బడికి వేళాయె
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:57 AM
పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పిల్లలు వేసవి సెలవులు, ఆటలకు స్వస్తిపలికి బడిబాట పట్టనున్నారు. పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంను సిద్ధం చేశారు.

నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బడిబాట
ఈ ఏడాది నుంచి ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల బోధన
మౌలిక వసతుల కల్పనకు రూ.25కోట్లు
జిల్లాలో 665మంది ఉపాధ్యాయుల కొరత
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పిల్లలు వేసవి సెలవులు, ఆటలకు స్వస్తిపలికి బడిబాట పట్టనున్నారు. పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంను సిద్ధం చేశారు. స్కూళ్లు పునఃప్రారం భం నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బడులను సిద్ధం చేశా యి. జిల్లాలో మొత్తం 712 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాల లు 481,ప్రాథమికోన్నత పాఠశాలలు 68, ఉన్నత పాఠశాలలు 163 వరకు ఉన్నాయి.
జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. దీంతో ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభానికి ముందే మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఫర్నీచర్, తాగు నీ రు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వసతులు కల్పించేందుకు ‘అమ్మ ఆదర్శ’ కమిటీల ద్వారా పలు పాఠశాలల్లో పనులు చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం, మధ్యలోనే చదువు మానేసి వెళ్తున్న వారు కూడా ఉంటుండటంతో విద్యార్థుల నమోదుపై జిల్లా యంత్రాంగం ఈ సారి దృష్టి సారించింది. ప్రతీ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు 10శాతం అదనంగా కొత్త అడ్మిషన్లు చేపట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్యను 10శాతానికి మించి పెంచిన ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ప్రశంసపత్రాలు అందజేయనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వర కు విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడంపై దృష్టి కేంద్రీకరించడంతోపాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ నిర్వహించనున్నారు.ఉత్తమంగా బోధనచేసే ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు, మెరుగైన సేవలందించిన ఉపాధ్యాయులకు కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రాలు అందజేసేందుకు విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఒకటినుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు ప్రభుత్వం ద్వారా ముద్రితమైన పాఠ్యపుస్తకాలతోనే బోధించాలనే ఆదేశాలు ఉన్నాయి. ఈసారి 100శాతంమేర పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయి.
రూ.25కోట్లతో మరమ్మతులు
ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నిధులు రూ.25కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ‘అమ్మ ఆదర్శ’ కమిటీల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాల్లో మరుగుదొడ్లు, నీటిసౌకర్యం, పైపులై న్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే మరమ్మతు పనులు ప్రా రంభం కాగా, ఈ నెలాఖారులోగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులు చర్యలు తీసుకున్నా రు.ఇప్పటికే పలు పాఠశాలల్లో పనులు చివరి దశలో ఉన్నా యి. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 30లోగా పూర్తి చేయాలని కమిటీలకు అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఇదిలా ఉండ గా,జిల్లాలో మొత్తం 3,465 మంది ఉపాధ్యాయులు 2,800 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 665 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు తాజా గా ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు షె డ్యూల్ జారీచేసింది.దీంతో మరిన్నిపోస్టులు ఖాళీ కానున్నాయి.
ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్ల బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్లబోధనకు గతంలోనే శ్రీకారం చుట్టింది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో సైతం కూలీ పనిచేసుకునే వారు వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం స్థోమతకు మించి ఖర్చుచేసేందుకు వారు వెనుకాడడం లేదు. కష్టమైనప్పటికీ సమీపంలోని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో పిల్లలను చేర్పిస్తున్నారు. ఉన్నత చదువుల సమయంలో ఇంగ్లీష్ కీలకం కావడంతో తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ కోసం అందరూ క్రమేపీ ప్రైవేట్ స్కూళ్ల బాటపడుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల సంఖ్య ఏటా తగ్గుతోంది. నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే సర్కార్ బడుల్లో ఆంగ్లమాధ్యంలో బోధనకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆంగ్లంలో బోధనకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను సైతం పాఠశాలలకు అందజేశారు. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు ఒక యూనిఫాం అందజేయనున్నారు.
విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తాం : డీఈవో కె.నారాయణరెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తాం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాల్లో మరమ్మతులు చేపట్టాం. జూన్ 30 నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించనున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాం.