బడి బస్సు భద్రమేనా?
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:59 AM
బడికి వేళ అయింది. ఉదయాన్నే చకచకా రెడీ అయిన చిన్నారులు భుజాన బ్యాగ్‌లు వేసుకొని, బస్సు కోసం రోడ్డుపైకి పరుగులు తీస్తుంటారు. బస్సు రాగానే ఎక్కి బడికి వెళతారు.

విద్యార్థుల తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త
బస్సుల కండీషన్, డ్రైవర్ల లైసెన్స్‌లను పరిశీలించాల్సిందే!
భువనగిరి రూరల్: బడికి వేళ అయింది. ఉదయాన్నే చకచకా రెడీ అయిన చిన్నారులు భుజాన బ్యాగ్‌లు వేసుకొని, బస్సు కోసం రోడ్డుపైకి పరుగులు తీస్తుంటారు. బస్సు రాగానే ఎక్కి బడికి వెళతారు. అయితే ఈలోపు బస్సు ఆగిపోతే.. అందులోని చిన్నారులు, ఇంటివద్ద తల్లిదండ్రులకు టెన్షన్ తప్పదు. అందుకే పాఠశాలకు పంపే తల్లిదండ్రులు తప్పనిసరిగా చిన్నారుల బస్సులు, ఆటోలు కండీషన్‌లో ఉన్నాయా? లేవా? సరి చూసుకోవాలని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమ విద్య అందించాలనే ఉద్దేశంతో ఫీజుల రూపంలో రూ.వేలు ఖర్చుచేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. కేవలం చదువుపై మాత్రమే దృష్టి సారించకుండా పిల్లలు నిత్యం ఇంటి నుం చి పాఠశాలలు, కళాశాలలకు రాకపోకలు సాగించే బడి బస్సుల సామర్థ్యం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎం తైనా ఉంది. వీరే కాకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు వాటి నిర్వహణపై జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థుల ప్ర యాణం సురక్షితమవుతుంది. ఈ నెల 12 నుంచి పాఠశాల లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, రవాణా శాఖ కార్యాలయంలో ఈ నెల 15లోగా ఫిట్‌నెస్ పత్రాలు సమర్పించి సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి ఉంది. అయితే చాలావరకు యాజమాన్యాలు అంతగా ఆసక్తి చూ పడంలేదు. విద్యార్థుల ప్రయాణ విషయంలో జాగ్రత్తలతో అన్ని పత్రాలు సమకూర్చుకొని ఫిట్‌నెస్ చేయించుకుంటేనే బస్సులు రోడ్లపైకి రావాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీల పరిధిలో 274 స్కూల్ బస్సులు ఉండగా, అందులో ఇప్పటివరకు 130 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ నిర్వహించుకున్నారని, మిగతా 20 బస్సులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని ఇంకనూ 124 స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ చేయించాల్సి ఉంది.
ఇవి తప్పనిసరి
బస్సుల్లో ఏదేని అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పేందుకు వీలుగా ఫైర్ ప్రొటెక్షన్ సిలిండర్ ఉండాలి.
పాఠశాల, కళాశాలల బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించేందుకు వీలుగా డీటీవో కార్యాలయంలో అధికారులతో ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, బీమా పొల్యూషన్ పత్రాలు డ్రైవర్‌కు సంబంధించి లైసెన్స్ సమర్పించి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది.
పాఠశాల, కళాశాల బస్సులు నడిపే డ్రైవర్ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి.
డ్రైవర్‌కు ఐదేళ్ల హెవీ వాహనం నడిపిన అనుభవం ఉండాలి.
ప్రతీ పాఠశాల బస్సుకు సహ పాఠశాల యువకుడి (అటెండర్)ను నియమించుకోవాలి.
బస్సులోని కిటికీలకు ఇరువైపులా నాలుగు వరుసలా పైపులను విద్యార్థులు తల, చేతులు బయటపెట్టి తొంగి చూడకుండా ఉండేలా అమర్చాలి.
బస్సు కండీషన్‌లో ఉండడమే కాకుండా బ్రేక్ వేసిన స మయంలో నాలుగు వైపులా పార్కింగ్ లైట్లు వెలగాలి.
చిన్న పిల్లలు ఎక్కేలా మెట్ల కింద భాగంలో మరో మెట్టు ఏర్పాటు చేసుకోవాలి.
ప్రథమ చికిత్స బాక్సు అత్యవసర ద్వారాలు ఉండాలి.
ఫిట్‌నెస్ లేకుండా తిరిగితే బస్సులు సీజ్ చేస్తాం : సాయికృష్ణ, డీటీవో, యాదాద్రి భువనగిరి జిల్లా.
పాఠశాలలు, కళాశాలలు పునర్‌ప్రారంభం అవుతున్న దృష్ట్యా బస్సులకు తప్పకుండా సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. జిల్లాలో నమోదైన పాఠశాలల బస్సుల యజమానులు వీటిపై దృష్టి సారించాలి. ఏఒక్క పత్రం లేకుండా బస్సు రోడ్డెక్కి నా చర్యలు తీసుకోవడమే కాకుండా సీజ్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా 274 స్కూల్ బస్సులు ఉండగా, ఇప్పటి వరకు 130 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ నిర్వహించాం. మిగిలిన వారు వెంటనే ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి.