Share News

‘కల్యాణలక్ష్మి’తోపాటు తులం బంగారం

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:14 AM

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగా రం ఇచ్చేందుకు త్వరలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

‘కల్యాణలక్ష్మి’తోపాటు తులం బంగారం

త్వరలో నిర్ణయం

ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ 8మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, జనవరి 17: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగా రం ఇచ్చేందుకు త్వరలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలకు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తిస్తామన్నారు. నియోజకవర్గంతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు నల్లగొండలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. టీఎ్‌సపీఎస్సీని యూపీపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేసి గ్రూప్‌-2 పరీక్ష నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేసి తగిన న్యాయం చేస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ, కనగల్‌, తిప్పర్తి మండలాలకు చెందిన 244మందికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.2,44,28,304ల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగులకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణ ఇచ్చేందుకు సెంచూరియన్‌ యూనివర్సిటీ ప్రతినిధులతో జూమ్‌ మీటింగ్‌ ద్వారా మాట్లాడారు. కమర్షియల్‌ వెహికిల్‌ మెయింటెనెన్స్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, హైడ్రాలిక్‌ మెషిన్‌ ట్రైనింగ్‌, అడ్వాన్స్డ్‌ వుడ్‌ ఇంజినీరింగ్‌, అపెరల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్‌, కేఫ్‌ కాఫీడే వంటి వ్యాపారాల్లో శిక్షణ, ఉపాధి గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పట్టణంలో క్లాక్‌టవర్‌ వద్ద కళాభారతి నిర్మాణం, అందులో కల్పించాల్సిన సౌకర్యాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ కందుకూరి వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవి, ఈఈ రాములు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండను మోడల్‌ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతా

ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిపించిన నల్లగొండ ప్రజలు తనపై పెద్ద బాధ్యత ఉంచారని, నల్లగొండను మోడల్‌ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శివాజీనగర్‌ సెంటర్‌-పానగల్‌రోడ్డు వరకు రూ.90లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్జీ కళాశాల-రామగిరి వరకు రూ.1.30కోట్లతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి చేపట్టాల్సిన మార్పులపై కలెక్టర్‌కు సూచనలు చేశారు. పండ్ల మార్కెట్‌ వ్యాపారుల సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్‌ హరిచందన, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సత్యనారాయణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి మునిసిపల్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

క్రిటికల్‌ కేర్‌ భవనానికి శంకుస్థాపన

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.23.75కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ భవనానికి మంత్రి వెంకట్‌రెడ్డి భూమి పూజచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ డీఈ అజీజ్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజకుమారి, డీఎంహెచ్‌వో కొండల్‌రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌తో సమీక్ష నిర్వహించారు.

Updated Date - Jan 18 , 2024 | 12:14 AM