Share News

కరుణాసాగరా..కరుణచూపవా?

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:36 PM

కరుణాసాగరా..! నీ చల్లని చూపులతోనైనా క్షేత్ర ప్రాశస్త్యం కలిగిన నిర్మాణాలకు చోటు కల్పించవా అంటూ భక్తులు ఆ దేవదేవుడిని వేడుకుంటున్నారు.

కరుణాసాగరా..కరుణచూపవా?

ఇరుకైన పరకామణి మండపం

యాగశాల మండపానికి యోగం లేదా?

ధార్మిక, సాహిత్య సభలకు కరువైన వేదిక

యాదరుషికి చెట్టు నీడనే గతా

ప్రహసనంగా ప్రసాదాల కొనుగోలు

యాదగిరిగుట్ట: కరుణాసాగరా..! నీ చల్లని చూపులతోనైనా క్షేత్ర ప్రాశస్త్యం కలిగిన నిర్మాణాలకు చోటు కల్పించవా అంటూ భక్తులు ఆ దేవదేవుడిని వేడుకుంటున్నారు. మొక్కు కానుకలు లెక్కించే పరకామణి మండప నిర్మాణంలో డొల్లతనం.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ధార్మిక, సంగీత మహాసభల వేదిక లేకపోవడం.. క్షేత్రానికి ఆద్యుడైన రుషిపుంగవుడు యాదరుషికి ఆలయం లేకపోవడం.. ఇలా ఎన్నో చారిత్రాత్మక విషయాలను ఆలయ పునర్మిర్మాణ సమయంలో అధికారులు విస్మరించారని భక్తులు ఆరోపిస్తున్నారు.

యాదగిరీశుడిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా మొక్కుకానుకల రూపంలో హుండీల్లో నగదు, నగలను సమర్పిస్తుంటా రు. సమర్పించిన కానుకలు లెక్కించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పరకామణి మండపాన్ని నిర్మిస్తున్నామని వైటీడీఏ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్ర ధానాలయ ఉత్తర, దక్షిణ దిశల్లోని మొదటి ప్రాకార మండపాలను నిర్మించారు. ఇందులో ఉత్తర దిశలోని మండపంలో లిఫ్టును సైతం ఏర్పాటుచేశారు. అయితే అధికారులు అనుకున్నరీతిలో పరకామణికోసం నిర్మించామన్న మండపాలు ఇరుకుగా ఉండడంతో హుండీ లెక్కించేందుకు అనువుగా లేకపోవడంతో ఉద్ఘాటన అనంతరం ఒకటి, రెండు మాత్రమే వినియోగించారు. తర్వాత కొండపై మొదటి ఘాట్‌రోడ్‌లోని హరితాకాటేజ్‌, ఆ తర్వాత కొండకింద సత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్‌ లో పరకామణి సేవలు నిర్వహిస్తున్నారు.

ధార్మిక, సాహిత్య సభలకు కరువైన వేదిక

నిజాం కాలంనుంచి ఆలయ విస్తరణకు ముందు వరకు యాదగిరికొండపై ధార్మి క, సాహిత్య, సంగీత మహాసభల నిర్వహణకు ప్రత్యేక వేదిక ఉండేది. ఆలయ విస్తరణలో సంగీత భవన మండపంగా పిలుచుకునే ఈ వేదిక ప్రస్తుతం కనుమరుగైంది. ఈ సంగీత మండపంలో ఎందరో వాగ్గేయకారులు, కళాకారులు, పండితులు తమ ప్రదర్శనలతో క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తల్లో ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పెంపొందించారు. తొలిరోజుల్లో ప్రఽధానాలయ ప్రవేశ ద్వారం పక్కన ఉన్న బంకర్‌లో భజనలు, హరికథా కాలక్షేపాలు కొనసాగేవి. ఆ తర్వాత ఆలయంతోపాటు జరిగిన అభివృద్ధిలో భాగంగా ప్రధానాలయానికి అభిముఖంగా సంగీత భవన మండపాన్ని అధికారులు నిర్మించారు. సుమారు 170 ఏళ్లక్రితం బాపట్ల లక్ష్మీకాంతయ్య అనే భక్తుడు మహోత్సవాల సమయంలో ధార్మిక సాహిత్య, సంగీత మహాసభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి ఆలయ విస్తరణ వరకు ఉత్సవాల సమయంలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొనసాగింది. కాగా ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు వేదికను నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఉద్ఘాటన జరిగాక కూడా మరిచిపోయారు. ఉద్ఘాటన జరిగి రెండేళ్లు కావస్తున్నా ధార్మిక, మహాసభల కోసం శాశ్వత నిర్మాణం గురించి అధికారులు ఆలోచించడం లేదని, ఇకనైనా సంగీత భవన మండపం నిర్మించాలని కోరుతున్నారు.

