Share News

కమనీయం.. శివపార్వతుల కల్యాణం

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:50 PM

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో మహాశివరాత్రి జాతర సందర్భంగా మండలకేంద్రం జనసంద్రమైంది.

కమనీయం.. శివపార్వతుల కల్యాణం
మేళ్లచెర్వు ఆలయం వద్ద కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

మేళ్లచెర్వు, మార్చి 9 : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో మహాశివరాత్రి జాతర సందర్భంగా మండలకేంద్రం జనసంద్రమైంది. శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణ మహోత్సవం, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విద్యుత ప్రభలను తిలకించడానికి, తెలుగు రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో గ్రామం, ఆలయ ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది.

కన్నులపండుగా కల్యాణం

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వయంభూ శంభులింగేశ్వరస్వామి వారికి, ఇష్టకామేశ్వరి అమ్మవారికి అర్చకులు విష్ణువర్థనశర్మ, ధనుంజయశర్మ, రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కన్నులపండువగా కల్యాణ తంతు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను రాత్రి 2 గంటలకు స్వామి వారిని నంది వాహనంపై, అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు తీసుకెళ్లారు. మొదటగా ఎదుర్కోళ్ల మహోత్సవం జరిగింది. అనంతరం కల్యాణ మండపానికి తీసుకెళ్లి, అశేష భక్త జనసమక్షంలో ముత్యాల తలంబ్రాలతో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున నంది వాహనంపై స్వామి, అమ్మవార్లను ఉదయం నాలుగ గంటలకు ప్రధాన ఆలయానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ మహేంద్రకుమార్‌, ఈవో నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులు శనివారం స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

స్తంభించిన ట్రాఫిక్‌

జాతరకు పెద్దసంఖ్యలో భారీగా తరలిరావడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంతో పాటు మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు గుడికి, గ్రామానికి మధ్యలోని ఎనఎస్పీ కాల్వల బ్రిడ్జిలపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. పోలీసుల అప్రమతతో ట్రాఫిక్‌ను నియంత్రించారు.

అట్టహాసంగా కబడ్డీ పోటీలు ప్రారంభం

జాతర సందర్భంగా అట్టహాసంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను సీఐ రజితారెడ్డితో కలిసి పోశం నర్సిరెడ్డి శనివారం రాత్రి ప్రారంభించారు. మొదటి రోజు ఎనిమిది మంది మహిళ, పురుషుల జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. మొదటగా సూర్యాపేట, రంగారెడ్డి మహిళా జట్లు తలబడ్డాయి. కార్యక్రమంలో ఎంపీపీ పద్మ, తహసీల్దార్‌ జ్యోతి, ఆలయ చైర్మన శంభిరెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన ఎద్దుల పందేలు రెండోరోజు శనివారం ఉదయం నుంచే కొనసాగుతున్నాయి.

మట్టపల్లి క్షేత్రంలో

మఠంపల్లి : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శనివారం నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తవత్సలుడికి నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. తర్వాత ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. కల్యాణోత్సవం అనంతరం ఉత్సవమూర్తులకు పురవీధుల్లో గరుడవాహన సేవ నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్యాలు నిర్వహించారు. ఆలయ చైర్మన చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:50 PM