publish Date - May 24 , 2024 | 11:56 PM

సూర్యాపేట జిల్లా పెనపహాడ్‌ మండలంలో రైతుల పేరుతో చెరువుల మట్టిని లూటీ చేస్తున్నారు. మట్టి తవ్వకాలతో చెరువును ధ్వంసం చేయడమే కాక ఆ మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

రైతుల పేరుతో చెరువు లూటీ
పెనపహాడ్‌ మండలం లింగాల గ్రామ చెరువులో ఎక్స్‌కవేటర్లతో తోడుతున్న మట్టి

పెనపహాడ్‌, మే 24: సూర్యాపేట జిల్లా పెనపహాడ్‌ మండలంలో రైతుల పేరుతో చెరువుల మట్టిని లూటీ చేస్తున్నారు. మట్టి తవ్వకాలతో చెరువును ధ్వంసం చేయడమే కాక ఆ మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా మండలంలో పరిపాటిగా మారింది. మండలంలో 64చెరువులు ఉన్నాయి. పెనపహాడ్‌, లింగాల, మహ్మదపురం గ్రామాల్లో రైతుల పేరిట ఎక్స్‌కవేటర్లతో సాయంతో చెరువుల మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు గ్రామాల్లో కొంతమంది ఇంటి పరిసరాలను పూడ్చడానికి, ఇటుక బట్టీలకు, ప్రైవేట్‌ వారికి మట్టిని విక్రయించి లబ్ధిపొందుతున్నారు. ఒక గ్రామంలో చెరువు మట్టి తవ్వకాలు చూసి మరో గ్రామానికి చెందిన వారు అలా ఒకరిని ఒకరు పోటీ పడి వివిధ గ్రామాల్లోని చెరువుల నుంచి రాత్రీపగలు ట్రాక్టర్ల, టిప్పర్లతో మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు. ఒక వైపు కలెక్టర్‌ చెరువు మట్టి తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కింది స్థాయి అధికారులు మాత్రం చోద్యం చూస్తూ నోరు మెదపడంలేదు. మట్టి వ్యాపారస్తులతో నాయకులు కుమ్మక్కు కావడంతో ఈ పరిస్థితి యథేచ్ఛగా కొనసాగుతుందని ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. చెరువు మట్టిని తరలించడంతో పాటు లింగాల గ్రామ చెరువు ఆక్రమణకు గురైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మిగతా చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉందని వివిధ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఐబీ డీఈ రమే్‌షను వివరణ కోరగా అక్రమంగా చెరువుల మట్టిని తరలించి వ్యాపారం చేసుకునే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు చెరువు మట్టిని వాడుకోవడానికి అనుమతులు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:56 PM