బ్రహ్మోత్సవ కల్యాణ మండపంపై వేడుక సాగేనా?

లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవాన్ని వీక్షించి తరించడానికి దేశవిదేశాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తుంటారు. కొండపైన తూర్పు తిరువీధిలో కృష్ణరాతి శిలలతో బ్రహ్మోత్సవ మండపం పేరిట మండపాన్ని వైటీడీఏ నిర్మించింది. అయితే ఉద్ఘాటనకు ముందే శ్రీవైష్ణవ పండితుల్లో తూర్పు-దక్షిణ దిశలో నిర్మించిన ఈ మండపం వాస్తు ప్రకారం సరైంది కాదనే వాదనలతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. విమర్శలు వినిపిస్తున్నా అధికారులు మాత్రం బ్రహ్మోత్సవ మండపంపైనే ఉద్ఘాటన అనంతరం తొలిసారి బ్రహ్మోత్సవ తిరుకల్యాణాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా మరి ఈ సంవత్సరం రానున్న రెండో వార్షిక బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవం బ్రహ్మోత్సవ మండపంపై నిర్వహించేందుకు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. శ్రీవైష్ణవ, ఆగమ పండితులు అప్పట్లో ఆక్షేపణ చెప్పిన విధంగా ఈ సంవత్సరం చెబితే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగేనా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆలయ విస్తరణకు ముందు కొండపై తూర్పు తిరువీధిలోని కల్యాణమండపంలో ప్రతీ సంవత్సరం వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో జగద్రక్షకుడు నారసింహుడు, సౌభాగ్యవతి మహాలక్ష్మీ అమ్మవార్ల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగేది.

విస్మరించిన యాగశాల నిర్మాణం

ప్రధానాలయంలో నిత్య యాగశాల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రఽధానాలయంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆనుకొని ఉన్న మండపంలో స్నపన తిరుమంజనాలతో హోమ పూజలు చేసేవారు. తర్వాత ప్రధానాలయంలో, మరి కొంతకాలానికి ప్రధానాలయ దక్షిణ దిశలో కల్యాణమండపంలో యాగశాల ఏర్పాట్లు ఉండేవి. ప్రస్తుతం ఉత్తర దిశలో తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

సరిగాలేని ప్రసాద విక్రయశాల కౌంటర్లు

యాదగిరికొండపైన దేవదేవుడి దర్శనానంతరం ప్రసాదాలు కొనుగోలు చేద్దామన్నా అదో ప్రహసనంగా మారిందని భక్తులు అంటున్నారు. వైటీడీఏ అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్వామివారి ప్రసాదాల విక్రయశాల కౌంటర్లు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఒకరిని ఒకరు తోసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా సెంట్రల్‌ ఏసీతో నిర్మించిన ప్రసాదాల తయారీ భవనంలో ఏసీలు పనిచేయకపోవడంతోపాటు సరైన వెంటిలేషన్‌ లేక పోవడంతో కరెంటు పోయినప్పుడు భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ అధికంగా ఉన్న సందర్భాల్లో ప్రసాద విక్రయశాఖ కౌంటర్‌ సిబ్బందితో భక్తులు వాగ్వాదాలకు దిగుతున్నారు. ప్రసాదాల విక్రయశాలలో తయారీ సిబ్బంది, ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు కౌంటర్ల వద్దకు భక్తులు వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే మార్గం ఉండడంతో అనేక పర్యాయాలు తోపులాటలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి.

