Share News

సాగర్‌ను ఎండబెట్టిన కేసీఆర్‌ ఏ మొఖంతో వస్తున్నారు

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:24 AM

కృష్ణాజలాలను ఏపీ రాష్ట్ర సీఎం జగన్మోహనరెడ్డికి అప్పగించి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును ఎండబెట్టిన కేసీఆర్‌ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని నల్లగొండ జిల్లాలో బస్సు యాత్ర చేపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

సాగర్‌ను ఎండబెట్టిన కేసీఆర్‌ ఏ మొఖంతో వస్తున్నారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

జగదీష్‌రెడ్డి విషయాలు చెప్పిన గుత్తాకు ధన్యవాదాలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్‌ 23 : కృష్ణాజలాలను ఏపీ రాష్ట్ర సీఎం జగన్మోహనరెడ్డికి అప్పగించి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును ఎండబెట్టిన కేసీఆర్‌ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని నల్లగొండ జిల్లాలో బస్సు యాత్ర చేపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమవేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ నియోజకవర్గాన్ని రూ.వందల కోట్లతో అభివృద్ధి చేస్తామని, రూ.700 కోట్లతో నల్లగొండ చుట్టూ ఔటర్‌రింగ్‌ రోడ్డును నిర్మిస్తామన్నారు.త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. నల్లగొండలోని గడియారం సెంటర్‌లో 2వేల మంది సామర్థ్యంతో నీలగిరి నిలయం నిర్మిస్తామన్నారు. ఐటీ ఉద్యోగులకు సంబంధించి టాటా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏఎమ్మార్పీ లైనింగ్‌కు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని త్వరలో ఎస్‌ఎల్‌బీసీతో సహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయిస్తామన్నారు. ఆగస్టులో బ్రాహ్మణవెల్లంల నుంచి 60 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ఇప్పిస్తామన్నారు.

జగదీ్‌షరెడ్డికి రూ.5 వేల కోట్ల ఆస్తులు

వాటర్‌ప్లాంట్‌ పెట్టి మంచినీరు అమ్ముకున్న మాజీమంత్రి జగదీశరెడ్డి రూ.5 వేల కోట్లు సంపాదించాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తన దగ్గర జగదీశరెడ్డికి సంబంధించిన మూడు మర్డర్‌కేసులు, ఆయన కర్ణాటక, మహారాష్ట్రల్లోని కేసుల వివరాలు ఉన్నాయన్నారు. తనకు గుర్తులేని విషషమైన జగదీశరెడ్డి మంచినీరు అమ్ముకున్న విషయాన్ని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి బయటపెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలన్నారు. చాలారోజులకు సుఖేందర్‌రెడ్డి జగదీశరెడ్డి గురించి మంచి వివరాలు చెప్పాడని ప్రశంసించారు. జగదీశరెడ్డి ఉద్యమం పేరుతో, మంత్రి పదవితో వేల కోట్లు సంపాదించడంతో పాటు హైదరాబాద్‌లో 80 ఎకరాల ఫాంహౌజ్‌ ఏర్పాటుచేసుకున్నాడని తెలిపారు. తనకు కనీసం నల్లగొండలో ఇల్లు కూడా లేదని అద్దె ఇంట్లోనే ఉంటున్నానని తెలిపారు. ఏడుసార్లు అఫిడవిట్‌ దాఖలు చేశానని, తనకు ఎలాంటి ఆస్తులు లేవన్నారు.

నేటి రఘువీర్‌రెడ్డి నామినేషనకు భారీగా తరలిరావాలి

నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్‌రెడ్డి బుధవారం నామినేషన దాఖలు చేస్తున్నందున భారీగా ప్రజలు తరలిరావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ముఖ్యంగా మహిళలు అధికసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల్లోగా ర్యాలీ పూర్తి చేస్తామన్నారు. తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారని, తనకు వచ్చిన మెజార్టీ కంటే అదనంగా 25 వేల మెజార్టీతో రఘువీర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన జూరూరి రమేష్‌, బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:24 AM