Share News

ఇంటి తలుపు తట్టి.. బంగారు గొలుసు అపహరణ

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:50 PM

తెల్లవారుజామున ఇంటి తలుపు తట్టి మహిళను నిద్ర లేపి ఆమె మెడలోని 22 గ్రాముల బంగారు ఆభరణాన్ని అపహరించారు.

 ఇంటి తలుపు తట్టి.. బంగారు గొలుసు అపహరణ

భువనగిరి టౌన, జూన 12: తెల్లవారుజామున ఇంటి తలుపు తట్టి మహిళను నిద్ర లేపి ఆమె మెడలోని 22 గ్రాముల బంగారు ఆభరణాన్ని అపహరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం సమీపంలోని కూనోజి భారతమ్మ మూడంతస్తుల ఇంటిలో కింది ఫ్లోర్‌ ముందు భాగాన్ని డాక్యుమెంట్‌ రైటర్‌కు అద్దెకు ఇచ్చి ఆమె వెనుక గదిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. పై రెండు అంతస్తుల్లో ఇద్దరు కుమారులు ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఆమె నిద్రిస్తున్న గది వెలుపల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తలుపులను బాదారు. దీంతో ఆమె ఎవరని ప్రశ్నించడంతో డాక్యుమెంటరీ కావాలని నిందితులు బదులిచ్చారు. ఈ మేరకు ఆమె స్పందిస్తూ 10 గంటల తర్వాతే డాక్యూమెంట్‌ రైటర్స్‌ వస్తారని బదులిచ్చింది. తెల్లవారుజామున నిద్రలేచే అలవాటున్న ఆమె రోజువారీగా తలుపులు తీసిన వెంటనే ముఖానికి మాస్క్‌ ధరించిన దుండగుడు అకస్మాత్తుగా ఆమెపై దాడి చేస్తూ ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తూ దుండగుని మాస్కు, మెడలోని పూసల దండను తెంపింది. అయినప్పటికీ దుండగుడు ఆమె మెడలోని 22 గ్రాముల బంగారు ఆభరణాన్ని అపహరించుకుని పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించింది. కాగా ఆమెను కొన్ని రోజులుగా పరిశీలించిన వారే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:50 PM