యాదరుషికి ఆలయమేదీ?

జంతువులు, విషసర్పాలు సంచరించే దట్టమైన కీకారణ్యంతో కూడిన కొండగుహను ఆవాసంగా చేసుకుని విభాండక మహర్షి కుమారుడు యాదరుషి లక్ష్మీనారసింహుడి సాక్షాత్కారంకోసం తపస్సు చేసినట్లు స్కంద పురాణం వివరిస్తుంది. యాదరుషి తపస్సు ఫలితంగానే ఈ కొండకు యాదగిరికొండగా నామకరణంతోపాటు స్వయంభు లక్ష్మీ సమేతుడై నారసింహుడు పంచరూపాల్లో అవతరించి భక్తులను కటాక్షిస్తున్నట్లు స్థల పురాణం చెబుతోంది. సాక్షాత్తు ఓ మహాపుణ్యక్షేత్ర ఆవిర్భావానికి కారణమైన రుషిపుంగవుడు యాదరుషికి సైతం కొండపైన ఎలాంటి ఆవాసం లేకపోవడం శోచనీయమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు కొండకింద తులసీకాటేజ్‌లోని మర్రిచెట్టు వద్ద యాదరుషి విగ్రహం ఉండేది. కొండకింద రహదారి విస్తరణలో భాగంగా మర్రిచెట్టు, యాదరుషి విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో హిందుత్వ సంఘాల నుంచి తీవ్రస్థాయిలో నిసనలు వెల్లువెత్తాయి. దీంతో తేరుకున్న అధికారులు కొండపైన విష్ణుపుష్కరిణి వద్దనున్న యాదరుషి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేతులు దులుపుకున్నారు. యాదగిరిక్షేత్రానికి ఆద్యుడు అత్యంత తపో సంపన్నుడైన యాదరుషికి ఆలయం కాని, స్థల పురాణం తెలిపే ఏర్పాట్లు అధికారులు నేటికీ చేయలేదనే వాదనలు వినిసిస్తున్నాయి.

అద్దాల మండపం ఆర్జిత సేవలకేనా?

యాదగిరికొండను సందర్శించే భక్తులు స్వామివారి అవతార విశేషాలు, క్షేత్ర మహత్యాన్ని తెలిపే చిత్రపటాలను మండపంలోని అద్దాల్లో వీక్షించి తరించే విధంగా ఏర్పాట్లు ఉండేవి. దీంతో ఆలయాన్ని సందర్శించిన అనంతరం భక్తులు అద్దాల మండపాన్ని సైతం పిల్లాపాపలతో కలిసి దర్శించేవారు. అయితే కాలక్రమేణా అద్దాల మండపం శిథిలావస్థకు చేరగా తొలగించిన అధికారులు దాత సాయంతో ప్రధానాలయానికి ముందు వైపు నిర్మించగా, దానిని ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలగించారు. తాజాగా ఆలయ పునర్నిర్మాణంలో ప్రధానాలయ అష్టభుజి పడమటి వాయువ్యదిశలో దాతల సహకారంతో అద్దాల మండపాన్ని నిర్మించారు. స్వర్ణశోభితంగా తీర్చిదిద్దిన ఈ అద్దాల మండపా న్ని భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు ఉంటాయని మాజీ సీఎం కేసీఆర్‌ ఆలయ ఉద్ఘాటన సమయంలో ప్రకటించిన సంగతి విధితమే. అయితే ఈ అద్దాల మండపంలో ప్రతీ శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవంతోపాటు విశేష పర్వదినాల్లో స్వామివారి కైంకర్యాల నిర్వహణకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇకనైనా అద్దాల మండపాన్ని సామాన్య భక్తులు వీక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆంజనేయుడికి ఆస్థాన పరంగానే అర్చనలా

