Share News

రాజకీయ వైషమ్యాలతో గుడికి తాళం

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:21 AM

రాజకీయ వైషమ్యాల నేపథ్యంలో ఆలయానికి తాళం వేసిన ఘటన హుజూర్‌నగర్‌ మండలంలో చోటుచేసుకుంది.

రాజకీయ వైషమ్యాలతో గుడికి తాళం
తాళం వేసి ఉన్న ద్వారం వద్ద ధర్మకర్తలు

హుజూర్‌నగర్‌, ఫిబ్రవరి 28 : రాజకీయ వైషమ్యాల నేపథ్యంలో ఆలయానికి తాళం వేసిన ఘటన హుజూర్‌నగర్‌ మండలంలో చోటుచేసుకుంది. వేపలసింగారం గ్రామంలోనని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్లో కొంతమందితో ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. 2018లో ఆలయ చైర్మనగా కదిరె వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆలయ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఆలయ నిర్మాణ కమిటీకి చెందిన రెక్కల శంభిరెడ్డి, రామ్మోహనరెడ్డిలు వెంకటరెడ్డి, ఎంపీటీసీ గోపీరెడ్డిలపై హైకోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం వీరిద్దరూ ఆలయ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కోర్టు తీర్పునిచ్చింది. అనంతరం జనవరిలో నూతనకమిటీని ఎన్నుకున్నారు. ప్రస్తుత ధర్మకర్తల మండలికి చైర్మనగా సాముల బ్రహ్మారెడ్డి, ధర్మకర్తల సభ్యులుగా రెక్కల శంభిరెడ్డి, పల్లె నాగిరెడ్డి,పెద్ద కోటిరెడ్డి, అంజిరెడ్డి, రామ్మోహనరెడ్డి, కోటిరెడ్డిలు ఉన్నారు. ఇదిలా ఉండగా లెక్కల విషయంలో, రాజకీయపర వైరంతో గత చైర్మన వెంకటరెడ్డి నిర్వహణ ఖర్చులు వెల్లడించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నడుస్తోంది. ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ఉత్సవ కమిటీ పేరుతో 30మందితో వెంకటరెడ్డి కమిటీని ఏర్పాటుచేశారు. దీనికి తోడు మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆలయ ప్రధాన ద్వారానికి తాళాలువేశారు. దీంతో రెండువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంకటరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు కాగా, బ్రహ్మారెడ్డి బీఆర్‌ఎ్‌సలో కొనసాగుతుండటంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. సీఐ చరమందరాజు మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించి ఇరువర్గాలను పిలిపించి, మాట్లాడుతామన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:21 AM