ప్రధానాలయంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నేటికీ ఆర్జితసేవల్లో నిత్య సహస్రనామార్చనలు మినహా మిగిలిన కైంకర్యాలు ఆస్థానపరంగానే సాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ప్రధానాలయంలోని ఆంజనేయస్వామి సన్నిధిలోనే ప్రతీ మంగళవారం ఆకుపూజ వేడుకలు నిర్వహించేవా రు. ప్రధానాలయంలోని ఆంజనేయుడి సన్నిధిలో కొనసాగే అన్ని వేడుకల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉండేది. ఉద్ఘాటన తర్వాత ప్రతి నిత్యం ఉద యం, సాయంత్రం జరిగే ఆంజనేయస్వామి సహస్రనామార్చన కైంకర్యం టి కెట్‌ పొందిన భక్తులు ముఖమండపంలో నుంచే ఈ సేవల్లో పాల్గొంటున్నారు. ప్రధానాలయ ఉద్ఘాటన జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా కొండపైన విష్ణు పుష్కరిణి వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయం ఏమాత్రం అభివృద్ధికి నోచలేదు.

దర్శన క్యూలైన్‌తో తప్పని బాధలు

యాదగిరిక్షేత్రంలో దర్శన క్యూకాంప్లెక్స్‌, బంగారు లోహ క్యూలైన్‌ బాక్సులు, ప్రధాన ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి నడవలేక ఇబ్బందులుపడుతున్నారు. నాలుగు అంతస్తుల దర్శన క్యూకాంప్లెక్స్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడంతోపాటు నాలుగు అంతస్థుల్లోని ర్యాంపు గుండా పైకి చేరుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక ప్రధానాలయ తూర్పు రాజగోపురం ముందున్న బంగారు లోహపు దర్శన క్యూలైన్ల బాక్సుల్లోకి చేరుకున్న భక్తులు చలికాలంలో చలితో, వర్షాకాలం వర్షపు జల్లుతో, వేసవి కాలంలో వడగాలులు తదితర వాతావరణ ప్రభావాలతో క్యూలైన్‌ బాక్సుల్లో ఎక్కువ సేపు నడవలేని పరిస్థితి. అక్కడ నుంచి అష్టభుజి ప్రాకార మండపం గుండా తూర్పు పంచతల రాజగోపురం, ఈశాన్య త్రితల రాజగోపురం నుంచి ప్రధానాలయంలోనికి రద్దీ ఉన్నా లేకున్నా నడవాల్సి వస్తుండడంతో భక్తులు మండిపడుతున్నారు.

శ్రీవారి పాదాలకు మరో ఆలయమా?

యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు తప్పనిసరిగా దర్శించుకునే మరో ముఖ్యమైన, పర మ పవిత్రమైన పుణ్యస్థలం స్వామివారి నిజపాదాల ఆలయం. ఈ ఆలయం కొండకిం ద పాత గోశాలను ఆనుకుని ఏకశిలపై స్వామివారి పాదాల గుర్తులు ఉంటాయి. వీటిని దర్శించుకుంటే సాక్షాత్తు స్వామివారిని దర్శించుకున్నట్టేనని భక్తుల నమ్మకం. అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని ఆలయ విస్తరణలో భాగంగా డ్రైన్‌లైన్‌కు అడ్డుగా ఉందని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా పక్కనే మరో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు ముందు 2022లో మహిమాన్విత ఆలయాన్ని తొలగించేందుకు అధికారులు యత్నించగా.. హిందుత్వ సంఘాలు, భక్తులు, స్థానికులు ఆందోళనలు తెలపడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ పాదాల ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రం అడుగులు వేయలేదు.

Updated Date - Feb 07 , 2024 | 11:36 PM